
మాటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకెళ్తే ఉస్కో అంటే ఎదురు మళ్ళా ఉస్కో అందట.. ఆలా అయింది తెలుగుదేశం పరిస్థితి. పార్టీ పెట్టి పుష్కరం దాటి.. అసెంబ్లీ గేటు కూడా దాటలేకపోయిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం.. బీజేపీతో పొత్తు పుణ్యాన ఈసారి అసెంబ్లీ లోపలి అడుగుపెట్టారు. పవన్ ప్రాధాన్యాన్ని గుర్తించిన చంద్రబాబు సైతం ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు.
ఇక జనసేనలో మొదట్నుంచి ఉన్న నాగబాబు సైతం గతంలో ఎంపీగా పోటీ చేసి మట్టికరిచారు. ఇక డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయడం అచ్చిరాదనుకున్నారో ఏమో అడ్డదారిలో శాసనమండలిలోకి అడుగుపెట్టారు. ఇక చట్టసభలో ప్రజల తరఫున మాట్లాడాల్సిన నాగబాబు తొలిసారిగా మైక్ అందుకుని ఇక ఒంటి మీద స్పృహ లేకుండా నోటికొచ్చింది వాగేశారు. తెలుగుదేశానికి లైఫ్ ఇచ్చింది తామేనని పవన్ అంటే.. అసలు పవన్ను గెలిపించింది ప్రజలు.. జనసైనికులే తప్ప ఇంకెవరూ కాదని గట్టిగా చెప్పారు.
వాస్తవానికి ఎన్నికలకు ముందు పిఠాపురం సీటును పవన్ కోసం త్యాగం చేసిన వర్మను నాగబాబు.. పవన్ ఇద్దరూ భుజానికి ఎత్తుకుని మోశారు. నా గెలుపు బాధ్యత మీదే.. మీ భుజాల మీదనే ఉందని మునగ చెట్టు ఎక్కించారు. ఇక గెలిచాక.. వర్మ త్యాగం గాలిలో కలిసిపోయింది.. అసెంబీ గేటు వరకూ ఓడ వర్మ.. గేటు దాటాక బోడి వర్మ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నలభయ్యేళ్ళ తెలుగుదేశాన్ని తామే నిలబెట్టినట్లు ఈ బ్రదర్స్ చెప్పుకున్నారు.
పాలన గురించి ఒక్క ముక్కాలేదు..
అటవీ, పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న పవన్ ఈ తొమ్మిది నెలల్లో చేసిన ఒక్క మంచి పని గురించి కూడా చెప్పలేదు.. ఎంతసేపు తన స్వోత్కర్ష.. సొంత ఎలివేషన్ తప్పితే ప్రజలకు పనికొచ్చేది.. సమాజానికి ఉపయోగపడే మాట ఒక్కటీ లేదు.. పైగా జనసైనికులు కూడా అచ్చం అలాగే తయారయ్యారు.. 2029 నాటికి పవన్ను సీఎం అభ్యర్థిగా చూడాలన్నది వారి అభిలాష అని అక్కడ ఓపెన్ అయిపోయారు.. ఈ అన్నదమ్ముల అత్యుత్సాహం తెలుగుదేశాన్ని ఇరిటేట్ చేస్తోంది.
ఇప్పటికే తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో ఈ బ్రదర్స్ గురించి ట్రోలింగ్ మొదలైంది. తెలుగుదేశం లేకపోతే జనసేన ఎక్కడ ఉంటుంది. ఇదేంటి ఇంత ఓవర్ యాక్షన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తన గురించి మాటమాత్రం ప్రస్తావించకపోవడం పిఠాపురం వర్మను మరింత వేడెక్కిస్తోంది. ఈ అంశం లోకేష్ వద్దకు కూడా చేరింది.. పలువురు కార్యకర్తలు లోకేష్ తో మాట్లాడుతూ నాగబాబు.. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత గాదయా
విశ్వదాభిరామ వినురవేమ!
అన్నట్లుగా తయారైంది టీడీపీ పరిస్థితి. తమ గెలుపులో కీలకపాత్ర పోషించిన పవన్ను ఇప్పుడు చెప్పులమాదిరిగా బయట వదిలేయలేక.. వాళ్ళ అన్నదమ్ముల కామెంట్లు చెవిలో జోరీగమాదిరిగా ఇబ్బంది పెడుతున్నా భరించలేక.. సతమతమవుతున్నారు. మొత్తానికి నోటి దురుసు ఉన్న నాగబాబు ఎప్పటికైనా కూటమిలో చిచ్చుకు కారణం అవుతారని అంటున్నారు..
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment