వాకింగ్‌కు వెళ్లొస్తుండగా బీర్ బాటిళ్లతో దాడి
బండరాయితో తలపై మోది చంపే యత్నం.. తీవ్రగాయాలతో ఆస్పత్రికి..
మైదుకూరు: పోలింగ్ రోజు ఏజెంట్‌గా కూర్చున్నాడనే అక్కసుతో వైఎస్సార్ జిల్లా మైదుకూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డిపై బుధవారం సాయంత్రం టీడీపీ వర్గీయులు హత్యాయత్నం చేశారు. బాధితుడి కథనం ప్రకారం... చాపాడు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డి సమగ్ర శిక్ష అభియాన్‌లో ఏఈగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన మైదుకూరులోని బద్వేలు రోడ్డులో నివాసముంటున్నారు. ఈ ఎన్నికల్లో స్వగ్రామం విశ్వనాథపురంలో పోలింగ్ సందర్భంగా సోమవారం వైఎస్సార్‌సీపీ తరపున ఏజెంట్‌గా కూర్చున్నారు.
అంతకుముందు రోజు టీడీపీ వర్గీయులు ఏజెంట్‌గా కూర్చోవద్దని బెదిరించారు. వారి బెదిరింపులకు తలొగ్గక ఆయన వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌గా కూర్చున్నారు. ఆ కడుపుమంటతో టీడీపీ వర్గీయులు చంద్ర ఓబుళరెడ్డి ప్రొద్దుటూరు రోడ్డులోని బైపాస్ వద్దకు రోజూ వాకింగ్‌కు వస్తుంటారని తెలుసుకుని.. బుధవారం సాయంత్రం అదే రోడ్డులోని ఏవీఆర్ స్కూల్ వద్ద కాపు కాశారు. వాకింగ్ ముగించుకుని వస్తున్న చంద్ర ఓబుళరెడ్డిపై విశ్వనాథపురం గ్రామానికి చెందిన కార్తీక్ రెడ్డి, ఇల్లూరు సుబ్బారెడ్డి, బొచ్చు సుబ్బారెడ్డి, మరో ముగ్గురు దాడి చేసి బీర్ బాటిళ్లతో తలపై కొట్టారు.
‘చెప్పినా వినకుండా ఏజెంట్‌గా కూర్చుంటావా...ఇప్పుడే నిన్ను చంపుతాం..’ అంటూ కేకలు వేశారు. వారి దెబ్బలకు తీవ్రంగా గాయపడిన చంద్ర ఓబుళరెడ్డి స్పృహ తప్పి కింద పడిపోయాడు. అయినా విడిచి పెట్టకుండా నిందితుల్లో కొందరు బండరాయిని ఎత్తి తలపై మోదేందుకు ప్రయత్నించారు. సమీపంలో ఉన్న కొందరు మహిళలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అతన్ని వదిలేసి తమ వెంట తెచ్చుకున్న బైకులపై పరారయ్యారు. తలపై తీవ్ర గాయాలైన చంద్ర ఓబుళరెడ్డిని మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
సంఘటన గురించి తెలియగానే ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌కు ముందు రోజే టీడీపీ వారు బెదిరించారని బాధితుని భార్య, కుమారుడు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేకు తెలిపారు. పథకం ప్రకారమే దాడి చేసి హత్యాప్రయత్నం చేశారని వారు చెప్పారు.
దాడి సమాచారం తెలియగానే చాపాడు ఎంపీపీ తెలిదేల లక్ష్మయ్య, మండల నాయకులు, మైదుకూరు సింగిల్ విండో చైర్మన్ మూలె సుధాకర్‌రెడ్డి, ఖాజీపేట వైఎస్సార్‌సీపీ నాయకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మైదుకూరు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఎంఆర్‌ఎఫ్ సుబ్బయ్య తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మైదుకూరు డీఎస్పీ వెంకటేశులు, రూరల్, అర్బన్ సీఐలు శ్రీనాథరెడ్డి, ఏపీ మస్తాన్ ఆస్పత్రికి వచ్చి చంద్ర ఓబుళరెడ్డితో మాట్లాడారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment