
పిల్లవాడి ఇంటికి వెళ్లి ఆస్తిపాస్తులు.. వారి హోదా స్తోమత అన్నీ చూసొద్దాం అని వెళ్లిన ఆడపెళ్ళి వాళ్ళు అట్నుంచి వచ్చి పెదవి విరిచారు.. ఎందుకయ్యా అంటే ఆ చూసాములే.. ఏముంది వాళ్లకు.. ఇల్లు పొలం.. గొర్రె, మేకా కూడా ఉన్నట్లున్నాయి. కానీ, ఆ గడ్డివాము మరీ చిన్నదిగా ఉంది. ఇక వాడేం పిల్లను పోషిస్తాడు.. వద్దులే ఆ సంబంధం క్యాన్సిల్ అని చెప్పేసారు ఆడపిల్లవారు.
ఈసారి కదిరి నుంచి అబ్బాయివాళ్ళు అమ్మాయిని చూస్కోవడానికి మడకశిర వచ్చారు.. అబ్బాయి భూమి.. పుట్ట.. ఇల్లు.. కల్లం వంటి వివరాలన్నీ చెప్పారు.. అమ్మాయి.. అబ్బాయి ఇద్దరూ ఒకరికి ఒకరు నచ్చారు. మళ్ళీ ఆడపిల్ల తరఫువారు అబ్బాయి ఇంటికి వెళ్లారు.. అమ్మాయి మేనమామ మహా ఘటికుడు .. అబ్బాయికి ఊళ్ళో ముందే ఓ రౌండ్ వేసి పిల్లాడికి ఆస్తిపాస్తులు.. పశువులు.. దుక్కిపశువులు ఎన్ని ఉన్నాయి.. పాడి పశువులు ఎన్ని ఉన్నాయి అనేది సర్వే చేసాడు.. మేనమామ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. దీంతో పెళ్లయింది..
అవును ఇప్పుడంటే పిల్లలకు సంబంధాలు చూసేటపుడు ప్యాకేజీ ఎంత.. పిల్లకు ఎన్ని ఎకరాలు భూమి ఉంది.. పిల్లాడికి ఎంత కట్నం ఇస్తారు. ఆడపిల్ల వారి స్థోమత ఎంత.. అబ్బాయి తరఫు వాళ్ళకు ఎంత ఆస్తి ఉంది. ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి.. సంబంధం చేసుకుంటే పిల్లకు ఎంత బంగారం పెడతారు. అబ్బాయి ఏ బ్రాండ్ కారు వాడుతున్నాడు.. జీతం ప్యాకేజీ ఎంత.. ఫారిన్ లో ఉద్యోగం ఉందా.. ఎంత సేవింగ్స్ ఉన్నాయి.. ఇదీ లెక్క.. ఇదే కాలిక్యులేషన్.
కానీ, ఓ మూడు దశాబ్దాల క్రితం రోజులు అలానే ఉండేవి పిల్లాడికి.. ఎన్ని పాడి పశువులు ఉన్నాయ్.. వాటిని ఎలా చూసుకుంటున్నాడు.. వాటికి నిత్యం పోషించే స్థాయి.. బాధ్యత ఉన్నాయా.. బ్యాంకు బ్యాలెన్స్ మాదిరిగా కల్లంలో గడ్డి ఎంత నిల్వ చేసాడు. మండు వేసవిలో కూడా పశువులను చూసుకోగలడా.. అప్పుడు కూడా జీవాలకు కడుపునిండా గడ్డి పెట్టగలడా అనే సామర్థ్యం మీద ఆధారపడి పిల్లను ఇచ్చేవాళ్ళు. పశువులను కూడా నాడు రాయలసీమలో కుటుంబంలో భాగంగానే చూసేవాళ్ళు.. ఏదైనా శుభకార్యం జరిగినా పశువులతో కలిసి ఫోటోలు దిగేవాళ్ళు. వాటికి పూజలు చేసి పూలదండలు వేసి వాటికి కుటుంబ సభ్యులుగా గుర్తించి ప్రేమించి గౌరవించేవాళ్ళు.. పాడి పశువులతోబాటు దుక్కి పశువులకు ప్రత్యేక గ్రాసం వేసేవాళ్ళు. ఊళ్లలో కూడా ఎవరికీ ఎక్కువ పశుసంపద ఉంటే వారికి ప్రత్యేక గౌరవం.. గుర్తింపు దక్కేది. రాయలసీమలో.. నలభై.. యాభై.. అరవై నుంచి వందకు పైగా పశువులను తమ పెరట్లో పెంచిన కుటుంబాలు అనేకం.
ఇప్పుడు రోజులు మారిపోయాయి.. అక్కడక్కడా కనిపించే పాడి పశువులు తప్ప దుక్కిటెడ్లు లేనేలేవు.. ఇక పొలాల్లో.. ఇంటి పెరడులో పెద్ద ఎత్తున గడ్డి కుప్పలు వేసే పరిస్థితి లేదు.. అంతా యాంత్రీకరణ వచ్చేసింది.. మిషన్లలో నూర్పిడి చేస్తున్నారు.. దీంతో పశువులకు గడ్డి కూడా దొరకడం లేదు. రోజులు మారిపోయాయి.. జీవాలు మనుషులకు దూరమైపోయాయి .. డబ్బు.. బంగారం.. ఆస్తిపాస్తులే ప్రజలకు గౌరవాన్ని తెచ్చే సంపదలుగా లోకం మారిపోయింది.
-సిమ్మాదిరప్పన్న