
హై గ్రోత్ చేపల్ని అభివృద్ధి చేసిన సిఫా
తక్కువ సమయంలో ఎక్కువ గ్రోత్ వ్యాధులకు దూరం
40 శాతం తగ్గనున్న పెట్టుబడి.. ఆ మేరకు పెరగనున్న ఆదాయం
సీడ్ ఉత్పత్తి కోసం ఎంపిక చేసిన ప్రైవేటు హేచరీలతో అవగాహనా ఒప్పందం
వచ్చే సీజన్ నుంచి ఏపీ రైతులకు అందుబాటులోకి వస్తాయంటున్న శాస్త్రవేత్తలు
సాక్షి, అమరావతి: చేపలు సాగు చేసే రైతులకు శుభవార్తే. వ్యాధులు సోకని హై గ్రోత్ చేపలు మార్కెట్లోకి రాబోతున్నాయి. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ (సిఫా) అభివృద్ధి చేసిన ఈ చేప విత్తనాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
వ్యాధుల నియంత్రణకే ఖర్చెక్కువ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో 5.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, దాంట్లో, 2.30 లక్షల ఎకరాల్లో చేపలు (Fishes) సాగవుతున్నాయి. మరోవైపు ఇన్‌ల్యాండ్ పబ్లిక్ వాటర్ బాడీస్‌లో కూడా చేపలు సాగవుతుంటాయి. ప్రధానంగా బొచ్చె (కట్ల), రాగండి (రోహు), మోసులు, రూప్ చంద్, ఫంగస్, పండుగప్ప, కొర్రమేను, తలాపియా వంటి వివిధ రకాల చేపలు సాగులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా కట్ల, రోహూ రకాల చేపలే ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఏటా 45 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అవుతుండగా, 70 నుంచి 80 శాతం ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకే ఎగుమతి అవుతుంటాయి.
1980వ దశకంలో అభివృద్ధి చేసిన ఈ రకాలు దాదాపు 40 ఏళ్లుగా సాగులో ఉండడం, వీటిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడంతో పాటు ఏటా పెరుగుతున్న వ్యాధులు రైతులకు పెనుసవాల్‌గా మారాయి. పేను, రెడ్ డిసీజ్, గిల్ ఫ్లూక్స్, ఆర్గులస్ (ఫిష్‌లైస్) వంటి వివిధ రకాల వ్యాధుల నియంత్రణకు ఏటా లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు. లీజుతో కలిపి ఎకరాలో చేపలసాగుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంటే దాంట్లో రూ.30 వేల నుంచి రూ.40వేల వరకు ఈ వ్యాధుల నియంత్రణకే ఖర్చుచేయాల్సి వస్తుంది.
పదేళ్ల కృషి ఫలితం
వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొనే ప్రత్యామ్నాయ రకాల అభివృద్ధి కోసం దశాబ్ద కాలం పాటు సిఫా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. వ్యాధులు దరిచేరని ఐదో తరానికి చెందిన అమృత బొచ్చె, జయంతి రాగండి రకాలను అభివృద్ధి చేశారు. క్షేత్రస్థాయి పరీక్షల అనంతరం పలుచోట్ల ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయవంతం చేశారు. చేపల ఉత్పత్తిలో దేశంలోనే ఆగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఈ చేపల విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సీడ్ పునరుత్పత్తి కోసం బాపట్లకు చెందిన హేచరీతో అవగాహనా ఒప్పందం చేసుకున్నారు.
ప్రస్తుతం సాగులో ఉన్న బొచ్చె, రాగండి చేపలు 10–12 నెలలకు కిలో నుంచి కిలోన్నర పెరిగితే, అమృత బొచ్చె, జయంతి రాగండి చేపలు కేవలం 6–8 నెలల కాలంలోనే కిలోకి పైగా ఎదుగుతాయి. అదే ఏడాది పాటు సాగు చేస్తే 2–2.5 కేజీల పెరుగుదలతో 30–40 శాతం హై గ్రోత్ కలిగి ఉంటాయి. సంప్రదాయ చేపలకు ఎక్కువగా సోకే రెడ్ డిసీజ్, పేను వ్యాధులు వీటికి సోకవు. ఈ కారణంగా ఎకరాకు మందులకు ఉపయోగిస్తున్న వ్యయాలు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు ఆదా అవుతుంది. పైగా 6–8 నెలల్లోనే పట్టుబడికి రావడంతో సమయం కలిసొస్తుంది.
అంటే సగటున రెండేళ్లకు మూడు పంటలు వేయొచ్చు. లేదంటే ఏడాది పాటు పెంచితే, వీటి గ్రోత్ కారణంగా 30–40 శాతం అదనంగా ఆదాయం వస్తుంది. ఇవి చూడడానికి గులాబీ రంగులో ఉంటాయి. పొడవు ఎక్కువగా, వెడల్పు తక్కువగా ఉంటాయి. బాణం ఆకారంలో నోరు కలిగి ఉంటుంది. సాధారణ బొచ్చె, రాగండి చేపల కంటే చాలా పెద్ద సైజులో ఉంటాయి. పాలీకల్చర్‌కు ఎంతో అనువైనవి.
చదవండి: గడ్డి భూముల్లో హాయ్, హాయ్
నాణ్యమైన సీడ్ అందించాలి..
నేను మూడు దశాబ్దాలుగా దాదాపు 150 ఎకరాల్లో చేపల సాగులో చేస్తున్నా. ప్రస్తుతం సాగులో ఉన్న కట్ల, రోహూ రకాలు దాదాపు 40 ఏళ్లపాటు సాగులో ఉండడం, పిల్లల ఉత్పత్తిలో ఇన్‌బ్రీడింగ్ వల్ల వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోయింది. ఏటా వీటికి సోకే వ్యాధుల నియంత్రణకు వాడే మందుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనితో పెట్టుబడి భారం పెరుగుతోంది. వీటికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన అమృత కట్ల, జయంతి రోహూ రకాలను సాధ్యమైనంత త్వరగా అందించగలిగితే చేప రైతులు నిలదొక్కుకోగలుగుతారు. జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ బ్రూడర్స్ ద్వారా నాణ్యమైన సీడ్ ఉత్పత్తికి సిఫా తోడ్పాటు అందించాలి.
– పి.బోసురాజు, కార్యదర్శి ఏపీ ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్
చేప రైతులకు నిజంగా వరం
సిఫా అభివృద్ధి చేసిన అమృత కట్ల, జయంతి రోహు రకాలు చేపల రైతులకు నిజంగా వరం. ఇవి ఐదో తరానికి చెందిన రకాలు. జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ రకాలు కావడంతో వ్యాధులు దరిచేరవు. ఆ మేరకు పెట్టుబడి ఆదా అవుతుంది. ఇప్పటికే బాపట్లలోని హేచరీలకు బ్రూడర్లు అందించాం. వచ్చే సీజన్ నుంచి ఈ చేప పిల్లలు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి వస్తాయి.
– డాక్టర్ రమేష్ రాథోడ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ సిఫా