‘ధనాధన్‌’ ధోని డకౌట్‌.. ప్రీతి జింటా రియాక్షన్‌ వైరల్‌ | Sakshi
Sakshi News home page

‘ధనాధన్‌’ ధోని డకౌట్‌.. ప్రీతి జింటా రియాక్షన్‌ వైరల్‌

Published Mon, May 6 2024 11:01 AM

IPL 2024 Preity Zinta Reaction To Dhoni First Ball Duck Breaks Internet

చెన్నై సూపర్‌ కింగ్స్‌పై జైత్రయాత్రను కొనసాగించాలనుకున్న పంజాబ్‌ కింగ్స్‌కు భంగపాటు ఎదురైంది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 28 పరుగుల తేడాతో సామ్‌ కరన్‌ బృందాన్ని చిత్తు చేసింది.

తద్వారా  ఐపీఎల్‌లో వరుసగా ఆరోసారి సీఎస్‌కేపై గెలుపొందాలని భావించిన పంజాబ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తన బ్యాటింగ్‌ మెరుపులతో పాటు.. స్పిన్ మాయాజాలంతో గైక్వాడ్‌ సేనకు ఈ విజయాన్ని అందించాడు.

ఫలితంగా 2021 నుంచి చెన్నైపై పంజాబ్‌ కొనసాగిస్తున్న ఆధిపత్యానికి గండిపడింది. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ స్టార్‌ మహేంద్ర సింగ్ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరగడం మాత్రం నిరాశను కలిగించింది.

ఐపీఎల్‌-2024లో మూడో మ్యాచ్‌ నుంచి బ్యాటింగ్‌ మొదలుపెట్టిన తలా.. పంజాబ్‌తో పోరుకు ముందు ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వింటేజ్‌ ధోనిని గుర్తు చేస్తూ పరుగుల విధ్వంసం సృష్టించాడు.

కానీ ధర్మశాల మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్‌ అయ్యాడు.

ఈ నేపథ్యంలో పంజాబ్‌ కెప్టెన్‌ సామ్‌ కరన్‌తో పాటు ఫ్రాంఛైజీ సహ యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ధోని బౌల్డ్‌ కాగానే సీఎస్‌కే ఫ్యాన్స్‌ అంతా సైలెంట్‌ అయిపోగా.. ప్రీతి జింటా అయితే సీట్లో నుంచి లేచి నిలబడి మరీ ధోని వికెట్‌ను సెలబ్రేట్‌ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

కాగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(21 బంతుల్లో 32), వన్‌డౌన్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌(19 బంతుల్లో 30)తో పాటు రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43) రాణించారు.

ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్‌కే తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ను జడ్డూ దెబ్బ కొట్టాడు. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌(30), సామ్‌ కరన్‌(7), అశుతోశ్‌ శర్మ(3) రూపంలో కీలక వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు కూడా రాణించడంతో సీఎస్‌కే పంజాబ్‌ను 139 పరుగులకే పరిమితం చేసి.. ‘కింగ్స్’‌ పోరులో తామే ‘సూపర్’‌ అనిపించుకుంది.‌

Advertisement
Advertisement