ప్రాదేశిక పోరు.. పల్లెల్లో జోరు | spatial fighting in villeges | Sakshi
Sakshi News home page

ప్రాదేశిక పోరు.. పల్లెల్లో జోరు

Published Tue, Apr 1 2014 12:49 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM

కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది.

అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఓట్ల లెక్కింపు తేదీపై కోర్టు తీర్పు కోసం ప్రజలు, అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నికల ఘట్టం పట్టణాల నుంచి పల్లెలకు మళ్లింది. పట్టణాలతో పోల్చి చూస్తే పల్లెల్లోనే ఎన్నికల జోరు ఎక్కువగా కన్పిస్తుంది. ఉగాది, శ్రీరామనవమి పండుగలు కూడా కలిసి రావడంతో గ్రామాల్లో జోష్ పెరిగింది. ఎనిమిది సంవత్సరాల తరువాత పల్లె సీమల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.



ఈ నెల 6వ తేదీన 31 మండలాల్లోనూ... 11వ తేదీన 32 మండలాల పరిధిలో ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. 63 జెడ్పీటీసీ స్థానాలకు 239 మంది, 849 ఎంపీటీసీ స్థానాల బరిలో 2,131 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పురపాలక ఓటర్ల కన్నా మూడింతలు ఎక్కువగా 21 లక్షల ఓటర్లు ప్రాదేశిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులోనూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వేర్వేరుగా బ్యాలెట్ పత్రాలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది.

 పల్లెల్లో గత నెల 25వ తేదీ నుంచే ప్రచార పర్వం ప్రారంభమైనా పురపాలక ఎన్నికలు ఉండటంతో కొంత మందకొడిగా సాగింది. ఇప్పుడు పురపాలక ఎన్నికలు ముగియడంతో ప్రచారం ఊపందుకుంది. రైతు కుటుంబాలు, రైతు కూలీలు, శ్రామికులు, మహిళలు ఎక్కువగా ఉండే పల్లెల్లో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మంచి ఊపు మీద కనిపిస్తున్నారు. కొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నా కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్రులు నామమాత్రంగా బరిలో ఉన్నారు. జెడ్పీ పీఠం బీసీ జనరల్‌కు కేటాయించడంతో ఆ స్థానాన్ని దక్కించుకోవడానికి వైఎస్సార్‌సీపీ శిబిరంలో ఉత్సాహం కనిపిస్తోంది.

మొదటి విడత ఎన్నికల ప్రచార పర్వం ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలతో ముగుస్తున్నందున ఈ నాలుగు రోజులూ తార స్థాయికి చేరుకోనుంది. రెండో విడత ప్రాంతాల్లో ప్రచారానికి తొమ్మిది రోజులు సమయం మిగిలి ఉంది. రానున్న ఈ తొమ్మిది రోజులూ పల్లెల్లో ప్రచారం జోరుగా కొనసాగనుంది.

ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎంలు) కాకుండా 42 లక్షల బ్యాలెట్ పత్రాలు, 7 వేలకు పైగా బ్యాలెట్ బాక్సులు వినియోగించనున్నారు. కాగా, అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీపై చర్చలు, అంచనాలు, ఆ తరువాత మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీలు), జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరనే అంశంపై పల్లెల్లో వాడివేడిగా చర్చలు కొనసాగుతున్నాయి. తొలి విడత పోరుకు ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు చేరినట్లు సమాచారం. మిగతా ఏర్పాట్లలో జెడ్పీ, జిల్లా యంత్రాంగం తలమునకలై ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement