
దేశంలో పెరిగిపోతున్న స్థూలకాయులు.. యాంటీ–ఒబేసిటీ ఔషధాలకు డిమాండ్
290% నాలుగేళ్ల వ్యవధిలోనే అమ్మకాల్లో వృద్ధి
ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు కొత్త ఔషధాలను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు
జీవన శైలిలో మార్పులు, శరీరానికి వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ వినియోగం పెరగడంతో.. మన దేశంలో స్థూలకాయుల సంఖ్య ఏటేటా మరింతగా పెరిగిపోతోంది. ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)’2022 ప్రకారం ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.
దాదాపు 8 కోట్ల మంది ఇప్పటికే స్థూలకాయుల కేటగిరీలోకి చేరగా.. మరో 3 కోట్ల మంది వయోజనులు పొట్ట చుట్టూ అధిక కొవ్వు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్టు అంచనా. ఒబేసిటీ అత్యధికంగా ఉన్న టాప్–10 దేశాల జాబితాలోకి భారత్ కూడా చేరిపోయింది. దీంతో అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు కూడా మన దేశం వైపు చూస్తున్నాయి. ఇప్పటికే బరువు తగ్గించే పలు రకాల మందులు మార్కెట్లో ఉండగా.. మరికొన్ని ఔషధాలు మన మార్కెట్లోకి రానున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్
మూడింతలు పెరిగిన మార్కెట్..
ఒబేసిటీ చికిత్సలో ఉపయోగించే ఔషధాలను జీఎల్‌పీ–1 (గ్లూకగాన్ తరహా పెప్టైడ్ రిసెప్టర్ ఎగోనిస్ట్స్)గా వ్యవహరిస్తారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను, ఆకలిని నియంత్రించే హార్మోన్లుగా పనిచేస్తాయి. పొట్ట నిండుగా ఉన్నట్లుగా మెదడుకు సంకేతాలు పంపించి, పొట్ట ఖాళీ అయ్యే ప్రక్రియను నెమ్మదింపజేసి, బరువు తగ్గించుకునేందుకు తోడ్పడతాయి. అంతర్జాతీయంగా యాంటీ–ఒబేసిటీ ఔషధాల అమ్మకాలు 2024లో సుమారు 13 బిలియన్ డాలర్లుగా ఉండగా... 2035 నాటికి 105 బిలియన్ డాలర్లకు చేరొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. మన దేశంలోనూ బరువు తగ్గించే మందులకు డిమాండ్ పెరుగుతోంది.
2020 నవంబర్‌లో వీటి అమ్మకాలు రూ.137 కోట్లుగా ఉంటే.. 2024 నవంబర్ నాటికి రూ.535 కోట్లకు చేరాయి. అంటే సుమారు 290 శాతం పెరిగింది. ఒబేసిటీ సర్జరీ సొసైటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం బరువు తగ్గేందుకు చేయించుకునే సర్జరీలు 2004లో సుమారు 200 మాత్రమేకాగా... 2019 నాటికి ఏకంగా 100 రెట్లు పెరిగి 20,000కు చేరుకున్నాయి. స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో హైపర్‌టెన్షన్, మధుమేహం, కాలేయ వ్యాధులు వంటి సమస్యలూ వస్తాయి. వీటి చికిత్సల్లో ఉపయోగించే ఔషధాలకూ డిమాండ్ పెరిగిపోతోంది.
ఖరీదైన వ్యవహారంగా చికిత్స..
యాంటీ–ఒబేసిటీ చికిత్స ఆషామాషీ వ్యవహారం కాదని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా ఈ చికిత్సలకు నెలకు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చవుతుందని అంటున్నారు. ఈ ఔషధాలను దీర్ఘకాలంపాటు తీసుకుంటేనే ఫలితాలు కనిపిస్తాయని, మధ్యలో ఆపేస్తే అప్పటిదాకా చేసినదంతా వృథా అవుతుందని పేర్కొంటున్నారు. అంతేకాదు ఒకే మందు అందరికీ పనిచేయదని... శరీరతత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకం ఔషధం వాడాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
ఇక యాంటీ ఒబేసిటీ మందులతో కొన్ని దుష్ఫలితాలకూడా వచ్చే అవకాశం ఉండటంతో.. చాలా మంది మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. కొన్నిరకాల ఔషధాలను దీర్ఘకాలం ఉపయోగిస్తే ఇతర దు్రష్పభావాలు తలెత్తవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. అయినా మన దేశంలో యాంటీ ఒబేసిటీ ఔషధాల వినియోగం పెరుగుతోంది. సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, డ్యూలాగ్లూటైడ్, ఒర్లిస్టాట్, టిర్జెప్టైడ్ వంటి ఫార్ములాల ఆధారిత ఔషధాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

అంతర్జాతీయ కంపెనీల కన్ను..
భారత్‌లో బరువు తగ్గే మందులకు డిమాండ్ నెలకొనడంతో.. అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు మన దేశంపై దృష్టి పెడుతున్నాయి. డెన్మార్క్ కంపెనీ నొవో నోర్డిస్క్కు చెందిన ఓరల్ సెమాగ్లూటైడ్ ట్యాబ్లెట్ రైబెల్సస్‌ను 2022లో దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టగా.. అది 65 శాతం యాంటీ–ఒబేసిటీ మార్కెట్‌ను ఆక్రమించింది. దీంతో సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్లను కూడా భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఆ కంపెనీ కసరత్తు చేస్తోంది. వెగోవీ, ఒజెంపిక్ వంటి ఔషధాల వినియోగం కూడా మనదేశంలో భారీగానే ఉంటోంది.
మరింత బాగా పనిచేస్తా యని పేరుండి.. మన దగ్గర విక్రయించని కొన్ని ఔషధాలను అనధికారిక మార్గాల్లో తెప్పించుకునే ధోరణి కూడా పెరుగుతోంది. ఇక అమెరికాకు చెందిన ఎలై లిల్లీ కంపెనీ సైతం టిర్జిప్టైడ్ ఆధారిత మౌంజారో ఔషధాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మన దేశీయ కంపెనీలు కూడా బరిలోకి దిగుతున్నాయి. గ్లెన్‌మార్క్ ఇప్పటికే లిరాగ్లూటైడ్ జనరిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా తదితర కంపెనీలు పేటెంట్ ముగిసిన జీఎల్‌పీ–1 ప్రత్యామ్నాయాల మీద పని చేస్తున్నాయి. సన్ ఫార్మా కూడా ఈ విభాగంలో కొత్త మాలిక్యూల్‌పై పరిశోధన చేస్తోంది.