
రాష్ట్రంలో భిన్న వాతావరణం
మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడి
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గురువారం భిన్న వాతావరణం కనిపించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అదే సమయంలో ఎండ ప్రతాపాన్ని చూపించింది. రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో ఇదే విధంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ చెప్పారు.
5 వరకూ వానలు.. ఆ తర్వాత ఎండల తీవ్రత
ఉత్తర కోస్తాంధ్ర, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో పాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక మీదుగా లోతట్టు ప్రాంతాల్లో గాలుల కలయిక ప్రాంతం ఏర్పడింది. ఈ కారణంగా సముద్రం నుంచి తేమ గాలులను తీసుకువస్తుండటంతో.. అకాల వర్షాల ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది. ఉపరితల ఆవర్తనం, గాలుల ప్రభావంతో..శుక్రవారం, శనివారం ఉదయం వరకూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
రాత్రి సమయంలో రాయలసీమలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అనంతపురం, కర్నూలు, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందన్నారు. చిత్తూరు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వానలు ఉంటాయనీ..గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.

ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని చెప్పారు. 5వ తేదీ నుంచి ఎండల తీవ్రత గరిష్టంగా ఉంటుందన్నారు. సాధారణం కంటే 3– 5 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. గురువారం రాళ్లపల్లిలో 84.5 మి.మీ, సానికవారంలో 77.75, ములకల చెరువులో 72, యర్రగొండపాలెంలో 72, పెదఅవుటపల్లిలో 68.75, పెరుసోమలలో 60.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.