ఓటెత్తిన చైతన్యం | muncipal elections polling | Sakshi
Sakshi News home page

ఓటెత్తిన చైతన్యం

Published Mon, Mar 31 2014 2:12 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

ఓటెత్తిన చైతన్యం - Sakshi

ఓటెత్తిన చైతన్యం

 సాక్షి ప్రతినిధి, అనంతపురం : సూరీడుతో ఓటర్లు పోటీపడ్డారు.. ఎండ మండే కొద్దీ ఓటర్లు అధికమయ్యారు.. సూర్యుడు మండుతున్న కొద్దీ ఓటర్లు రెట్టింపవుతూ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.. ఓటు హక్కును వినియోగించుకున్నారు. మడకశిరలో సీఐ ఆరోహన్‌రావు దౌర్జన్యం.. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వీరంగం వంటి చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తాడిపత్రి 12వ వార్డులో ఈవీఎం మొరాయించడంతో మంగళవారం రీ-పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.


 ఇదీ ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తీరు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం నగరపాలక సంస్థతోపాటు 11 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీ స్థాయిలో బారులు తీరారు.

మండుతున్న ఎండను లెక్క చేయలేదు. ఉక్కపోతనూ ఖాతరు చేయలేదు. యువతీ యువకులతో వృద్ధులు కూడా పోటీపడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మడకశిర నగర పంచాయతీ పరిధిలో అత్యధికంగా 85.22 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతపురం నగరంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడంపై పెద్దగా ఆసక్తి చూపలేదు.

 షరా మామూలే..

 2004 సార్వత్రిక ఎన్నికలు.. 2005 మున్సిపల్ ఎన్నికలు.. 2009 సార్వత్రిక ఎన్నికలు.. 2012 ఉప ఎన్నికలు తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈవీఎంలు పలు చోట్ల మొరాయించడంతో పోలింగ్ అర్ధగంట పాటు ఆగిపోయింది. అనంతపురం నగరంలో 21వ డివిజన్ పోలింగ్ బూత్‌లో, తాడిపత్రిలో 34వ వార్డు, గుంతకల్లులో 7వ వార్డు, గుత్తిలో 5, 21వ వార్డులు, కళ్యాణదుర్గంలో 1, 3వ వార్డులు, రాయదుర్గంలో 14వ వార్డు, ధర్మవరంలో 21వ వార్డు, పుట్టపర్తిలో 11, 18వ వార్డులు, హిందూపురంలో 12వ వార్డు, మడకశిరలో 15, 16, 19వ వార్డులు, కదిరిలో 5, 15, 25, 33వ వార్డుల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌కు కాసేపు అంతరాయం గలిగింది.


ఆ తర్వాత ఈవీఎంలను సరిచేసి.. పోలింగ్‌ను నిర్వహించారు. తాడిపత్రిలో 12వ వార్డులో 20 ఓట్లు పోలైన తర్వాత ఈవీఎం మొరాయించింది. కేవలం పది ఓట్లు మాత్రమే పోలైనట్లు ఈవీఎంలో నమోదైంది. ఆ ఈవీఎం స్థానంలో కొత్తది ఏర్పాటుచేసి.. పోలింగ్ కొనసాగించడానికి అధికారులు ప్రయత్నించారు. కానీ.. అది కూడా మొరాయించడంతో పోలింగ్‌ను మంగళవారానికి వాయిదా వేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించాలని జిల్లా ఎన్నికల అధికారి డీఎస్ లోకేష్‌కుమార్ నివేదిక పంపారు. అందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అంగీకరించడంతో 12వ వార్డుకు మంగళవారం రీ-పోలింగ్ నిర్వహించనున్నారు.

 బీఎల్‌వోల నిర్లక్ష్యం..

 రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు స్లిప్పుల పంపిణీని తొలి సారిగా బీఎల్‌వోలకు అప్పగించింది. పోలింగ్‌కు 24 గంటల ముందే ఓటర్లకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తామని పేర్కొంది. రాజకీయ పార్టీలు పంపిణీ చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది. కానీ.. ఎన్నికల సంఘం ఆదేశాలను బీఎల్‌వోలు నీరుగార్చారు. ఓటరు స్లిప్పుల పంపిణీని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు.

