జిల్లాలో అకాల వర్షం | Sakshi
Sakshi News home page

జిల్లాలో అకాల వర్షం

Published Mon, May 6 2024 12:15 AM

జిల్ల

● పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వడగండ్ల వాన ● విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ● నేలరాలిన మామిడి ● ఉష్ణోగ్రతల నుంచి కాస్త ఉపశమనం

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అకాల వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పలుచోట్ల పిడుగులు పడ్డాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో వర్షం కురవడంతో జిల్లా వాసులకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. అయితే ఈదురుగాలులతో జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. చేతికందే దశలో ఉన్న మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న మామిడి నేలరాలింది. పలుచోట్ల చివరి దశలో ఉన్న వరి కోతలు, ధాన్యం పనులకు ఆటంకం కలిగింది.

కూలిన హోర్డింగ్‌లు..

ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పలుచోట్ల హోర్డింగ్‌లు కూలిపోయాయి. ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. కారేపల్లి మండలం గేటు కారేపల్లిలో రాత్రి 7 గంటల సయంలో 14.5 మి.మీ. వర్షపాతం నమోదు కాగా ఖమ్మం నగరంలోని ఖానాపురం వద్ద 13 మి.మీ., కామేపల్లి మండలం లింగాల వద్ద 8, ఖమ్మం నగరంలోని ప్రకాష్‌నగర్‌ వద్ద 7, రఘునాథపాలెం, ముదిగొండ మండలం పమ్మిలో 4.8, పంగిడిలో 4.5, నేలకొండపల్లిలో 3.5, చింతకాని మండలం నాగులవంచలో 2.8, చింతకానిలో 2.3, కొణిజర్లలో 1.5, ఖమ్మం నగరంలోని ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్‌ వద్ద 0.8, బాణాపురం, బచ్చోడులలో 0.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు..

ఈదురుగాలులు, అకాల వర్షంతో జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల రహదార్ల వెంట చెట్లు కూలి విద్యుత్‌ లైన్లపై పడగా, పలుచోట్ల స్తంభాలు సైతం విరిగిపడ్డాయి. పలుచోట్ల రాత్రి 8 గంటల వరకు కూడా సరఫరా పునరుద్ధరించలేదు. ఖమ్మం నగరంలోని మమత రోడ్‌, ధంసలాపురం తదితర సబ్‌స్టేషన్లలో శనివారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా పరికరాలు కాలిపోయి ఫీడర్లు దెబ్బతిన్నాయి. దీంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం కలిగింది. ఆ పనులు కొనసాగుతున్న సమయంలోనే ఆదివారం సాయంత్రం వర్షం, గాలులతో మరోసారి అంతరాయం వాటిల్లింది.

ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం

అకాల వర్షంతో ఉష్ణోగ్రతల నుంచి కొంత ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. ఈ ఏడాది రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నెలరోజులుగా ఆరెంజ్‌ అలర్ట్‌(40–45 డిగ్రీలు) ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మే నెల ఆరంభం నుంచి రెడ్‌ అలర్ట్‌కు పెరిగాయి. పలుచోట్ల 45 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు.

నేలరాలిన మామిడి..

ఈదురుగాలులు, అకాల వర్షానికి ఖమ్మం, కూసుమంచి, మధిర, వైరా తదితర డివిజన్లలో కోత దశలో ఉన్న మామిడి పంట నేలరాలింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం సత్తుపల్లి డివిజన్‌లోని పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, తల్లాడ, కల్లూరు మండలాల్లో ఈదురుగాలులు, అకాల వర్షానికి మామిడి నేల రాలగా, ఆదివారం జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో పంట దెబ్బతింది.

జిల్లాలో అకాల వర్షం
1/2

జిల్లాలో అకాల వర్షం

జిల్లాలో అకాల వర్షం
2/2

జిల్లాలో అకాల వర్షం

Advertisement
Advertisement