
రాజకీయ అండతో రెచ్చి పోతున్న సీఐ రోషన్
డబ్బుల కోసం ప్రజలను పీక్కు తింటున్న వైనం
గతంలో ఉన్నతాధికారులు హెచ్చరించినా మారని తీరు
సాక్షి, వైఎస్సార్: అతను ఓ పోలీస్ అధికారి. అయితే వీధి రౌడీకి ఏ మాత్రం తక్కువ కాకుండా ప్రవర్తించడం ఆయన నైజం. పని చేసిన ప్రతి చోట వివాదాలు సృష్టించుకోవడం.. ప్రజలతో ఛీ కొట్టించుకోవడం ఆయనకు పరిపాటి. అయితే పుష్ప సినిమాలో లాగా తాను ఏమాత్రం తగ్గేదేలే అనే చందాన వ్యవహరిస్తున్నాడు. తన పద్ధతి, విధానాలను పోలీసుశాఖ లక్ష్యాలకు అనుగుణంగా మార్చుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించకపోవడం ఆయన ప్రత్యేకత. తన సర్కిల్ పరిధిలోని ప్రజలకు రోత పుట్టించే విధంగా విధి నిర్వహణ ఉందంటే ఆయన తీరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. నిష్పక్షపాతంగా విచారణ చేస్తే నిజానిజాలు బయటపడతాయని సర్కిల్ పరిధిలోని ప్రజలు గుసగుసలాడుతున్నారు.
కమలాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నేటి వరకు సీఐ రోషన్ వ్యవహార శైలిని గమనిస్తే కడప జిల్లాలో ఎక్కడో గాని ఇలాంటి అధికారి పోలీసుశాఖలో లేడనే చెబుతారు. డబ్బుల కోసం ఏ స్థాయికైనా దిగజారే మనస్తత్వం అని కమలాపురం ప్రాంతంలో ఏ ఒక్కరిని అడిగినా ఠక్కున చెప్పేస్తారు. ఇటీవల ఆయన విధి నిర్వహణలో అనేక భంగపాట్లు ఎదురైనా తనకు ఉన్నతాధికారుల అండ ఉందనే గర్వంతో పోలీసు స్టేషన్‌కు వచ్చే సామాన్య ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నాడు. ఇలా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే రోషన్ రోత చరిత్ర అనే పెద్ద పుస్తకమే రాయాల్సి ఉంటుంది.
ఇక ఇటీవల కమలాపురంలో జరిగిన కొన్ని సంఘటనలు గమనిస్తే.. కమలాపురం మండలం కోగటం గ్రామంలో ఒక చిన్న స్థాయి వీధి గలాటాకు సంబంధించి వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడైన ఓ వ్యక్తిని నాలుగు రోజుల కిందట పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి అధికార పార్టీ అగ్ర నాయకుడి ఆదేశాలతో ఆ వ్యక్తిపై పోలీసు జులుం ప్రదర్శించాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి 45 వేల రూపాయలు చెల్లించడంతో ఆ డబ్బు తీసుకొని ఏమాత్రం సంతృప్తి చెందక మిగిలిన డబ్బుల కోసం ఆ వ్యక్తిపై వీధి రౌడీలా ప్రతాపాన్ని చూపాడు. సీఐ రోషన్ కొట్టిన దెబ్బలకు ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో స్పృహ తప్పి పడిపోవడంతో కమలాపురానికి చెందిన ఒక వైద్యుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వైద్యం చేయించారు.
బాధితుడి కుటుంబీకులు ఈ విషయంపై ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ, డీఐజీ, ఎస్పీ, మానవ హక్కుల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే కమలాపురం పట్టణంలో ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్ష లీకేజీ వ్యవహారంలో బాధ్యులు కాని వ్యక్తులపై కూడా అధికార పార్టీ అగ్ర నాయకుడు చెప్పాడనే ఏకైక కారణంతో స్వామి భక్తిని చాటుకునేందుకు.. దీనికితోడు వారి దగ్గర డబ్బును బాగా దండుకోవచ్చనే దురుద్దేశంతో సంబంధం లేని వ్యక్తులను సైతం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి.. కేసు నమోదు చేసి.. వారిని బెదిరించి.. వారి నుంచి భారీ స్థాయిలో డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేసిన విషయం కమలాపురంలో వీధి వీధినా వ్యాపించింది.
డబ్బులు ఇవ్వని కొందరు నిందితులను భారీ స్థాయిలో పోలీస్ కోటింగ్ ఇచ్చిన ఘనత కూడా రోషన్‌కే దక్కింది. అలాగే చిన్నచెప్పలి గ్రామానికి చెందిన తండ్రి కొడుకుల ఆస్తి వ్యవహారంలో రోషన్ వ్యవహరించిన అత్యుత్సాహం సామాన్యుడిని సైతం నివ్వెర పరిచింది. జిల్లా ఉన్నతాధికారి ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో రోషన్ కొంచెం వెనక్కి తగ్గినట్టుగా కనిపించింది. ఈయన కమలాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే రాయచోటి ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తికి కమలాపురానికి సంబంధించిన ఒక మైనారిటీ వర్గ నాయకుడికి జరిగిన వ్యవహారంలో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్న ఆ మైనార్టీ నాయకుడిని బెదిరించి దాదాపు 15 లక్షలకు పైగా వసూలు చేసుకున్న ఘనాపాటి ఈ సీఐ అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
డబ్బులు ఇచ్చిన వ్యక్తి స్వయంగా ఒక డివిజనల్ అధికారిని కలిసి ఫిర్యాదు చేసి వీడియో దృశ్యాలను చూపించినా ఆ డివిజనల్ అధికారి మిన్నకుండిపోవడం గమనిస్తే ఈ సీఐ ఏ స్థాయిలో అధికారులను తన వైపు తిప్పుకుంటున్నాడో తెలిసిపోతోంది. ఇక ఇటీవల కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఈ జీ అశోక్ కుమార్ తమ నియోజకవర్గ నాయకుడికి అత్యంత ఆప్తుడని, అలాగే రేంజ్ పరిధిలో ఉన్న ఓ అధికారి సైతం తమ నాయకుడి మాటే వింటాడని తనను ఎవరూ ఏమీ పీకలేరని బహిరంగంగానే ఈ అధికారి మాట్లాడడం గమనిస్తున్న కమలాపురం ప్రజానీకం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సీఐ గారికి జీతం ఇచ్చేది నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ అగ్ర నాయకుడా?? లేక పోలీస్ శాఖనా అనే విషయంపై చర్చ కూడా కమలాపురం ప్రాంతంలో జోరుగా జరుగుతోంది.
జిల్లాలో ఎక్కడా లేని విధంగా కమలాపురం పట్టణంలో దాదాపు పదికి పైగా> అధికార పార్టీ అగ్ర నాయకుడి బెల్ట్ షాపులు బహిరంగంగా బార్‌లను తలదన్నే విధంగా నడుస్తున్నాయంటే వాటి నుంచి ఈయన ఎంత దండుకుంటున్నాడో మరో మాట చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంత బహిరంగంగా బెల్ట్ షాపులు ఈ సీఐ రోషన్ సహాయంతో నడుస్తున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ శాఖ కూడా కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికైనా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంలో తగిన జోక్యం చేసుకొని రోషన్ ఆగడాలను అరికట్టకపోతే కమలాపురం పోలీసుల తీరు మరో బీహార్ ప్రాంతాన్ని తలపించే విధంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కోగటం సంఘటనపై సీఐ రోషన్‌ను వివరణ కోరగా అదంతా బోగస్ అని కొట్టి పారేశారు. వారు లాయర్‌కు డబ్బు ఇచ్చుకున్నారేమో గాని తాను డబ్బు అడగలేదని వివరించారు.