
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం మరో భూ పందేరానికి తెరలేపింది. చింతాస్ గ్రీన్ ఎనర్జీ సంస్థకు భూములు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల కిందటే పుట్టిన చింతాస్‌కు భారీగా భూ కేటాయింపులు చేసింది. 2 వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఎకరం 31 వేలకే లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నవయుగ సంస్థకు చెందిన డైరెక్టర్లతో చింతాస్ ఏర్పాటు చేయగా, చింతాస్‌కు ఆగమేఘాల మీద భూముల కేటాయింపులు జరిగిపోయాయి. చింతాస్ డైరెక్టర్లతో ఈనాడు యాజమాన్యానికి బంధుత్వం ఉన్నట్లు సమాచారం. 2 నెలలకే భారీగా భూములు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో భూములను కేటాయించింది. హరే సముద్రం, బుల్లసముద్రం, ఉప్పెర్లపల్లి, ఎర్రబొమ్మన హల్లి, కల్లుమరి, మానూరె పరిసర గ్రామాల్లో భూముల కేటాయింపు జరిగింది.
కాగా, ఊరు పేరు లేని ‘ఉర్సా క్లస్టర్స్’కు విశాఖలో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన భూమిని చంద్రబాబు సర్కారు అప్పనంగా కట్టబెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు నెలల వయసు, కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్, వెబ్‌సైట్ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన అనంతరం రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఉర్సా క్లస్టర్స్ రూ.5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటాక్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 3లో ఐటా క్యాంపస్‌కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో డేటా సెంటర్‌కు 56.36 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న ఉర్సా కంపెనీ గురించి ‘సాక్షి’ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
