
సాక్షి, శ్రీకాకుళం: ఐదుసార్లు ఎమ్మెల్యే, గత ప్రభుత్వాల మంత్రివర్గంలో కీలక పదవులు. ఉత్తరాంధ్ర అగ్రశ్రేణి రాజకీయనాయకుల్లో ఒకరుగా గుర్తింపు పొందిన ధర్మాన ప్రసాదరావు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో చోటు సంపాదించారు. సుదీర్ఘ అనుభవానికి సరైన సమయంలో గుర్తింపునిస్తూ వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవి ధర్మానకు కొత్త కాకపోయినప్పటికీ వైఎస్సార్ తనయుడి కేబినెట్‌లో పనిచేయాలన్న కోరిక నెరవేరింది.
ప్రత్యేకమైన నాయకుడు
ధర్మాన ప్రసాదరావు ఓ ప్రత్యేకమైన నాయకుడు లోతైన విషయ పరిజ్ఞానం, విషయాన్ని సుస్పష్టంగా చెప్పగల నేర్పు, ఇరిగేషన్ అంశాలపై విశేషమైన అవగాహన, రాజకీయాల్లో ఎత్తుకుపై ఎత్తు వేయగల చతురత ఆయన సొంతం. ప్రజా సమస్యలను క్షుణ్ణంగా వివరించడమే కాకుండా వారి ఆవేదనను కళ్లకు కట్టినట్టు ప్రసంగించే నేర్పరి కావడంతో ఆయనకు స్థానికంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ధర్మానకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినవారు ఇప్పుడు ఆనందంతో గంతులు వేస్తున్నారు.
నేపథ్యమిదీ..
పేరు: ధర్మాన ప్రసాదరావు
నియోజకవర్గం: శ్రీకాకుళం అర్బన్
స్వస్థలం: మబగం
తల్లిదండ్రులు: సావిత్రమ్మ (లేట్), రామలింగంనాయుడు (లేట్)
పుట్టినతేదీ: మే 21, 1958
విద్యార్హతలు: ఇంటర్మీడియట్
సతీమణి: గజలక్ష్మి
సంతానం: కుమారుడు రామమనోహరనాయుడు
జిల్లా: శ్రీకాకుళం
రాజకీయ నేపథ్యం: 1983లో మబగం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ప్రజాజీవితంలోకి అడుగు పెట్టారు. 1987లో పోలాకి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991–94 మధ్య రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1994లో ఓడిపోయిన ఆయన 1999, 2004, 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలోను, అనంతర మంత్రివర్గాల్లోను 2013 వరకు పనిచేశారు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. 2019లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన వైఎస్సార్‌సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తగా, తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు.
చదవండి: (ఆ అంశాలే ఆదిమూలపు సురేష్‌కు మరో అవకాశం కల్పించాయి..)