
ఉపాధి హామీ పనుల్లో జిల్లా ముందంజ
సాక్షి,పాడేరు: జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకం పనుల్లో జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ మంగళవారం తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి,ఉపాధి కల్పన,ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో అద్భుత విజయాలను సాధించిందన్నారు. నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమిస్తూ పలు అంశాలలో రాష్ట్రస్థాయిలోనే జిల్లా ప్రత్యేకస్థానం పొందిందని చెప్పారు. 69,052 కుటుంబాలకు 100 రోజుల పాటు ఉపాధిని కల్పించడంతో ప్రతి కూలీకి సగటు 74 నుంచి 85రోజుల వరకు పని లభించినట్టు చెప్పారు. హార్టికల్చర్‌లో 10,939 ఎకరాలు సాగు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించామన్నారు.161లక్షల పనిదినాలను కల్పించడం ద్వారా 3వ స్థానం,కూలీలకు సగటు రోజువారీ వేతనంగా రూ.263.19 చెల్లించి రాష్ట్రంలో 8వస్థానం సాధించినట్టు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.737.32కోట్లు ఖర్చుపెట్టామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పనుల్లోను పురోగతి సాధించినట్టు చెప్పారు. పల్లెపండగలో భాగంగా రూ.250 కోట్ల వ్యయంతో సీసీరోడ్లు, బీటీ రోడ్లు, డబ్ల్యూబీఎం రోడ్లు నిర్మించినట్టు చెప్పారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పలు పనులకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు.
వ్యవసాయానుబంధ రంగాల్లో 15శాతం వృద్ధి
వ్యవసాయానుబంధ రంగాల్లో 15శాతం వృద్ధి సాధించాలని కలెక్టర్ ఆదేశించారు.కలెక్టరేట్ నుంచి ఆయన జిల్లాలోని ఐటీడీఏ పీవోలు,పలుశాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రానున్న మూడేళ్లలో సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించేందుకు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. 104 చెక్‌డ్యాంలకు మరమ్మతుల చేశామన్నారు.కాఫీ పంటను విస్తరించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. రిజర్వాయర్లలో మత్స్యసంపదను పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. 17,170 ఎకరాల్లో ఉద్యానవనపంటల సాగుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఆశ్రమ పాఠశాలలకు కాలం చెల్లిన ఆహార పదార్థాలను సరఫరా చేస్తే సంబంధింత సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోదకొండమ్మతల్లి జాతర సందర్భంగా హోటళ్లు తనిఖీలు చేయాలన్నారు.వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, తాగునీటి వనరులు,చేతిపంపులు మరమ్మతులు చేపట్టాలన్నారు.తాగునీటి సమస్యపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేసీ,ఇన్‌చార్జి పాడేరు ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేక్‌గౌడ,రంపచోడవరం,చింతూరు ఐటీడీఏ పీవోలు సింహాచలం,అపూర్వభరత్,జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్.నందు,హార్టికల్చర్ అధికారి రమేష్‌కుమార్‌రావు, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి నరసింహులు,జిల్లా సెరికల్చర్ అధికారి అప్పారావు,మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు,ఎస్‌ఎంఐ డీఈఈ నాగేశ్వరరావు,సీపీవో పట్నాయక్,ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ జవహర్‌కుమార్,అన్ని మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు.
పలు అంశాల్లో రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం
కలెక్టర్ దినేష్‌కుమార్