
విజయవాడ నడిబొడ్డున వైఎస్ జగన్ ప్రభుత్వం 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహం నిర్వహణను ప్రైవేటుపరం చేయనున్న చంద్రబాబు సర్కార్
పీపీపీ విధానంలో నిర్వహణకు త్వరలో టెండర్లు.. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ప్రకటన
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిని భావితరాలకు అందకుండా చంద్రబాబు సర్కారు కుట్రలు
ఇది ఎస్సీ, ఎస్టీలను తీవ్రంగా అవమానించడమేనన్న దళిత సంఘాలు
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంబేడ్కర్ సామాజిక, న్యాయ శిల్పం నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం
ఇప్పుడు ప్రైవేటుకు అప్పగించనుండటం ఇందుకు పరాకాష్ట
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా, పౌరహక్కుల సంఘాల ఆగ్రహం
సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాతగా బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పైనా చందబ్రాబు ప్రభుత్వం క్షుద్ర రాజకీయం చేస్తోంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ సామాజిక, న్యాయ మహాశిల్పంపై స్వార్థ రాజకీయం విషం చిమ్ముతోంది. ఆ మహనీయుడి స్ఫూర్తిని భావితరాలకు అందకుండా.. బడుగు, బలహీనవర్గాలు సమున్నతంగా తలెత్తకుండా చేసే కుట్ర చేస్తోంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో 18.81 ఎకరాల్లో రూ.404.35 కోట్లతో నెలకొల్పిన సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణాన్ని పబ్లిక్ –ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే టెండర్లను కూడా పిలవనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తాజాగా ప్రకటించారు.
ప్రపంచంలోనే మహోన్నత నేత విగ్రహ నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాల్సి ఉండగా ప్రైవేటుకు కట్టబెట్టాలని నిర్ణయించుకోవడం ద్వారా తన ఉద్దేశమేంటో చంద్రబాబు ప్రభుత్వం తేటతెల్లం చేసింది. దీంతో గత ప్రభుత్వ హయాంలో వైభవంగా వెలుగొందిన అంబేడ్కర్ సామాజిక, న్యాయశిల్పంపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
అధికారంలోకొచ్చింది మొదలు అడుగడుగునా నిర్లక్ష్యం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు సామాజిక, న్యాయ మహాశిల్పంపై అడుగడుగునా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వంటి ముఖ్య సందర్భాల్లో అంబేడ్కర్ విగ్రహానికి కనీసం విద్యుత్ లైట్లు కూడా లేకుండా చేసింది. విగ్రహం ఉన్న ప్రాంతాన్ని డ్వాక్రా స్టాల్స్, ఇతర కార్యకలాపాలకు కేటాయించే ప్రయత్నం చేస్తోంది. తొలుత సందర్శకులను నిరుత్సాహపరిచి అటువైపు వెళ్లే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించేలా కనీస సౌకర్యాలు లేకుండా చేసింది. పారిశుధ్య నిర్వహణను సైతం గాలికొదిలేసింది.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా సామాజిక, న్యాయ మహాశిల్పం ప్రాంతం భాసిల్లింది. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య చర్యలతో పదుల సంఖ్యలో కూడా సందర్శకులు రాని దుస్థితి నెలకొంది. ఇప్పుడు అంబేడ్కర్ విగ్రహానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలను ప్రైవేటు వ్యక్తులకు అన్యాక్రాంతం చేసే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే విగ్రహానికి సమీపంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ రెస్టారెంట్ ఇతర నిర్మాణ పనులను నిలిపేసింది.

అలాగే అంబేడ్కర్ విగ్రహానికి వెనుక వైపున గత ప్రభుత్వం చేపట్టిన భారీ కన్వెన్షన్ హాల్ (ఒకేసారి 2,000 మంది కూర్చునేలా) నిర్మాణాన్ని ఆపేసింది. సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణంలో స్థలాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రైవేటు నిర్వహణకే కట్టబెడుతుండటంపై ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.