
రోజుకు 23 గంటలకు పైగా కొనసాగుతున్న దర్శనాలు
ఒక్కోసారి తెల్లవారుజాము 2.50 గంటలకు ఏకాంత సేవ పూర్తి
తిరిగి 10 నిమిషాల వ్యవధిలోనే తెరుచుకుంటున్న తలుపులు
వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల పెంపువల్లే ఈ దుస్థితి
గతంలో రోజుకు 3 వేలు.. ప్రస్తుతం 7 వేలకు పైగానే
వెరసి మధ్యాహ్నం 1.30 గంటల వరకు బ్రేక్ దర్శనాలు
ఆ తర్వాత ప్రత్యేక ప్రవేశ, టైం స్లాట్ టోకెన్ల దర్శనం
అనంతరం సామాన్య భక్తులకు సర్వ దర్శనాలు
ఫలితంగా అర్ధరాత్రి దాటినా విశ్రాంతికి నోచుకోని దేవదేవుడు
తిరుమల: కూటమి ప్రభుత్వం ప్రజలకే కాదు.. తిరుమల వేంకటేశ్వరస్వామికి కూడా కునుకు లేకుండా చేస్తోంది. కూటమి ప్రభుత్వం నియమించిన టీటీడీ అధికారులు, పాలక మండలి చైర్మన్ వీఐపీల సేవలో తరిస్తూ.. సామాన్య భక్తులకు స్లాట్ ప్రకారం దర్శనం చేయించలేక, అర్ధరాత్రి వరకు దర్శనాలు కొనసాగిస్తున్నారు. దీంతో బ్రహ్మండ నాయకుడైన తిరుమల శ్రీనివాసునికి విశ్రాంతి కరువైంది. టీటీడీ అధికారులు ఆగమ శాస్త్ర నిబంధనలను పాటించక పోవడం మహాపచారంగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో రోజుకు మూడు వేలకు మించి విఐపీ బ్రేక్ దర్శన టికెట్లు కేటాయించే వారు కాదు. కానీ నేడు ఆ సంఖ్య 7 వేల నుంచి 7,500 వరకు పెరిగింది. దీంతో ఉదయం 8 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభమై మధ్యలో ప్రొటోకాల్ బ్రేక్, శ్రీవాణి దర్శనం, దాతలు, రెఫరల్ ప్రొటోకాల్ దర్శనాలు వరుసగా మధ్యాహ్నం 1:30 గంట వరకు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత గంట సమయం కలిగిన ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు, టైం స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు దర్శనం మొదలై 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది.
ఇలా ఒక్కో స్లాట్ ఆలస్యం అవుతుండటంతో తర్వాతి స్లాట్‌లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వెరసి రాత్రి నుంచి పడిగాపులు కాచిన సామాన్య భక్తులకు చాలా ఆలస్యంగా దర్శనం మొదలై అర్ధరాత్రి దాటినా కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా టీటీడీ దాదాపు 45 వేల టికెట్లు కేటాయిస్తుండగా, సర్వ దర్శనంలో దాదాపు 20 వేల మంది భక్తులు వస్తుంటారు. వీరందరికీ దర్శనం చేయించడానికి అర్ధరాత్రి దాటుతోంది. టీటీడీ అధికారులు విఐపీలకు ఇచ్చే ప్రాధాన్యత శ్రీవారికి ఇవ్వడం లేదని సామాన్య భక్తులు వాపోతున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలను రాజకీయంగా వాడుకోవడం పరిపాటిగా మారిందని, దేవదేవుడికి కూడా విశ్రాంతి లేకుండా చేశారని నిట్టూరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీరు వల్ల ముందస్తుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్ ద్వారా పొందిన వారికి కూడా నిర్ధేశించిన సమయానికి టీటీడీ దర్శనం చేయించలేకపోతోంది. గత ప్రభుత్వంలో ఈ దర్శనం రెండు మూడు గంటల్లో పూర్తయ్యేది. ఇప్పుడు నాలుగైదు గంటలు పడుతోంది.
ఏకాంత సేవ సమయాన్ని పెంచాలి
పెరుగుతున్న భక్తుల రద్దీతో స్వామి వారు సేదదీరే సమయం తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో స్వామి వారి ఏకాంత సేవ సమయాన్ని పెంచాలని అర్చక, పండిత బృందం టీటీడీ అధికార యంత్రాంగానికి సూచిస్తోంది. రోజూ వేకువజామున సుప్రభాత సేవతో స్వామికి నివేదనలు మొదలవుతాయి. ప్రస్తుతం వేకువజామున 2.30 గంటలకు మహాద్వారం, వెండి వాకిలి, బంగారు వాకిలి తలుపులు తెరిచి 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తున్నారు. అంతకంటే ముందు అర్ధరాత్రి 12 గంటలలోపే ఏకాంత సేవ నిర్వహించాలి.
అయితే కొన్ని నెలలుగా ఈ సేవ నిర్వహణ సమయం అర్ధరాత్రి 1–2 గంటల మధ్యకు మారిపోయింది. కొన్నాళ్లుగా తెల్లవారుజామున 2.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహించి, ఆలయం తలుపులు మూస్తున్నారు. ఒక్కోసారి 2.50 గంటలకు ఏకాంత సేవ పూర్తిచేసి, ఆ వెంటనే.. అంటే కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే తిరిగి ఆలయం తలుపులు తెరుస్తున్నారు. క్యూలైన్లు భారీగా ఉండి, కంపార్టుమెంట్లలో గంటల తరబడి భక్తులను నిరీక్షింప చేస్తున్నందున అర్ధరాత్రి దాటినా సరే దర్శనం పూర్తి చేయించాలనే ఉద్దేశం వల్ల ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి.
వెరసి రోజుకు 23 గంటలకు పైగా శ్రీవారి దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే, ఇది సరికాదని, గర్భాలయంలోని మూల మూర్తికి కనీసం గంట నుంచి గంటన్నర సేపైనా ఏకాంతం కల్పించాలని అర్చకులు, కొందరు పండితులు టీటీడీ అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఏకాంత సమయంలోనే దేవతలు భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిని ఆరాధిస్తారని, స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి పూజ చేస్తారని పురాణాల్లో ఉందని.. దేవతల ఆగమన సమయంలో మానవ సంచారం ఉండకూడదని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.