 స్లిప్పులేని వారిని ఓటు వేసేందుకు పోలింగ్ అధికారులు నిరాకరించడంతో వేలాది మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుతిరిగారు. అనంతపురం నగరంలో అత్యల్ప పోలింగ్ నమోదు కావడానికి ఇదే ప్రధాన కారణమని అధికారులు అంగీకరిస్తుండటం గమనార్హం. గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, హిందూపురం, కదిరి, ధర్మవరం మున్సిపాల్టీల్లోనూ ఇదే పరిస్థితి.

 తప్పుల తడకగా ఓటర్ల జాబితా..

 మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలు తప్పులతడకగా మారాయి. ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఇతర నియోజకవర్గాల్లోని ఓటరు జాబితాలో పేర్లున్న వారి పేర్లను కూడా మున్సిపాల్టీల ఓటర్ల జాబితాలో చేర్చారు. ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. అనంతపురం నగరంలో 20వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి స్వరూపకు మద్దతుగా ఓటు వేయించుకునే కుట్రతో పెరవలి గ్రామానికి చెందిన ఓటర్లను ఆ జాబితాలో చేర్పించారు.

సుమారు 130 మంది ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకోవడంతో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర నియోజకవర్గాల్లోని ఓటర్లు ఇక్కడెలా ఓటు వేస్తారని నిలదీశారు. ఓటర్లను భయపెడుతున్నారంటూ స్వరూప ఆందోళనకు దిగడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. టీడీపీ నేతలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. హిందూపురం, ధర్మవరం, కదిరి మున్సిపాల్టీల్లోనూ ఇదే పరిస్థితి.

 మడకశిరలో సీఐ.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ వీరంగం..

 మడకశిరలో నడువలేని స్థితిలో ఉన్న ముగ్గురు వృద్ధులను ఓటు వేయించేందుకు కాంగ్రెస్ నేత, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి 16వ పోలింగ్ బూత్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడే బందోబస్తును పర్యవేక్షిస్తోన్న సీఐ ఆరోహన్‌రావు ఓటర్లను వాహనాల్లో తరలిస్తావా అంటూ ప్రభాకర్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. లాఠీలతో కుళ్లబొడిచారు. సీఐ దెబ్బకు ప్రభాకర్‌రెడ్డి ఎడమ చేయి విరగడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహించాయి.

 ఎమ్మెల్యే సుధాకర్ నేతృత్వంలో పోలీసుస్టేషన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ సుబ్బారావు సంఘటనపై విచారణ జరిపి.. సీఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే సుధాకర్ ధర్నాను విరమించారు. పోలింగ్‌కు ఆటంకం కల్పిస్తారనే ఉద్దేశంతో తాడిపత్రిలో ఆదివారం ఉదయం ఏడు గంటలకే వైఎస్సార్‌సీపీ నేతలు పేరం నాగిరెడ్డి, వీఆర్ రామిరెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

 పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేసి జేసీ ప్రభాకర్‌రెడ్డి.. తాడిపత్రి పోలీసుస్టేషన్‌ను ముట్టడించి డీఎస్పీ నాగరాజు, సీఐ సుధాకర్‌రెడ్డిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాసేపు హల్‌చల్ చేశారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఆయన ఇంటికి తరలించిన పోలీసులు.. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. రాయదుర్గంలో 12వ వార్డులో ఓ టీడీపీ నేత ఇంట్లో ఓటర్లకు భారీ ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తోండటంతో.. ఆ ఇంటిని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ముట్టడించాయి.

ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతపురం, రాయదుర్గంలో ఓటర్లకు టీడీపీ నేతలు నకిలీ రూ.వెయ్యి నోట్లు పంపిణీ చేశారు. టీడీపీ నేతలు ఇచ్చిన కరెన్సీ నోట్లతో వస్తువులు కొనుగోలు చేసేందుకు దుకాణాలకు వెళ్లిన ఓటర్లకు.. అవి నకిలీ నోట్లని తేలడంతో లబోదిబోమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement