నేడు జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

Published Mon, May 6 2024 12:15 AM

-

ఖమ్మంవన్‌టౌన్‌: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బోనకల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు చింతకాని, 6 గంటలకు ముదిగొండలో పర్యటిస్తారు.

ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరాలకు ఏర్పాట్లు

ఖమ్మం స్పోర్ట్స్‌ : ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అసోసియేషన్‌ కార్యదర్శి కె.ఆదర్శ్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల సీనియర్‌ క్రీడాకారులు ఫుట్‌బాల్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంతేగాక ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరాలు నిర్వహించే వారికి ఉచితంగా ఫుట్‌బాల్‌ పరికరాలు అందజేస్తామని తెలిపారు. వివరాలకు 99896 47696 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

నేటి నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ కోర్సుల 2వ, ఆరవ సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 6 నుంచి, నాలుగో సెమిస్టర్ల పరీక్షలు 7 నుంచి నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ ఎస్‌.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ తిరుమలాదేవి ఆదివారం తెలిపారు. 2వ సెమిస్టర్ల పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు 7, 9, 15, 17, 20, 22, 28, 30 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరో సెమిస్టర్‌ పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29, 31, జూన్‌ 7, 11, 12, 13 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని వివరించారు. రెండో సెమిస్టర్‌ పరీక్షలకు 68,139, నాలుగో సెమిస్టర్‌కు 56,899, ఆరో సెమిస్టర్‌కు 46,077 మొత్తం 1,71,115 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్‌లో 44, ఉమ్మడి ఖమ్మంలో 30, ఉమ్మడి ఆదిలాబాద్‌లో 49 మొత్తం 123 సెంటర్లు ఏర్పాటు చేసి 123 మంది చీఫ్‌సూపరింటెండెంట్లను నియమించామని పేర్కొన్నారు. ఒక్కో సెంటర్‌కు ఒక అజ్జర్వర్‌, వర్సిటీ పరిధిలో పది ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు నియమించినట్లు తెలిపారు. హాల్‌టికెట్లు కళాశాలల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, కళాశాలల నుంచి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

రేపు ఖమ్మానికి

వెంకటేష్‌ రాక

ఖమ్మంమయూరిసెంటర్‌ : సినీ హీరో వెంకటేష్‌ మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు టూర్‌ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తుంబూరు దయాకర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి వియ్యంకుడైన వెంకటేష్‌ ఆయన తరఫున ప్రచారం చేసేందుకు వస్తున్నట్లు తెలిపారు. 7వ తేదీ సాయంత్రం 5గంటలకు ఖమ్మం మయూరిసెంటర్‌ నుంచి ఇల్లెందు క్రాస్‌ రోడ్‌ వరకు జరిగే రోడ్‌ షోలో పాల్గొంటారని, రాత్రి 8 గంటలకు కొత్తగూడెం క్లబ్‌లో జరిగే పుర ప్రముఖుల సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నాయకులు, వెంకటేష్‌ అభిమానులు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
Advertisement