
సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలు
వీఆర్ పురం: శ్రీరామగిరి సీతారాముల కల్యాణానికి కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం కల్యాణ అప్పారావు బృందం గురువారం నాడు 25 కేజీల గోటి తలంబ్రాలను అందజేసింది. శ్రీరామగిరి ఆలయ కమిటీ చైర్మన్ పెందుర్తి సుదర్శనరావు వాటిని స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ చైతన్య సంఘం వారు మాట్లాడుతూ ఈనెల 6వ తేదీన భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి కూడా 200 కేజీల తలంబ్రాలు అందిస్తున్నామని తెలిపారు. 13 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలలో ఉన్న రామాలయాలకు ఈ తలంబ్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. గోటి తలంబ్రాల కోసం దేవతమూర్తులు వేషధారణలో వడ్లను నాటి, మహిళా భక్తులతో వరి పంటను ప్రత్యేకంగా పండించి, వాటిని వారితో వలిపించి ఆ ధాన్యాన్ని 5 రాష్ట్రాల్లోని దేవాలయాలకు 4 వేల మంది మహిళా భక్తులతో పంపిణీ చేశామని తెలిపారు. మొత్తం 800 వందల కిలోల ధాన్యం పండించామని చెప్పారు. ఫిబ్రవరిలో అయోధ్యలో జరిగిన రాములవారి కల్యాణానికి 200 కిలోలు, ఒంటిమిట్ట రామాలయానికి 200 కిలోల గోటి తలంబ్రాలు అందజేశామన్నారు.
సమర్పించిన శ్రీకృష్ణ చైతన్య సంఘం