బెడ్‌ ఎక్కిస్తున్న ప్రాసెస్డ్‌ ఫుడ్‌ | India ranks third in the world in obesity | Sakshi
Sakshi News home page

బెడ్‌ ఎక్కిస్తున్న ప్రాసెస్డ్‌ ఫుడ్‌

Published Fri, Feb 28 2025 5:12 AM | Last Updated on Fri, Feb 28 2025 5:12 AM

India ranks third in the world in obesity

దేశంలో మధుమేహం, ఊబకాయం, గుండె సమస్యలు 

ఊబకాయ బాధితుల్లో ప్రపంచంలో మూడో స్థానంలో భారత్‌  

సగటు భారతీయుడి ఆహార ఖర్చులో ప్రాసెస్డ్‌ ఫుడ్‌కే అధిక కేటాయింపు 

ఫుడ్‌ డెలివరీ ఫ్లాట్‌ఫామ్‌ల రాకతో సులభమైన ఆహార అన్వేషణ 

ప్రాసెస్‌ చేసిన ఆహారం, చక్కెర పానీయాలకు మొగ్గు 

పండ్లు, కూరగాయలు తినడం మరిచిపోతున్న ప్రజలు 

సంప్రదాయ ఆహార అలవాట్లకు దూరమైతే అనారోగ్యం తప్పదంటున్న నిపుణులు

సాక్షి, అమరావతి: దేశంలో సంప్రదాయ ఆహారపు అల­వాట్లు పాశ్చాత్య జీవనశైలి వైపు మారుతున్నాయి. ప్రాసెస్డ్‌ ఫుడ్, చక్కె­ర పానీయాల వినియోగం సర్వసాధారణమైంది. పండ్లు, కూ­రగాయలు తినడం తగ్గుతోంది. ఫలితంగా ఆహారంలో పోషకాల తగ్గి.. అధిక కేలరీలకు దారి తీస్తోంది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తు­తున్నాయని నిపుణు­­లు హెచ్చ­రిస్తున్నారు. 

ముఖ్యంగా 20–40 ఏళ్ల వయసు్కల్లో ప్రాసె­స్డ్‌ ఫుడ్‌ ఆరోగ్యాన్ని దిగజారుస్తున్నట్టు చెబుతున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వైపు మొగ్గు చూపడం ఆందోళన కలిగిస్తోంది. 

పెరిగిన ఖర్చు 
చక్కెర పానీయాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారాలపై పెరిగిన ఖర్చు మధుమేహం, ఊబకాయం, హృదయ సంబంధ సమస్యలు వంటి నాన్‌–కమ్యూనికబుల్‌ వ్యాధుల పెరుగుదలతో ముడిపడి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా గృహ వ్యయ సర్వేలో గ్రామీణ భారతంలోని నెలవారీ ఖర్చులో 47 శాతం ఆహారం కోసం వెచ్చిస్తున్నారు. ఇందులో ఏకంగా 10 శాతం మొత్తాన్ని ప్రాసెస్‌ చేసిన ఆహారానికి కేటాయించడం గమనార్హం.

ఇది పండ్లు (3.85 శాతం), కూరగాయలు (6.03 శాతం), తృణధాన్యాలు (4.99 శాతం), గుడ్లు, చేపలు, మాంసంపై (4.92 శాతం) కంటే అధికంగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. నెలవారీ ఖర్చులో 39 శాతం ఆహారం కోసం వెచ్చిస్తే ఇందులో పానీయాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌పై 11 శాతం వరకు ఖర్చు చేస్తున్నారు. 

ఇది పండ్లు (3.87 శాతం), కూరగాయలు (4.12 శాతం), తృణధాన్యాలు (3.76 శాతం), గుడ్లు, చేపలు, మాంసం (3.56 శాతం) ఖర్చును అధిగమించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహారంపై సగటు నెలవారీ తలసరి వ్యయం 2022–23లో 46.38 శాతం నుంచి 2023–24లో 47.04 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 39.17 శాతం నుంచి 39.68 శాతానికి వృద్ధి చెందింది.  

