
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు తనను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మంత్రి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను, కమిషనర్‌ను కించపరిచేలా మాట్లాడారంటూ వీడియో క్లిప్పింగులను ఎన్నికల కమిషన్ సోమవారం హైకోర్టు ముందుంచింది. వీటిని కోర్టు హాలులోనే వీక్షించిన హైకోర్టు ఇరుపక్షాల నుంచి మరింత స్పష్టతను ఆశిస్తూ విచారణను వాయిదా వేసింది. మీడియాతో మాట్లాడకుండా ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వారం రోజుల్లో మూడు వ్యాజ్యాలు వచ్చాయని, భావ ప్రకటన స్వేచ్ఛ, పరిమితులపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాంను అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడు)గా నియమిస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి తరఫున న్యాయవాది వీఆర్‌ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ పార్క్ హయత్‌లో కొందరు రాజకీయ నాయకులను నిమ్మగడ్డ కలిసిన విషయాన్ని ప్రస్తావించారు.
జోగి రమేశ్ వ్యాజ్యం పరిష్కారం..
మీడియాతో మాట్లాడేందుకు, పార్టీ విధానాలు, విజయాలు, కార్యక్రమాల గురించి తెలియజేసేందుకు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు అనుమతినిస్తూ గత వారం ఇచ్చిన ఉత్తర్వులను ఈ నెల 21 వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఆ ఉత్తర్వులను జోగి రమేశ్ ఉల్లంఘించలేదని తెలుపుతూ జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చిన నివేదికను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు.