అందని పెన్షన్లతో అవస్థలు | Sakshi
Sakshi News home page

అందని పెన్షన్లతో అవస్థలు

Published Mon, May 6 2024 12:10 AM

అందని

ఖమ్మంవ్యవసాయం: పెన్షన్లు సకాలంలో అందకపోవటంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ విశ్రాంత ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా మార్కెట్‌ కమిటీల విశ్రాంత ఉద్యోగుల సంఘంఽ అధ్యక్ష, కార్యదర్శులు కనపర్తి బాబు, జల్లా వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఉన్నతాధికారులకు, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూడా వినతిపత్రం అందించామని, వృద్ధాప్యంలో పెన్షన్‌తో జీవనం సాగిస్తున్న తమకు సకాలంలో నెలసరి పెన్షన్లను అందించి ఆదుకోవాలని కోరారు.

వడదెబ్బతో వ్యక్తి మృతి

పెనుబల్లి: వడదెబ్బకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వీఎంబంజరలో చోటుచేసుకుంది. మండలంలోని సూర్యబంజరతండాకు చెందిన భూక్య రాములు (44) ఈ నెల 3న వీఎం బంజరకు ఓ పార్టీ మీటింగ్‌కు హాజరై, అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. రాములు కోసం రెండు రోజులుగా కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఆదివారం వీఎంబంజర – బయ్యన్నగూడెం గ్రామాల మధ్య చెరువు సమీపంలో రాములు మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాములు వడదెబ్బకు గురై మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు వీఎం బంజర పోలీసులు కేసు నమెదు చేశారు. రాములు మృతదేహాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

గొర్రెలు మేపేందుకు వచ్చి..

వడదెబ్బతో నారాయణపేట వాసి మృతి

నేలకొండపల్లి: గొర్రెలు మేపేందుకు నారాయణపేట జిల్లా నుంచి వడదెబ్బతో ఓ వ్యక్తి మృతిచెందాడు. నారాయణపేట జిల్లా దన్వాడ మండలంలోని గోటూరు గ్రామానికి చెందిన నర్సప్ప (55) తనకున్న వంద గొర్రెలను మేత కోసం తీసుకొచ్చాడు. ఇటీవల తన కుమారుడి పెళ్లి కోసం వెళ్లి రెండు రోజుల కిందట తిరిగొచ్చాడు. ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి మంద మధ్యలోనే కుప్పకూలాడు. చాలా సేపటి తర్వాత రైతులు నర్సప్పను గమనించి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. కుటుంబసభ్యులు వచ్చి మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లారు.

రెండు చోట్ల చోరీ

బోనకల్‌: మండల కేంద్రంలోని ఖమ్మం రోడ్డులో డెయిరీ మిల్క్‌, పక్కన ఉన్న ఫ్యాన్సీ స్టోర్స్‌లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. షాపుల వెనుక తలుపులు పగులగొట్టిన దుండగులు లోపలికి ప్రవేశించి రూ.20 వేలు నగదు ఎత్తుకెళ్లారని డెయిరీ మిల్క్‌ యజమాని రాజు తెలిపారు. పక్కనే ప్యాన్సీ షాపులోకి వెళ్లి సామగ్రిని అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ మధుబాబు తెలిపారు.

చెరువు కట్టపై ఉద్రిక్తత

నేలకొండపల్లి: మండలంలోని భైరవునిపల్లి చెరువు వద్ద శనివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చెరువు లూటీ అవుతోందనే ప్రచారంతో రాజకీయ నాయకులు అక్కడికి చేరుకున్నారు. చెరువులో ఆదివారం చేపల వేటకు అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ, శనివారం రాత్రి చెరువు లూటీ జరుగుతోందని గ్రామంలో ప్రచారం జరగటంతో రెండు వర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకుల మధ్య ఘర్షణ పడ్డారు. అసభ్య పదజాలంతో ఒకరిపై ఒకరు దూషణలు, అరుపులు, కేకలతో చెరువు కట్ట వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. కాగా, సొసైటీకి చెందిన సభ్యులు 32 మందిపై బైండోవర్‌ ఉండటంతో ఒక్కరూ కూడా చెరువు కట్ట వద్దకు రాకపోవడం కొసమెరుపు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. అదివారం చేపల వేట సాగించిన అధికారులకు కేవలం క్వింటా చేపలు మాత్రమే లభ్యం కావటం విశేషం.

లారీ పైనుంచి కిందపడి వ్యక్తికి గాయాలు

బోనకల్‌: మండలంలోని ముష్టికుంట్ల గ్రామంలో శనివారం రాత్రి లారీ పైనుంచి కిందపడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. మొక్కజొన్న బస్తాలు లారీలో లోడ్‌ చేస్తున్న క్రమంలో గాలి దుమారంతో కూడిన వర్షం వచ్చింది. ఈ క్రమంలో టార్పాలిన్‌ కప్పేందుకు లారి ఎక్కిన పెద్దిపాక కోటేశ్వరరావు గాలి దుమారానికి టార్పాలిన్‌తో సహా లారీ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుబాబు తెలిపారు.

అందని పెన్షన్లతో అవస్థలు
1/4

అందని పెన్షన్లతో అవస్థలు

అందని పెన్షన్లతో అవస్థలు
2/4

అందని పెన్షన్లతో అవస్థలు

అందని పెన్షన్లతో అవస్థలు
3/4

అందని పెన్షన్లతో అవస్థలు

అందని పెన్షన్లతో అవస్థలు
4/4

అందని పెన్షన్లతో అవస్థలు

Advertisement
Advertisement