ప్రమాదంలో ప్రజారోగ్యం 
గత ఏడాది నాన్‌–కమ్యూనికబుల్‌ వ్యాధులు (ఎన్‌సీడీ) రిస్క్‌ ఫ్యాక్టర్‌ సహకారంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రచురించిన లాన్సెట్‌ అధ్యయనం ప్రకారం 2022లో.. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌లోనే అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారిలో 62 శాతం మందికి ఎటువంటి చికిత్స అందటం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. 

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయంతో బాధపడుతున్న దేశాల్లో భారత్‌ మూడవ స్థానంలో ఉంది. దాదాపు 8 కోట్ల మంది స్థూలకాయ బాధితులు ఉంటే..  5–19 సంవత్సరాల వయస్కుల్లో కోటి మంది ఉండటం గమనార్హం. ఈ సమస్యతో ఏటా 60 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.  

అనారోగ్యాలపై 6 ట్రిలియన్ల ఖర్చు 
ఇలా దీర్ఘకాలిక అనారోగ్యాలపై 2030 నాటికి 6 ట్రిలియన్‌ డాలర్ల వరకు ఖర్చు పెరుగుతుందని అంచనా. దేశంలో అత్యున్నత వైద్య ప్యానల్‌ అయిన ఇండియన్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) కూడా మొత్తం వ్యాధుల్లో 56.40 శాతం అనారోగ్యకర ఆహారాలతో ముడిపడి ఉన్నాయని పేర్కొంది. 

మరోవైపు ఒత్తిడి, నిశ్చల జీవనానికి విఘాతం కలిగించే అలవాట్లు కూడా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ఉప్పు, చక్కెరలను పరిమి­తంగా తీసుకోవడం, సమతుల్య ఆహారాన్ని పెంచడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయాలని నివేదికలు సిఫారసు చేస్తున్నాయి.  

10 నిమిషాల్లోనే ఫుడ్‌ డెలివరీ
ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు కేవలం 10 నిమిషాల్లోనే భోజనాన్ని అందిస్తున్నాయి. ఇదే ఆహార ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలా డెలివరీ చేసే ఆహార పదార్థాల నాణ్యతపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి ఫుడ్‌ డెలివరి ప్లాట్‌ఫామ్‌లతో దేశంలో ప్రాసెస్డ్‌ ఫుడ్, పానీయాల వినియోగం పెరిగింది. అంతర్జాతీయ ఫాస్ట్‌ ఫుడ్‌ చైన్లు పాశ్చాత్య ఆహార ధోరణులను భారతీయ గృహాలకు పరిచయం చేశాయి. 

ఇక్కడే ఫుడ్‌ డెలివరీ మార్కెట్‌ 2030 నాటికి రూ.2.12 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. పైగా దేశంలో ఆదాయం పెరగడంతో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది. ఫిచ్‌ సొల్యూషన్స్‌ నివేదిక ప్రకారం భారతదేశ గృహ వ్యయం 2027 నాటికి 3 ట్రిలియన్ల డాలర్లను దాటనుంది. అప్పటికి.. దాదాపు 25.80 శాతం భారతీయ కుటుంబాల్లో సాధారణ ఖర్చులు పోనూ రూ.86 వేలు అదనంగా వ్యయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది.

రెండు దశాబ్దాల కిందటి వరకు గ్రామీణ భారతం జంక్‌ ఫుడ్‌ కోసం కేవలం 4 శాతం మాత్రమే ఖర్చు చేసేది. పట్టణ ప్రాంతాల్లో ఇది 6.35 శాతంగా ఉండేది. 2004–05, 2009–10 మధ్య కాలంలో పెద్దఎత్తున జంక్‌ ఫుడ్‌ ధరలు, వినియోగం కూడా పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement