
మన్యం ప్రగతికి బాటలు
సాక్షి, పాడేరు: జిల్లాలో మారుమూల గ్రామాలకు రానున్న మూడేళ్ల్లలో రహదారులు నిర్మించి డోలీ మోత లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ చెప్పారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.456 కోట్లతో రహదారులు, 26 వంతెనల నిర్మాణాలు చేపడతామన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా కోటి 61 లక్షల పనిదినాలను కల్పించడంతో జిల్లా ప్రథమ స్థానం సాధించిందన్నారు.రూ.737.32 కోట్లను ఉపాధి హామీ పనులకు ఖర్చు పెట్టామన్నారు. ఉపాధి కూలీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రోజుకు రూ.307 చొప్పున వేతనాలు పెంచామన్నారు. రూ.20 కోట్లతో చెక్‌డ్యాంలు నిర్మించడంతో 7 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అలాగే లక్ష ఎకరాల్లో కాఫీ తోటలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
మలేరియా నిర్మూలనకు చర్యలు
జిల్లాలో మలేరియా నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. గతంలో కంటే మలేరియా కేసులు పెరిగినందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామన్నారు. 2030 నాటికి మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2086 మలేరియా పీడిత గ్రామాల్లో ఈనెల 15 తేదీ నుంచి దోమల నివారణ మందు పిచికారీ పనులు ప్రారంభమవుతాయన్నారు. జూన్ నెలలో 3 లక్షల 50 వేల దోమతెరలను పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.
18 వేల మంది విద్యార్థులతో
సూర్య నమస్కారాలు
ఈనెల 7వ తేదీన అరకులోయ డిగ్రీ కళాశాల మైదానంలో 18 వేల మంది గిరిజన విద్యార్థులతో 108 సూర్యనమస్కారాలు, యోగాసనాలు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ రికార్డు సాధించే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లండన్ నుంచి యోగా పర్యవేక్షణ బృందం వచ్చి సూర్యనమస్కారాల కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుందన్నారు. పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇప్పటికే యోగాసనాల శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ, ఇన్‌చార్జి ఐటీడీఏ పీవో డాక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ, డ్వామా పీడీ విద్యాసాగర్ పాల్గొన్నారు.
రూ.456 కోట్లతో రోడ్ల అభివృద్ధి
26 వంతెనల నిర్మాణానికి చర్యలు
వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు
జూన్‌లో దోమతెరల పంపిణీ: కలెక్టర్ దినేష్‌కుమార్
నీటి ఎద్దడి నివారణకుకంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. తాగునీటి సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సమస్యలు పరిష్కరించే లక్ష్యంగా పాడేరు కలెక్టరేట్‌తో పాటు 3 ఐటీడీఏల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పాడేరు కలెక్టరేట్‌లో 18004256826 టోల్ ఫ్రీ నంబర్, పాడేరు ఐటీడీఏలో 08935–250833, రంపచోడవరం ఐటీడీఏలో 18004252123, చింతూరు ఐటీడీఏలో 81217 29228 నంబర్లకు ప్రజలు ఫిర్యాదు చేయాలన్నారు. కంట్రోల్ రూమ్‌లు 24 గంటలపాటు పనిచేస్తాయని, ఆయా తాగునీటి సమస్యలపై రోజువారీ తాను కూడా పర్యవేక్షిస్తానని, 24 గంటల్లో సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.