
సర్వం సిద్ధం
రాములోరి కల్యాణానికి
సాక్షి,పాడేరు: రాములోరి పెళ్లికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, పల్లెల్లో సీతారాముల కల్యాణాన్ని ఆదివారం నిర్వహించేందుకు అందరూ సమాయత్తమయ్యారు. అన్ని గ్రామాల్లో ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది. వీఆర్ పురం మండలం శ్రీరామగిరి సుందర సీతారామచంద్ర స్వామి ఆలయం, మండల కేంద్రం ఎటపాకలోని జటాయువు మండపంతో పాటు అన్ని దేవాలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు పలు గ్రామాల్లో పురాతన రామాలయాలు ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో దేవదాయశాఖ పలు గ్రామాల్లో సీతారాముల ఆలయాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంది. విశ్వహిందు పరిషత్,విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలోను రామాలయాలను నిర్మించారు.జిల్లాలోని 22 మండలాల పరిధిలో ఊరూరా రామాలయాలు ఉండడంతో గిరిజన పూజారులు నిత్యం పూజలు చేస్తున్నారు. ప్రతి ఏడాది శ్రీరామనవమిని గిరి గ్రామాల్లో భారీ ఎత్తున నిర్వహిస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పాడేరు మండలంలో సుండ్రుపుట్టు, డోకులూరు, రాయిగెడ్డ, కిండంగి, పాతపాడేరు, పి.గొందూరు, జి.ముంచంగిపుట్టు, గెడ్డంపుట్టు, కుజ్జెలి తదితర గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. పంచాయతీ కేంద్రం గొండెలిలో నూతనంగా నిర్మించిన రామాలయంలో తొలిసారిగా శ్రీరామనవమి ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభించారు.
పోలీస్ బందోబస్తు
జిల్లా కేంద్రం పాడేరుతో పాటు రామాలయాలు ఉన్న అన్ని చోట్ల భద్రతా చర్యలపై పోలీసుశాఖ దృష్టి సారించింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు.
శ్రీరామగిరిపై ఏర్పాట్లు పూర్తి
వీఆర్‌పురం: మండలంలోని శ్రీరామగిరిపై సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ శనివారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించి, సూచనలు చేశారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. సీతారాముల కల్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 20 వేలమంది భక్తులు రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ పెందుర్తి సుందర్శనరావు, ఆలయప్రధాన అర్చకులు పురుషోత్తమాచార్యులు తెలిపారు. సుమారు వంద మంది పోలీసులు, ఏడుగురు ఎస్‌ఐలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా
ఆధ్యాత్మిక వాతావరణం
గ్రామగ్రామాన రామ నవమికి ఏర్పాట్లు

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం