పాత గొడవలతోనే దాడి చేసినట్లు బాధితుడి కుమారుడు ఫిర్యాదు
తిరుపతిలో ఘటన..
తిరుపతి క్రైమ్: తిరుపతిలో వైఎస్సార్‌సీపీ నాయకుడిపై శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అలిపిరి సీఐ రామారావు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఎన్జీవో కాలనీకి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు వెంకటశివారెడ్డి ఇంటి ఎదురుగా గిరీష, శ్రీలక్ష్మి అనే వ్యక్తులు నివాసం ఉండేవారు. వీరు ప్రతి రోజు మద్యం, గంజాయి తాగి రచ్చరచ్చ చేస్తుండేవారు. వారి ప్రవర్తన వల్ల ఎదురు ఇంట్లో ఉంటున్న వెంటకశివారెడ్డి కుటుంబానికి నిద్ర ఉండేది కాదు.
ఈ విషయంపై వెంకటశివారెడ్డి, గిరీషకు మధ్య తరచూ గొడవలు జరిగేవి. అదేవిధంగా గిరీష కొద్దికాలం కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి స్టలం ఇప్పిస్తానని రూ.20లక్షలు తీసుకుని మోసం చేశాడు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడిగా ఉన్న వెంకటశివారెడ్డిని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. దీంతో గిరీష కుటుంబ సభ్యులను వెంకటశివారెడ్డి పిలిపించి వారి డబ్బులు ఇవ్వాలని సూచించారు. దీంతో వెంకటశివారెడ్డి, గిరీష మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఆ గొడవలు జరిగిన అనంతరం గిరీష, శ్రీలక్ష్మి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. వారు ఎన్నికలకు ముందు తిరిగి వచ్చారు.
హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి ఇవ్వాల్సిన డబ్బులు గురించి ఎన్నికల తర్వాత మాట్లాడదామని గిరీష చెప్పాడు. ఈ నేపథ్యంలో వెంకటశివారెడ్డి శనివారం ఉదయం ఎన్జీవో కాలనీలోని తన నివాసం నుంచి వాకింగ్‌కు బయలుదేరి వెళ్లారు. మెయిన్ రోడ్డులో ఉన్న అరవింద స్కూల్ సమీపాన ఆటోస్టాండ్ వద్దకు వెళ్లగానే ఆయనపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేశారు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన వెంకటశివారెడ్డిని స్థానికులు హుటాహుటిన ఆస్పపత్రికి తరలించారు.
వెంకటశివారెడ్డిపై గిరీష కక్ష పెంచుకుని, ఆయన ఉదయం వాకింగ్‌కి వెళ్లే సమయంలో దాడి చేయాలని ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు సీసీ ఫుటేజీలో నమోదైంది. వెంకటశివారెడ్డి కుమారుడు బాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ రామారావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment