Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

America Donald Trump Govt backs down on tariffs1
సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా

సుంకాల విదింపుపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald trump) విదిస్తున్న సుంకాలపై ప్రపంచ దేశాలకు ఊరట లభించింది. చైనా మినహా మిగతా దేశాలకు అమెరికా సుంకాల నుంచి ఊరటనిచ్చింది.కానీ చైనాకు మాత్రం 125 శాతానికి సుంకాలు పెంచిన అమెరికా. మొత్తంగా 75 దేశాలపై విదించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా వైట్‌హౌస్‌ అధికారికంగా ప్రకటించింది.ఇదిలా ఉంటే అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్‌ కొనసాగుతోంది. ట్రంప్‌ మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది.

China imposes additional 84% tariff on US goods2
అమెరికాకు షాకిచ్చిన చైనా

బీజింగ్‌: అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్‌ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald trump) మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా (China Raises Tariffs On US Goods) నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్‌ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం.#BREAKING 🇨🇳#CHINA to lift additional tariffs to 84% on ALL imported🇺🇸, effective from April 10th.As I said, don't underestimate China's determination to safeguard its legitimate rights and interesting when facing the U.S. global #tariffs bully. pic.twitter.com/BxlKxCGzXw— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) April 9, 2025 మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్‌ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు.కానీ మంగళవారం డెడ్‌లైన్‌ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లెవిట్‌ మీడియా ముందుకొచ్చారు.‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్‌ పోరు ముదురు పాకాన పడింది.చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్‌ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 (Trump's 104%) శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్‌ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు.

Sakshi Editorial On Dilsukhnagar bomb blasts death penalty to guilty3
సరైన న్యాయం!

పుష్కరకాలం క్రితం ఒక మునిమాపు వేళ హైదరాబాద్‌ నగరంలో 18 మంది అమాయకుల ప్రాణాలు తీసిన బాంబు పేలుళ్ల ఉదంతాల్లో దోషులుగా తేలిన ఆరుగురు నిందితులకూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణశిక్షను ధ్రువీకరిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు బాధిత కుటుంబాలకు మాత్రమే కాదు, ఉగ్రవాద ఘటనలను వ్యతిరేకించే వారందరికీ ఊరటనిస్తుంది. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో రెండుచోట్ల జరిగిన ఈ పేలుళ్లలో మరో 131 మంది గాయాల పాలయ్యారు. వారిలో చాలామంది ఈనాటికీ ఆ గాయాలు కలిగించిన శారీరక, మానసిక క్లేశాల నుంచి కోలుకోలేకపోతున్నారు. మరణశిక్ష పడిన వారిలో రియాజ్‌ భత్కల్‌ అనే ఉగ్రవాది ఇప్పటికీ పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు. ఈ పేలుళ్లకు పథకం పన్నడంతోపాటు అందుకు కావల్సిన నిధుల సమీకరణ, పేలుడు పదార్థాలు, మనుషుల్ని సమకూర్చుకోవటం వగైరాలకు సూత్రధారి రియాజే. ఏవో కొన్ని ఉగ్రవాద ఘటనల ద్వారా దేశంలో అల్లకల్లోలం సృష్టించవచ్చని, దేశాన్ని బలహీనపరచవచ్చని ఈ బాపతు ఉగ్రవాదులు కలలుగంటారు. ఉగ్రవాదం మామూలు ఉన్మాదం కాదు. అది ఎప్పుడు ఎక్కడ తన విషపుకోరలు చాస్తుందో... ఎవరిని కాటేస్తుందో అంచనా వేయటం కూడా అసాధ్యం. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలు అక్కడి సైన్యం, దాని గూఢచార విభాగం ఐఎస్‌ఐ సహకారంతో శిక్షణ శిబిరాలు నిర్వహించటం, యువకులను తప్పుడు మార్గానికి మళ్లించటం, సాధారణ ప్రజానీకానికి హాని కలిగించగల చర్యలకు ప్రేరేపించటం దశాబ్దాలుగా సాగుతోంది. ఆ సంస్థల ప్రేరణతో సొంతంగా ఉగ్రవాద సంస్థలను నెలకొల్పి భయోత్పాతాన్ని సృష్టించటం భత్కల్‌ లాంటివారికి లాభసాటి వ్యాపారంగా కూడా మారిందని దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఉదంతంపై చేసిన దర్యాప్తులో వెల్లడైంది. మంగళూరు సమీప ప్రాంతాల్లో రియాజ్‌ భత్కల్‌ భారీయెత్తున రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు నిర్వహించాడని, జిహాద్‌ పేరుతో దేశంలోనూ, వెలుపలా లక్షలాది రూపాయలు వసూలు చేసి సొంత ఖాతాలకు మళ్లించుకున్నాడని కూడా బయటపడింది.తమను తాము మత సంరక్షకులుగా చిత్రించుకోవటం, జిహాద్‌ చేస్తున్నామని మభ్యపెట్టడం భత్కల్‌ లాంటివారికి రివాజు. వీరి వలలోపడి అనేకమంది యువకుల జీవితాలు నాశనమయ్యాయి. జనసమ్మర్దంగల ప్రాంతాల్లో బాంబులుంచి సాధారణ పౌరుల ప్రాణాలకు హాని కలిగించే ఇలాంటి వారికి కఠినమైన శిక్ష విధించటం సమాజ శ్రేయస్సు కోసం తప్పనిసరి. ఈ పన్నెండేళ్ల కాలంలోనూ వీరు తమ చర్యలకు పశ్చాత్తాపం ప్రకటించటంగానీ, ఇకపై సత్ప్రవర్తనతో మెలుగుతామని గానీ ఎక్కడా చెప్పలేదు. వీరిలో పరివర్తనకూ లేదా సంస్కరణకూ అవకాశమే లేదని నిర్ధారణ కొచ్చినట్టు ఉన్నత న్యాయస్థానం చెప్పిందంటే ఈ నేరగాళ్లు ఎంత కరుడు గట్టిపోయారో అర్థమవుతుంది. ఉగ్రవాదులు మతం పేరు చెప్పుకోవచ్చుగానీ ఏ మతమూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు. ఉగ్రవాదానికి అసలు మతం ఉండదు. ఇలాంటి నేరగాళ్ల చర్యల వల్ల మాత్రమే మతం సురక్షితంగా మనుగడ సాగించగలదని అందులోని వారెవరూ విశ్వసించరు కూడా! కానీ అమాయకులను నమ్మించటానికి వీరు మతాన్ని సాధనంగా వాడుకుంటారు. వారిని మభ్యపెట్టడం కోసం ఆధ్యాత్మి కతను ప్రబోధిస్తారు. క్రమేపీ తమ దురాలోచనను వారి మెదళ్లలోకి ఎక్కిస్తారు. అప్పటికల్లా ఆ యువకులు వీరి చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతారు. ఇలాంటివారికి చివరకు మిగిలేదేమిటో, వారి మానసిక, శారీరక స్థితిగతులు ఎలా దిగజారతాయో తెలియటానికి జాతీయ న్యాయ విశ్వ విద్యాలయ విద్యార్థులు కొందరు వారితో మాట్లాడి రూపొందించిన నివేదికే సాక్ష్యం. భిన్న వర్గాల ప్రజల మధ్య చిచ్చురేపి దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికీ, సమాజాన్ని భయభ్రాంతపరచటానికీ వీరు పాల్పడిన చర్యల వల్ల ఎక్కడెక్కడి నుంచో పొట్టకూటి కోసం ఈ మహానగరాని కొచ్చిన సాధారణ ప్రజానీకం బలయ్యారు. అందులో అన్ని మతాలవారూ ఉన్నారు. ఇంకా అమ్మ కడుపులోనే ఉన్న శిశువు మొదలుకొని స్త్రీలు, పిల్లలు కూడా వీరి మతిమాలిన చేష్టలకు బలైపోయారు. అనేకమంది జీవితాలు అనిశ్చితిలో పడ్డాయి. మనుషులైవుండి తోటి మనుషుల పట్ల ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా వ్యవహరించటం ఊహకందనిది. ఇలాంటి ఉదంతాల్లో ఆచూకీ దొరక్కుండా సులభంగా తప్పించుకోవచ్చని, నేర నిరూపణ అసాధ్యమని నేరగాళ్లు భావిస్తుంటారు. కానీ సాంకేతికత బాగా పెరిగిన ఈ కాలంలో అదేమంత కష్టం కాదని పకడ్బందీ దర్యాప్తు ద్వారా ఎన్‌ఐఏ నిరూపించింది. అయితే ఇలాంటి కేసుల్లో ఇమిడివుండే సంక్లిష్టతల వల్ల కావొచ్చు... మన న్యాయస్థానాలకు ఉండే పెండింగ్‌ కేసుల భారం వల్ల కావొచ్చు విచారణకు సుదీర్ఘ సమయం పడుతోంది. ఈ ఉదంతం చోటుచేసుకున్ననాటినుంచీ చూస్తే ఇప్పటికి పన్నేండేళ్ల సమయం పట్టింది. త్వరితగతిన విచారించి శిక్షించే వ్యవస్థ ఉంటే అలాంటి బాటలో పోయేవారికి అదొక హెచ్చరికగా పనికొస్తుంది. ఈ తరహా భయోత్పాత చర్యలకు ఒక నిరోధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఉదంతంలో అయిన వారిని కోల్పోయినవారికీ, ప్రాణాలతో బయటపడి భారంగా బతుకీడుస్తున్నవారికీ ఇప్పటికీ ప్రభుత్వ సాయం అందలేదంటే మనసు చివుక్కుమంటుంది. కాళ్లూ చేతులూ కోల్పోయి, చూపు, వినికిడి దెబ్బతిని, కనీసం మందులు కొనే శక్తిలేక అనేకులు కష్టాలు పడుతుండటం కలచివేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.

Sakshi Guest Column On Europe4
ప్రాసంగికత కోల్పోతున్న యూరప్‌?

డోనాల్డ్‌ ట్రంప్, జె.డి. వాన్స్‌ కలిసి వైట్‌ హౌస్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఎలా వేధించారో ప్రపంచం అంతా చూసింది. అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆయన పట్ల పాశవికంగా ప్రవర్తించి గుడ్‌ బై సైతం చెప్పకుండా తరిమేశారు. ‘రష్యాను ధిక్కరించండి, మీకు మేము అండగా ఉన్నాం...’ అంటూ ఉక్రెయిన్‌ అధినేతకు బాసటగా నిలిచి ఎంతగా ప్రోత్సహించాలో అంతగా ప్రోత్సహించిన యూరప్‌ ఈ ఘట్టాన్ని చేష్టలుడిగి చూసింది. యూరప్‌ ప్రభావం పలుచబడిపోతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?తగ్గుతున్న జనాభాయూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు బలమైన నాయ కత్వం లేదు. ఎవరి దౌత్య విధానం వారిదే. ‘యూరప్‌తో మాట్లాడా లనుకుంటే, నేను ఎవరికి ఫోన్‌ చేయాలి?’ అంటూ అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌ ఒక సందర్భంలో చేసిన సుప్రసిద్ధ వ్యాఖ్య ఇందుకు అద్దం పడుతుంది. యూరప్‌ దేశాలకు కాలం కూడా కలిసిరావడం లేదు. ఆ దేశాల్లో జననాల రేట్లు తగ్గుతున్నాయి.వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా, యువకులు తగ్గిపోతున్నారు. 2050 నాటికి యూరప్‌ సగటు వయసు 48 ఏళ్లకు పెరుగుతుంది. 60 ఏళ్లు దాటినవారు జనాభాలో 40 శాతం ఉంటారు. వందేళ్ల క్రితం ప్రపంచ జనాభాలో 25 శాతం యూరప్‌ దేశాల ప్రజలే ఉండేవారు. 2050 నాటికి, వీరి వాటా కేవలం 7 శాతానికి పరిమితం అవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.యుద్ధరంగానికి దళాలు సమకూర్చుకోవడం కూడా ఈ దేశాలకు సమస్యగా మారుతోంది. రష్యా ఇప్పటికే ఉత్తర కొరియా దళాలను రెగ్యులర్‌ ప్రాతిపదికన తన సైన్యంలో నియమించుకోవలసి వచ్చింది. పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతున్నా సరే... యూరప్‌ కాలం చెల్లిన తన పాత ఇమ్మిగ్రేషన్‌ విధానాలనే పట్టుకు వేలాడుతోంది. ఇది శ్రమశక్తి సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఉక్రెయిన్‌ శ్వేతజాతి శరణార్థుల పుణ్యమా అని పనిచేసే వారి సంఖ్య పెరిగినా ఇది తాత్కాలికమే! ఎదుగుదల లేని ఆర్థిక వ్యవస్థపరిపాలన సరిగా ఉండదు, ఆర్థికంగా పురోగమనం లేదు, వయసు మళ్లుతున్న జనం పెరుగుతున్నారు, వృత్తిపరమైన అవకా శాలూ అంతంత మాత్రమే. ఇలాంటి యూరప్‌ ఇండియాను ఎలా ఆకట్టుకుంటుంది? అమెరికాలో ఒంటి రంగును బట్టి కాకుండా, సత్తాను బట్టి మనుషుల్ని అంచనా వేస్తారు. ఆ మాదిరిగా మార్పు చెందటంలో యూరప్‌ సమాజం విఫలమైంది. నత్తనడకగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు, పెరుగుతున్న సామాజిక భద్రతా వ్యయాలు, నడ్డి విరుస్తున్న రుణభారం... ఇవన్నీ ఆ ఖండం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. అమెరికా పాత్రికేయుడు ఫరీద్‌ జకారియా చెప్పినట్లు, యూరప్‌ దుఃస్థితికి మూల కారణం ఆర్థిక వృద్ధి లోపం. ఉదాహర ణకు ఇటలీ ఆర్థిక వ్యవస్థలో ఏకంగా ఒక దశాబ్దంగా ఎలాంటి పెరుగుదల లేదు.ఆసియా, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాల్లోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు బలం పుంజుకుంటూ దూసుకు వస్తున్నాయి. గ్లోబల్‌ గవర్నెన్స్‌లో తమకు అధిక పాత్ర ఉండాలని ఈ దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, జీ–7, నాటో వంటి ప్రపంచ అధికార సంస్థలు ఇప్పటికీ యూరప్‌ చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. కానీ ఆర్థిక వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం అయిదు యూరప్‌ దేశాలు (జర్మనీ, యూకే, రష్యా, ఫ్రాన్స్‌, ఇటలీ) ప్రపంచ టాప్‌–10 ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నాయి. 2050 నాటికి ఈ అయిదింటిలో కేవలం జర్మనీ, యూకే రెండే టాప్‌–10 జాబితాలో మిగిలి ఉంటాయి. ఆ పదిలో వాటికి దక్కే ర్యాంకులు చిట్టచివరి తొమ్మిది, పది! ఇందుకు భిన్నంగా, వాటి కంటే ముందుండే ఇండియా, బ్రెజిల్, ఇంకా ఇతర వర్ధమాన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో తమకు గణనీయ పాత్ర ఉండాలని ఒత్తిడి చేస్తాయి. ఇప్పటి ప్రపంచ వ్యవస్థ పునర్‌ వ్యవస్థీకరణను ఎంతో కాలం అడ్డుకోలేరు.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్మాణం ఇప్పటికే కాలం చెల్లిపోయింది. దీన్ని ఎలా పునర్‌ వ్యవస్థీకరించాలనే అంశంపై పరిశీలన జరుగుతోంది. ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్‌ వంటి దేశాలు ప్రస్తుత సభ్యత్వాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఒత్తిడి తెస్తున్నాయి.ఇండియా జీడీపీలో మూడోవంతు కంటే తక్కువ, జపాన్‌ జీడీపీలో దాదాపు సగం ఉండే యూకే, ఫ్రాన్స్‌ వంటి దేశాలు శాశ్వత సభ్యు లుగా ఉండటం... ఇండియా, జపాన్‌ వెలుపల ఉండటం ఎలా సమంజసమనీ, వాటి మీద ఈ రెండు యూరప్‌ దేశాలు ఎలా పెత్తనం చలా యిస్తాయనీ గట్టి వాదన వినబడుతోంది. భద్రతా మండలి, జీ–7 లను సభ్యత్వ పరంగా విస్తరించడం మీద చర్చలు నడుస్తున్నాయి. ప్రపంచ పాలన సంస్థల పునర్‌ వ్యవస్థీకరణ జరగాలన్నది కాదనలేని అంశం. తిరుగులేని అమెరికా?శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా మున్ముందు కూడా ప్రబలమైన ప్రపంచ శక్తిగా కొనసాగుతుంది. చైనా, ఇండియా వంటి దేశాలు దాన్ని వెన్నంటి ఉంటాయి. ఒకవేళ అధిగమించినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఏమైనా, రెండో ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు గడిచే లోపే అప్పటి విజేతల్లో ఒక్క అమెరికా మినహా మిగిలినవన్నీ టాప్‌–10 జాబితా నుంచి కను మరుగవుతాయి.అమెరికా లోలోపల పలు మార్పులు చెందుతోంది. జనాభా వర్గాల్లో పరివర్తన ఫలితంగా రాజకీయంగానూ మార్పులు సంభవి స్తున్నాయి. నల్ల జాతీయుడిని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆఫ్రో–ఇండి యన్‌ మహిళ ఉపాధ్యక్ష పదవిని చేపట్టగలిగింది. భారతీయ అమెరికన్లు ప్రభుత్వంలో, విద్యా పారిశ్రామిక రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎగబాకారు. గుజ్జూభాయి కశ్యప్‌ పటేల్‌ ఎఫ్‌బీఐ పగ్గాలు చేపడతాడని ఎప్పుడైనా అనుకున్నామా? వివిధ దేశాల సంతతులకు చెందిన వ్యక్తులు ప్రభుత్వ, ఇతర రంగాల్లో ప్రముఖ స్థానాలు పొందడం వల్ల ఆ యా దేశాలు అమెరికాతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నాయి. విదేశీయులకు ప్రవేశం కల్పించడం వల్ల అమెరికా ప్రతిభ ఇనుమడించింది. యూరప్‌ ఈ విషయంలో విఫలమైంది. వర్ధమాన దేశాలు 21వ శతాబ్దపు నూతన వ్యవస్థకు రూపు దిద్దబోతున్నందున... ప్రపంచ వ్యవహారాల్లో యూరప్‌ పాత్ర క్రమేపీ క్షీణించిపోతుంది. యూరప్‌ గనుక జనాభా సంబంధిత (డెమో గ్రాఫిక్‌) నూతన విధానాలు రూపొందించకపోతే, ఆర్థిక పరమైన సంస్కరణలు చేపట్టకపోతే అది ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో గుర్తింపు లేని ఖండంగా మిగిలిపోతుంది.రానున్న రోజుల్లో ఆసియానే ప్రపంచ అధికార కేంద్రంగా ఆవి ర్భవిస్తుంది. 2020లో ఈ ఒక్క ఖండమే ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో 60 శాతం వాటా కైవసం చేసుకుంది. ఇదే ట్రెండ్‌ ఇక మీదటా కొనసాగబోతోంది. చైనా, ఇండియా ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమ పలుకుబడి పెంచుకుంటూ పోయి, ప్రపంచ పాలన (గ్లోబల్‌ గవర్నెన్స్‌)లో మార్పుల కోసం పట్టుబడతాయి. అయితే, అమెరికాతో విరోధం కారణంగా చైనా, యురోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు చేరువయ్యే అవకాశం ఉంది. ఇక చైనాతో సంబంధాలు బెడిసినందువల్ల ఇండియా, అమెరికాకు బహుశా మరింత దగ్గర అవుతుంది.మోహన్‌ గురుస్వామి వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయితmohanguru@gmail.com

CM Revanth Reddy Fires On BJP Leaders And PM Modi5
బ్రిటిషర్ల కంటే బీజేపీ డేంజర్‌: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు చాలా ప్రమాదకరమైన వారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ వాళ్లను తరిమి కొట్టినట్లే రాహుల్‌గాంధీ నాయకత్వంలో మనమంతా దేశంలో బీజేపీని ఓడించి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌గాంధీ నేతృత్వంలో ముందుకు తీసుకుని వెళ్తుంటే.. ప్రధానమంత్రి మోదీ మాత్రం దేశ వ్యాప్తంగా గాడ్సే విధానాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సదస్సు ‘న్యాయ్‌పథ్‌’లో బుధవారం సీఎం ప్రసంగించారు.వల్లభాయ్‌ పటేల్‌తో హృదయపూర్వక బంధం‘గుజరాత్‌ ప్రజలతో, వల్లభాయ్‌ పటేల్‌ వారసులతో మా తెలంగాణ ప్రజలకు సంబంధం ఉంది. దేశ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు తెలంగాణకు రాలేదు. అప్పుడు మాకు స్వాతంత్య్రం ప్రసాదించిన వల్లభాయ్‌ పటేల్‌తో మాకు హృదయపూర్వక బంధం ఉంది. వల్లభాయ్‌ పటేల్‌ మాకు స్వాతంత్య్రం ఇస్తే.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు. వల్లభాయ్‌ పటేల్‌ భూమి నుంచి నేను ఒకటే చెబుతున్నా. మేము బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం..అడ్డుకుంటాం. వారిని ఎవరూ క్షమించరు’ అని రేవంత్‌ అన్నారు.మోదీ గ్యారంటీ దేశాన్ని విభజించడమే..‘రాహుల్‌గాంధీ తెలంగాణలోని రైతులకు ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 10 నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ అమలు చేసి చూపించింది. మరో హామీ అయిన కులగణనను కూడా పూర్తి చేశాం. కేంద్రం జనగణనతో పాటు కుల గణన చేయాలనే డిమాండ్‌పై లోక్‌సభలో మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వకుండా రాహుల్‌గాంధీని మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. మరోవైపు ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని గాలికి వదిలేశారు. రెండు కోట్ల మందికి రాకపోయినా మోదీ, అమిత్‌షాలకు మాత్రం పదవులు వచ్చాయి. రైతులు కనీస మద్దతు ధర, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 15 నెలలపాటు ఆందోళన చేసినా మోదీ ప్రభుత్వం కనీసం వారితో చర్చలు కూడా జరపలేదు. మోదీ మణిపూర్‌లో మంటలు రాజేశారు. దేశ మూల వాసుల జీవన హక్కును కాలరాసే ప్రయత్నం చేశారు. మోదీ గ్యారంటీ దేశాన్ని విభజించడమే. కానీ రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో పేరిట 150 రోజులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.బీజేపీ ఓటమికి కంకణబద్ధులై వెళ్లాలిదేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ ఎన్నో ఆందోళనలు చేసినా.. ఆయనపై ఏనాడూ లాఠీ ఎత్తలేదు. కానీ స్వాతంత్య్రం వచ్చిన ఆరునెలల్లోనే గాడ్సేలు తూటాలు పేల్చి ఆయన్ను పొట్టన పెట్టుకున్నారు. గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకునేందుకు, మోదీ ఆలోచన విధానాన్ని అడ్డుకునేందుకే మనమంతా ఇక్కడ ఏకమయ్యాం. ఇక్కడకు వచ్చిన ప్రతి నాయకుడు, కార్యకర్త రానున్న ఎన్నికల్లో బీజేపీని ప్రతిచోటా ఓడించేలా కంకణబద్ధులై వెళ్లాలి. గాడ్సే భావజాలాన్ని ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీని, బీజేపీని అడ్డుకుని దేశాన్ని రక్షించాల్సిన అవసరం అందరిపైనా ఉంది..’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Young India Police School ready to start and CM Revanth To inaugurate6
యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌ సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివార్లలోని మంచిరేవులలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌ (వైఐపీఎస్‌) సిద్ధమైంది. దీన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయగా, ప్రస్తుతం ఏడు ఎకరాల్లో కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఈ స్కూల్‌లో మొత్తం 200 సీట్లు ఉంటాయి. వీటిలో 100 పోలీసు అధికారులు, ఉద్యోగుల పిల్లలకు, మరో 100 సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించారు. ప్రస్తుతానికి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రవేశాలు జరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చిన వైఐపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులను ఎంపిక చేశారు. ఒక్కో తరగతిలో 40 మంది చొప్పున ఐదు క్లాసుల్లో కలిపి మొత్తం 200 మంది విద్యార్థులు ఉంటారు. ఇప్పటి వరకు 83 మంది పోలీసు, నలుగురు సాధారణ పౌరుల పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చారు. భవిష్యత్తులో 5 వేల మందికి అడ్మిషన్లు ఇస్తారు. విద్యార్థుల కోసం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,750 పడకలతో హాస్టల్‌ను నిర్మిస్తారు.ప్రతిభగల ప్రైవేట్‌ టీచర్ల ఎంపికఈ స్కూల్‌లో పని చేయడానికి ప్రతిభ గల ప్రైవేట్‌ టీచర్లను ఎంపిక చేసుకున్నారు. విద్యాభ్యాసంతోపాటు విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి వైఐపీఎస్‌ కృషి చేస్తుంది. త్వరలో ఉత్తమ క్రీడా శిక్షకులను ఎంపిక చేయనున్నారు. ఏడుగురు సభ్యులతో కూడిన గవర్నింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో వైఐపీఎస్‌ నడుస్తుంది. దీనికి రాష్ట్ర డీజీపీ జితేందర్‌ ప్రెసిడెంట్‌గా, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, గ్రేహౌండ్స్‌ విభాగం అదనపు డీజీ ఎం.స్టీఫెన్‌ రవీంద్ర సెక్రటరీగా ఉంటారు. మరో నలుగురు సభ్యులు ఉన్నారు. విద్యార్థుల కోసం మూడు డిజైన్లతో కూడిన యూనిఫామ్స్‌ ఖరారు చేశారు.వైఐపీఎస్‌ నుంచి ప్రతి విద్యార్థి పరిపూర్ణ వ్యక్తిత్వంతో బయటకు వెళ్తాడు. అందుకే విద్య, క్రీడలతోపాటు అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పోలీసు విభాగంలో కిందిస్థాయి ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా తమ పిల్లల బాగోగుల కోసం సమయం ఇవ్వలేరు. పెద్దపెద్ద స్కూళ్లలో చేర్చాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని సీట్ల రిజర్వేషన్, ఫీజులు నిర్ధారించాం. – సీవీ ఆనంద్, పోలీసు కమిషనర్, హైదరాబాద్‌

Six platforms closed at Secunderabad railway station7
ప్లాట్‌ఫామ్స్‌ మూత.. రైళ్లు మళ్లింపు

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునర్నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్‌ వంతెన పనులు ప్రారంభిస్తుండటంతో 115 రోజుల పాటు సగం ప్లాట్‌ఫామ్స్‌ను మూసి వేయనున్నారు. ఈ నెల 15 నుంచి దశలవారీగా 120 జతల రైళ్లను దారిమళ్లించి వేరే స్టేషన్ల నుంచి తిప్పనున్నారు. వీటిల్లో సింహభాగం రైళ్లు చర్లపల్లి టెర్మినల్‌ నుంచి రాకపోకలు సాగించనుండగా, కొన్ని నాంపల్లి, కొన్ని కాచిగూడ స్టేషన్ల నుంచి నడుస్తాయి. స్కై కాంకోర్స్‌ కోసమే 100 రోజులు సికింద్రాబాద్‌ స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండంతస్తుల్లో భారీ స్కై కాంకోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో ఇదే కీలక భాగం. ఇది ఏకంగా 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రయాణికులకు అన్ని వసతులు ఇక్కడే ఉంటాయి. వేచి ఉండే ప్రాంతంతోపాటు రిటైల్‌ ఔట్‌లెట్స్, రెస్టారెంట్లు, కియోస్‌్కలు లాంటివన్నీ ఇందులోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇది లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్‌ వంతెనతో అనుసంధానమై ఉంటుంది. ఈ భారీ నిర్మాణానికి సంబంధించిన పునాదులు, కాలమ్స్‌ పనులు మొదలుపెడుతున్నారు. ఇందుకోసం 2–3, 4–5 ప్లాట్స్‌ ఫామ్స్‌ను 50 రోజులు చొప్పున మొత్తం వంద రోజులపాటు మూసేస్తారు. వీటిల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటుచేసే పనులు కూడా చేపడుతారు. ప్లాట్‌ఫామ్స్‌తోపాటు రైల్వే ట్రాక్‌ మొత్తానికి పైకప్పు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన పనులను కూడా ఈ నాలుగు ప్లాట్‌ఫామ్స్‌తో ప్రారంభిస్తున్నారు. తర్వాత ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 10 వైపు పనులు చేపడుతారు. పట్టాలపై ఇసుకబస్తాలు నింపి క్రేన్‌ ఏర్పాటు.. ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి పదో ప్లాట్‌ఫామ్‌ వరకు భారీ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీని పనుల కోసం మధ్యలో ఉండే ప్లాట్‌పామ్‌ 5–6 లో 500 టన్నుల సామర్థ్యంగల భారీ క్రేన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు ట్రాక్‌లపై ఇసుక బస్తాలు నింపి, దాని మీద క్రేన్‌ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం 15 రోజుల పాటు ఆ రెండు ప్లాట్‌ఫామ్స్‌ను మూసేస్తున్నారు. నిత్యం సికింద్రాబాద్‌ స్టేషన్‌ మీదుగా 250 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిల్లో ఇప్పటికే 6 జతల రైళ్లను చర్లపల్లి టెరి్మనల్‌ స్టేషన్‌కు శాశ్వతంగా మళ్లించారు. మరో 26 జతల రైళ్లను తాత్కాలిక పద్ధతిలో ఇతర స్టేషన్‌ల మీదుగా నడుపుతున్నారు. ఇప్పుడు 115 రోజులపాటు సింహభాగం ప్లాట్‌ఫామ్స్‌ను మూసేస్తుండటంతో 120 జతల రైళ్లను కూడా మళ్లిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్‌లో రైలు సేవలు పరిమితంగానే ఉండనున్నాయి. ఆరు నెలల పాటు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కొనసాగనుంది.

Natural menopause among women below 50 years in India8
ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం

ప్యూబర్టీ, మాతృత్వంలాగే స్త్రీ జీవితంలో మెనోపాజ్‌ కూడా శారీరక, మానసిక మార్పులతో కూడిన సహజమైన దశ! అయితే... ఇది సాఫీగా సాగిపోయే దశ కాదు. కొన్ని హార్మోన్ల ఉత్పత్తి మందగించి ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతుంది. అవి స్త్రీ దైనందిన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఇంత తీవ్రమైన అంశం మన సాంస్కృతిక నేపథ్యం కారణంగా సైలెంట్‌గా ఉండిపోయింది. ఆ సైలెన్స్‌ మెనోపాజ్‌ మీద అవగాహన కొరవడేలా చేస్తాయి. ఎంతలా అంటే సమాజం సంగతి అటుంచి మెనోపాజ్‌ ఎఫెక్ట్స్‌ మీద ఆ దశను అనుభవిస్తున్న స్త్రీలకే తెలియనంతగా! అందుకే ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలి... మెనోపాజ్‌ మీద విస్తృతమైన చర్చ కొనసాగాలి. అప్పుడే సమాజం ఆమెను అర్థం చేసుకోగలుగుతుంది. తన వంతు మద్దతు అందించగలుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే నేటి నుంచి సాక్షి ఫ్యామిలీలో మెనోపాజ్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తోంది.‘నేనిప్పుడు ఫ్రిజ్‌ డోర్‌ ఎందుకు తెరిచానబ్బా..?’ ఎంత చించుకున్నా అరుంధతికి గుర్తు రావడం లేదు. ‘ముందిక్కడి నుంచి వెళ్లు...’ చిన్న విషయానికే పెద్దగా అరిచేసింది ప్రతిమ. కంగుతిన్నాడు భర్త. ఆఫీస్‌లో సీరియస్‌ వర్క్‌లో ఉన్న అపర్ణ ఒక్క ఉదుటన లేచి వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్వసాగింది. ఎందుకంత దుఃఖం వచ్చిందో తెలియదు ఆమెకు. పనిమీద ఏకాగ్రత కుదరట్లేదు వైశాలికి. మాలతికి జాయింట్‌ పెయిన్స్, నీలిమకు నీరసంగా, నిస్సత్తువగా ఉంటోంది. విజయ డిప్రెసివ్‌గా ఫీలవుతోంది. దిగులు వెంటాడుతోంది. కారణం లేకుండానే ఆందోళన చెందుతోంది ప్రేమ. జీవనాసక్తి లేదు. గిరిజ అయితే కళావిహీనంగా మారిపోయింది. రజితకు ఉన్నట్టుండి వేడి ఆవిర్లు వస్తున్నాయి. క్షణంలో జ్వరమొచ్చినట్టుగా అయిపోతోంది. వీణకు నిద్ర కరవైంది. దాంపత్య జీవితం పట్లా ఆసక్తి పోయింది. దాంతో భర్త ఆమెను సాధిస్తూ తన అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నాడు.పైన చెప్పిన మహిళలవే కాదు 40– 50 మధ్య వయస్సు వనితలందరివీ దాదాపు అవే సమస్యలు! మెనోపాజ్‌ ఎఫెక్ట్స్‌! చిత్రవిచిత్రమైన ఆ పరిస్థితి అనుభవిస్తున్న వాళ్లకే అర్థంకాకపోతే కుటుంబ సభ్యులు, ఆఫీస్‌ సిబ్బందికేం అర్థమవుతుంది.. వాళ్ల సహకారమెలా అందుతుంది! దీని మీద అవగాహన కల్పించేందుకు రమావైద్య, ఊర్వశి ఝా అనే వైద్యులు 1995 (ముంబై)లోనే తమ ప్రయత్నాన్నిప్రారంభించారు ‘ద ఇండియన్‌ మెనోపాజ్‌ సొసైటీ’ని స్థాపించడం ద్వారా ఇది ఇప్పటికీ తన సేవలను అందిస్తూనే ఉంది. జర్నలిస్ట్, రచయిత, మహిళా హక్కుల కార్యకర్త శైలీ చోప్రా కూడా ‘మెనోపాజ్‌’ మీద అవగాహన కల్పించేందుకు, దానికి సంబంధించిన మెడికల్‌ కేర్, కమ్యూనిటీ సపోర్ట్‌ను కూడగట్టేందుకు ఉద్యమిస్తున్నారు. మెనోపాజ్‌కి సంబంధించి విప్లవమే రావాలి అంటూ ఆమె రోడ్‌ షోస్‌ చేస్తున్నారు. గైనకాలజిస్ట్‌ల ప్రకారం వరుసగా పన్నెండు నెలలు నెలసరి రాకపోతే మెనోపాజ్‌ వచ్చినట్టే! రుతుక్రమంలోని స్త్రీలు తప్పించుకోలేని దశ అది! కానీ మన సాంస్కృతిక నేపథ్యం దీనిగురించి మాట్లాడనివ్వకుండా చేస్తోంది. దానిమీద విస్తృతమైన చర్చ జరిగితేనే అదో వినకూడని మాటలా కాకుండా సాధారణమైన అంశగా మారుతుంది. మెనోపాజ్‌ ఫేజ్‌లోని మహిళల శారీరక, మానసిక ఆరోగ్యం గురించి ఆలోచన మొదలవుతుంది. ఆ దశలో వాళ్లు తీసుకోవాల్సిన పోషకాహారం మొదలు శారీరక వ్యాయామం, ధ్యానం, ఎమోషనల్‌ బ్యాలెన్స్‌ లాంటివాటి మీద ఎరుక వస్తుంది. అప్పుడే మెనోపాజ్‌ ప్రభావాన్ని స్త్రీ సమర్థంగా ఎదుర్కోగలదు. ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటూ సాక్షి ఫ్యామిలీ కూడా శారీరక, మానసిక వైద్యనిపుణుల విశ్లేషణలు, వివరాలు, సలహాలు, సూచనలతో నేటినుంచి మెనోపాజ్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ను మొదలుపెడుతోంది.నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ 2019– 21) డేటా ప్రకారం..ప్రీమెచ్యూర్, అర్లీ మెనోపాజ్‌ గ్రామీణప్రాంతాల్లో ఎక్కువగా కనపడుతోంది. దానికి పేదరికం, నిరక్షరాస్యత వంటివి కారణాలుగా చూపెడుతోంది. మద్యపానం, ధూమపానం, పోషకాహారలోపం, బహిష్టు సమయంలో అపరిశుభ్రంగా ఉండటం, అనారోగ్య పద్థతులు అనుసరించడం కూడాప్రీమెచ్యూర్‌ మెనోపాజ్‌కి కారణాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక సంతానం,18 ఏళ్లకే తొలి కాన్పు, పన్నెండేళ్లు లేదా అంతకంటే చిన్నవయసులో రుతుక్రమం ప్రారంభం అవడం లాంటి వాటివల్లా ప్రీమెచ్యూర్‌ మెనోపాజ్‌ రిస్క్‌ పెరగొచ్చని తెలుపుతున్నాయి. దేశంలోని మిగిలినప్రాంతాల కన్నా బిహార్‌లో ప్రీమెచ్యూర్‌ మెనోపాజ్‌ రేట్‌ ఎక్కువగా కనబడుతోందని సర్వేల సారాంశం. అలాగే యాభై పైబడ్డాక కూడా నెలసరి కొనసాగిన వాళ్లల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ డెవలప్‌ అయ్యే రిస్క్‌ ఎక్కువ.నలభై ఏళ్ల కంటే ముందే మెనోపాజ్‌ వచ్చేస్తే దాన్నిప్రీమెచ్యూర్‌ మెనోపాజ్‌ అంటారు. మన దేశంలో 2.2 శాతం మంది మహిళలు ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌లో ఉన్నట్లు అంచనా. నలభైనుంచి నలభై నాలుగేళ్ల మధ్య వయసులో గనుక మెనోపాజ్‌ దశ మొదలైతే దాన్ని అర్లీ మెనోపాజ్‌ అంటారు. ఈ దశలో ఉన్న మహిళల సంఖ్య 16. 2 శాతం.దేశంలో మెనోపాజ్‌ సగటు వయసు నలభై ఆరున్నరేళ్లు. అయితేప్రాంతాల వారీగా ఈ సగటు వయసులో తేడాలున్నాయి. దక్షిణ భారతదేశంలో 46 ఏళ్లు. ఉత్తర భారతంలో 45.5, మధ్య భారతంలో 47.8, పశ్చిమ భారతంలో 46.2, తూర్పు భారతంలో 47.3 ఏళ్లు.ముందు తరాల వారితో పోలిస్తే.. మెనోపాజ్‌ సింప్టమ్స్‌కి ఆధునిక జీవన శైలి, అధిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, రోజులో ఎక్కువ సమయం ఫోన్లలో గడపడం వంటివన్నీ కారణాలుగా చెబుతున్నారు నిపుణులు.మెనోపాజ్‌లో వచ్చే శారీరక, మానసిక మార్పుల గురించి ప్రతి మహిళా అవగాహన పెంచుకోవాలి. ఈ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ స్టేజ్‌లోని తమ శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. నిర్లక్ష్యం చేయకూడదు. నిస్పృహకు లోను కారాదు. – షబానా ఆజ్మీ, నటిమెనోపాజ్‌ దశలోని మహిళలు ముందు తమ పట్ల తాము శ్రద్ధ తీసుకోవాలి. వాళ్లు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యల గురించి నిస్సంకోచంగా కుటుంబంతో చర్చించి, సపోర్ట్‌ అడగాలి. ఎమోషనల్‌ చాలెంజెస్‌కి డీలా పడిపోకుండా కుటుంబ సభ్యుల మద్దతుతో వాటిని నార్మలైజ్‌ చేసుకోవాలి. – ప్రీతి జింటా, నటి– సరస్వతి రమ

IPL 2025: Gujarat Titans Beat Rajasthan Royals9
IPL 2025: సాయి సుదర్శన్‌ విధ్వంసం.. రాజస్థాన్‌పై గుజరాత్‌ ఘన విజయం

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 9) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో జోస్‌ బట్లర్‌ (25 బంతుల్లో 36; 5 ఫోర్లు), షారుక్‌ ఖాన్‌ (20 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రాహుల్‌ తెవాతియా (12 బంతుల్లో 24 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించారు. రషీద్‌ ఖాన్‌ 4 బంతుల్లో ఫోర్‌, సిక్స్‌ సాయంతో 12 పరుగులు, రూథర్‌ఫోర్డ్‌ 3 బంతుల్లో సిక్స్‌ సాయంతో 7 పరుగులు, శుభ్‌మన్‌ గిల్‌ 3 బంతుల్లో 2 పరుగులు చేశారు. రాయల్స్‌ బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే, తీక్షణ తలో రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్‌, సందీప్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్‌ గుజరాత్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో 19.2 ఓవర్లలో 159 ఆలౌటైంది. ప్రసిద్ద్‌ కృష్ణ 3, రషీద్‌ ఖాన్‌, సాయి కిషోర్‌ చెరో 2, సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, కేజ్రోలియా తలో వికెట్‌ పడగొట్టారు. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (32 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. సంజూ శాంసన్‌ (28 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్‌ పరాగ్‌ (14 బంతుల్లో 26; ఫోర్‌, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.యశస్వి జైస్వాల్‌ (7 బంతుల్లో 6; ఫోర్‌), నితీశ్‌ రాణా (3 బంతుల్లో 1), ధృవ్‌ జురెల్‌ (4 బంతుల్లో 5; ఫోర్‌), శుభమ్‌ దూబే (3 బంతుల్లో 1), తుషార్‌ దేశ్‌పాండే (3 బంతుల్లో 3), జోఫ్రా ఆర్చర్‌ (4 బంతుల్లో 4), తీక్షణ (13 బంతుల్లో 5) విఫలమయ్యారు.

Anitha Could Not Answer Reporters Questions On Jagan Security Failure10
జగన్‌ భద్రతా వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలు.. నీళ్లు నమిలిన హోంమంత్రి

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత వైఫల్యంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత నీళ్లు నమిలారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఎలా అంటూ చిందులు తొక్కారు. ప్రశ్న అడిగే రిపోర్టర్లతో ఆగు ఆగు అంటూ వాగ్వాదానికి దిగారు.1100 మందితో భారీ భద్రత కల్పిస్తే హెలికాప్టర్ దగ్గరకు ప్రజలు ఎలా దూసుకు వెళ్లారంటూ రిపోర్టర్ ప్రశ్నించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసులు కాపలా పెట్టాలా అంటూ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. జనాలు ఎక్కువగా వస్తారని మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా?. లేదా మీ ఇంటిలిజెన్స్ బలహీనంగా ఉందా..?. డ్రోన్ సీసీ కెమెరా వ్యవస్థ అంతా మీ చేతుల్లోనే ఉంది కదా?’’ అంటూ రిపోర్టర్ల ప్రశ్నలు అడుగుతుండగానే సమాధానం చెప్పలేక మధ్యలోనే హోం మంత్రి వెళ్లిపోయారు.కాగా, శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీ­సులు కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవు­తోంది. మంగళవారం వైఎస్‌ జగన్‌ పర్యటనలో అడుగ­డుగునా భద్రతా లోపాలు కనిపించాయి.పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదా­రుల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకు­నేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు.. జగన్‌ భద్రత విషయంలో చూపకపో­వడం గమనార్హం. హెలిప్యాడ్‌ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాది­మంది హెలిప్యాడ్‌ వద్దకు పోటెత్తారు. జగన్‌ ప్రయాణిస్తున్న హెలి­కా­ప్టర్‌ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది. అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు.హెలికాప్టర్‌ చుట్టూ జన సందోహం గుమిగూడటంతో చాలాసేపు జగన్‌ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అభి­మా­నుల తాకిడితో హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతింది. దీంతో వీఐపీ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో ఆయన్ను తీసుకెళ్లలేమని పైలెట్లు స్పష్టం చేశారు. కొద్దిసేపటికి హెలికాప్టర్‌ తిరిగి వెళ్లిపోయింది. జగన్‌ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. జగన్‌ పర్యటనల సమయంలో అరకొర పోలీసు భద్రతపై పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement