Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Tweet On Chandrababu Negligence Over Aqua Farmers Problems1
పబ్లిసిటీ కాదు బాబూ.. మేలు ముఖ్యం: వైఎస్‌ జగన్‌ ట్వీట్

సాక్షి, తాడేపల్లి: ఆక్వా రైతుల సమస్యల పట్ల సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మండిపడ్డారు. ‘‘చంద్రబాబూ.. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన, నా ట్వీట్‌ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కాని, మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు నా దృష్టికి తీసుకు వచ్చారు. మీ సమావేశాలు, మీరు చేస్తున్న ప్రకటనలు ప్రచారం కోసం కాకుండా ఆక్వా రైతులకు నిజంగా మేలు చేసేలా ఉండాలి’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.‘‘ఆక్వా రైతుల పెట్టుబడిలో రొయ్యలకు వేసే మేత ప్రధానమైనది. గతంలో ఈ ఫీడ్‌పై 15 శాతం సుంకం విధించినప్పుడు కంపెనీలన్నీ కిలోకు రూ.6.50లు చొప్పున పెంచారు. ఫీడ్‌ తయారు చేసే ముడిసరుకులపై ఇప్పుడు సుంకం 15 శాతం నుంచి 5 శాతంకి తగ్గింది. అలాగే సోయాబీన్‌ రేటు కిలోకు గతంలో రూ.105లు ఉంటే ఇప్పుడు రూ.25లకు పడిపోయింది. మరి ముడిసరుకుల రేట్లు ఇలా పడిపోయినప్పుడు ఫీడ్‌ రేట్లు కూడా తగ్గాలి కదా? ఎందుకు తగ్గడంలేదు? ఈ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.‘‘అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలన్నీకూడా 50 కౌంట్‌ లోపువే. అమెరికాకూడా మన దేశంపై విధించిన టారిఫ్‌లను 90 రోజులపాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలు పెరగాలి కదా? ఎందుకు పెరగడంలేదు? టారిఫ్‌ సమస్యతో సంబంధం లేని యూరప్‌ దేశాలకు 100 కౌంట్ రొయ్యలు ఎగుమతి అవుతాయి. వీటి రేటుకూడా పెరగడంలేదు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.220ల రేటు కూడా రైతులకు రావడంలేదు. 100 కౌంట్‌ రొయ్యలకు రూ.270ల రేటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..మా ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్ అథారిటీ కింద ఎంపెవరింగ్‌ కమిటీ ఉండేది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచేది. ఇలాంటి వ్యవస్థలను ఇప్పుడు అచేతనంగా మార్చేశారు. వెంటనే దీన్ని పునరుద్ధరిస్తూ రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. 1. @ncbn గారూ.. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన, నా ట్వీట్‌ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కాని, మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు నా దృష్టికి తీసుకు వచ్చారు. మీ సమావేశాలు,…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 10, 2025

USA Raised Its Tariff Rate On Chinese Imports To 145 percent2
చైనాకు ట్రంప్ మరో షాక్.. డ్రాగన్‌పై మరోసారి టారిఫ్‌ విధింపు

వాషింగ్టన్‌: అమెరికా,చైనా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా చైనాపై డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సుంకం విధించారు. దీంతో చైనా వస్తువులపై అమెరికా విధించిన టారిఫ్‌ మొత్తం 145 శాతానికి చేరుకుందని వైట్‌హౌస్‌ అధికారి అమెరికన్‌ మీడియా సంస్థ సీఎన్‌బీసీకి ధృవీకరించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. డ్రాగన్‌ దిగుమతులపై ఉన్న 20 శాతం సుంకాలకు అదనంగా 34 శాతం విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్‌ ప్రకటించారు. దీనిపై చైనా ‌దీటుగా స్పందిస్తూ అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించింది. ఇదే విషయంలో ట్రంప్‌ డ్రాగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాకు డెడ్‌లైన్‌ పెట్టి.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే 104 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. తామేం తక్కువ కాదన్నట్లుగా అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకం విధించింది. JUST IN: 🇺🇸🇨🇳 White House says total US tariffs on China are now 145% pic.twitter.com/67oyICPVNb— Mastering Crypto 🇺🇲 (@MasteringCrypt) April 10, 2025పట్టు వీడి దిగి రావాల్సింది పోయి అర్థం లేని దూకుడుగా వ్యవహరిస్తుందంటూ చైనాపై మరో 50 శాతం కలిపి మొత్తంగా 125 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఈ తరుణంలో తాజాగా మరో 20 శాతం టారిఫ్‌ పెంచారు. దీంతో చైనా దిగుమతులపై అమెరికా విధించిన సుంకం 145శాతానికి చేరినట్లైంది. ఇదే విషయాన్ని వైట్‌ హౌస్‌ వర్గాలు అధికారికంగా ప్రకటించారు.

Tabu to Join Vijay Sethupathi In Puri Jagannadh Next Movie3
ఈసారి కొత్తగా ట్రై చేస్తున్న పూరీ

వరుసగా లైగర్‌, డబుల్‌ ఇస్మాట్‌ చిత్రాలతో ప్లాప్‌ కొట్టిన దర్శకుడు పూరీ జగన్నాద్‌(Puri Jagannadh) ఈ సారైనా గట్టిగా హిట్‌ కొట్టాలని ప్లాన్‌ చేస్తున్నాడు. ఇటీవలే విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi)తో సినిమాను ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచిన పూరీ, ఆ చిత్రానికి ఫీమేల్‌ లీడ్‌గా నటి 'టబు'ను తీసుకున్నారు. ఈ రోజు అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించారు. అల్లు అర్జున్‌తో కలిసి 'అల వైకుంఠపురము'లో చిత్రం తరువాత టబు తెలుగులో అంగీకరించిన సినిమా ఇదే కావడం విశేషం. అంటే దాదాపు ఐదు సంవత్సరాల విరామం తరువాత 'టబు' మరో తెలుగు చిత్రంలో నటిస్తోందన్నమాట. కేవలం మంచి పాత్రలు దొరికితేనే నటిస్తానన్న టబు(Tabu) పూరీ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా, వైవిద్యంగా, బలంగా ఉంటుందని తెలిపింది. ఇక ఈ చిత్ర రెగ్యులర్‌ షూట్‌ జూన్‌లో మొదలుకానుంది. తెలుగుతో పాటు హింది, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చూస్తుంటే ఈ సారి పూరీ ఏదో కొత్తగా ప్లాన్‌ చేసినట్టే ఉన్నాడు.

Sakshi Guest Column On Donald Trump USA4
మూర్ఖత్వం

1. ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ మద్దతుదారులలో చాలామంది, బహుశా ట్రంప్‌ కూడా, అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలే అధిక సుంకాలను చెల్లిస్తాయని నమ్ముతున్నట్లుంది. వాస్తవం ఏమిటంటే, సుంకాలను దిగుమతి దారులు చెల్లిస్తారు. వారు ఆ ఖర్చును వినియోగదారులకు, ఈ సందర్భంలో, అమెరికన్‌ ప్రజలకు బదిలీ చేస్తారు.2. సుంకాల విధింపు అనేది చర్చల వ్యూహంలో భాగమా? ట్రంప్‌ మొదటి పదవీకాలం విషయంలో అది నిజమే కావచ్చు. ఇప్పుడు అలా చేయడం కష్ట తరమైన ఆలోచన. కొన్ని దేశాలు తమ సుంకాలను తగ్గించుకోవచ్చు. కానీ చాలా దేశాలు ప్రతీకార సుంకాలను విధిస్తున్నాయి. తన మద్దతుదారులకు తాను బలంగా కనిపించాలని ట్రంప్‌ అనుకుంటున్నట్లుగానే, ఇతర దేశాల నాయకులు కూడా బలహీనంగా కనిపించడానికి ఇష్టపడకపోవచ్చు.3. ట్రంప్‌ మాంద్యాన్ని పెంచి పోషించడానికీ, తద్వారా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ను వడ్డీ రేట్లను తగ్గించమని బలవంతం చేయడానికీ ప్రయత్నిస్తు న్నారని కూడా చెబుతున్నారు. తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వృద్ధిని నడిపిస్తాయి. అలాగే 2026 మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీకి సహాయపడ తాయి. అయితే, ఆర్థిక వ్యవస్థ కారు లాంటిది కాదు. కారు వేగాన్ని యాక్సిలరేటర్‌తోనూ, బ్రేక్‌ తోనూ సులభంగా నియంత్రించవచ్చు. ఇది సంక్లి ష్టమైన వ్యవస్థ. అమెరికా సుంకాలు అలాగే ఉంటే, అక్కడ రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వడ్డీ రేటు కోత అవకాశాలను తగ్గిస్తుంది. ఇంకొకటి: ప్రజలు పేదరికాన్ని అనుభూతి చెందుతూ సాధా రణంగా వారు చేసే దానికంటే తక్కువ ఖర్చు చేయడం వల్ల, వినియోగదారుల వ్యయం, ఆర్థిక వృద్ధి మందగిస్తాయి.4. దేశాలేవీ గతంలో సుంకాలను వేయలేదని దీని అర్థం కాదు. అవి వాటిని అస్త్రాలుగా వాడాయి. కానీ సార్వత్రిక సుంకాలు సాధారణంగా బలహీనంగా ఉండే ఆర్థిక ఫలితాలకు దారితీస్తాయి. 1930 జూన్‌లో అమెరికా ఆమోదించిన ట్యారిఫ్‌ చట్టం (లేదా స్మూట్‌–హాలీ చట్టం), 1929లో ప్రారంభ మైన మహా మాంద్యం తర్వాత దాని ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ఉద్దేశించబడింది. రక్షణ వాద ప్రభంజన కాలంలో ఈ చట్టం 20,000 పారి శ్రామిక, వ్యవసాయ వస్తువులపై సుంకాలను రికార్డు స్థాయికి పెంచింది. ఇతర దేశాలు తమ సొంత సుంకాలతో స్పందించాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసి, మాంద్యాన్ని పొడిగించింది. దేశాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ఖర్చులతో సిద్ధమై, పోరాడటం ప్రారంభించిన తర్వాత పరిస్థితి మారింది. నాటి ఈ పాఠాన్ని అమెరికా పాలనాయంత్రాంగం మరచిపోయింది. 5. పరస్పర సుంకాల రేట్లను చాలా మోటు సూత్రాన్ని ఉపయోగించి నిర్ణయించినట్లు అనిపి స్తుంది. భారతదేశం విషయంలో, ఈ సుంకం 26 శాతం వేశారు. 2024లో, అమెరికా భారతదేశంతో 45.7 బిలియన్‌ డాలర్ల విలువైన వాణిజ్య లోటును కలిగి ఉంది. అంటే భారతదేశం నుండి అమెరికా వస్తువుల దిగుమతులు భారతదేశానికి దాని వస్తువుల ఎగుమతుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఇది సూచిస్తుంది. భారతదేశం నుండి అమెరికా సరుకుల దిగుమతులు 87.4 బిలియన్‌ డాలర్లు. ఈ 87.4 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతుల్లో 45.7 బిలియన్‌ డాలర్ల అమెరికా లోటు 52 శాతానికి వస్తుంది. ఈ రేటును సగానికి తగ్గించినప్పుడు, 26 శాతం అవుతుంది.ఇక్కడ బహుళ సమస్యలు ఉన్నాయి. సేవల వాణిజ్యాన్ని పరిగణించలేదు. కరెన్సీ తారుమారు, వాణిజ్యేతర అడ్డంకులను పరిగణనలోకి తీసుకోలేదు. ఒక దేశం దాని సుంకాలను తగ్గించాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ దేశంతో అమెరికా వాణిజ్య లోటు తగ్గకపోవచ్చు. ఎందుకంటే ఆ దేశానికి అమెరికా మరిన్ని ఎగుమతి చేయవలసి ఉంటుంది. మరిన్ని ఎగుమతి చేయడం అంటే తక్కువ సుంకాల రేటు గురించి మాత్రమే కాదు. అమెరికా ముందుగా వస్తువులను ఉత్పత్తి చేయాలి. అది కూడా ఇతర దేశాలకు ఆసక్తి కలిగించే ధరకు ఉత్పత్తి చేయాలి.తనకు తెలియదని తెలియదు!6. ట్రంప్‌ ఇలా సుంకాలు వేస్తున్నారంటే, తాను దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించే ఉంటారని నమ్మే ఒక ఆలోచనా విధానం కూడా ఉంది. ఇది మన ముందున్న అతిపెద్ద ప్రమాదాన్ని వెల్లడిస్తుంది: ట్రంప్‌కు తనకు తెలియనిది తెలియదని తెలీకపోవచ్చు. ఆయన అందరి దృష్టీ తన వైపు ఉండటాన్ని ఇష్టపడు తున్నట్లు, తనను తాను నిర్ణయాత్మక వ్యక్తిగా చూపించుకుంటున్నట్లు అనిపిస్తుంది.7. విధించిన ఈ సుంకాలు దేశీయ మార్కెట్‌ కోసం అమెరికాలోనే ఉత్పత్తి చేయమని కంపెనీలపై ఒత్తిడి తెస్తాయనే నమ్మకాన్ని ట్రంప్‌ మాటలు సూచిస్తున్నాయి. కానీ అది అంత సులభం కాదు.ఎందుకంటే అమెరికాలో ఉత్పత్తి చేయడం ఖరీదైన ప్రతిపాదన కావచ్చు. అసలు అందుకే కంపెనీలు మొదటగా బయటకు వెళ్లాయి. ఇప్పుడు కంపెనీల సరఫరా గొలుసులు చాలా పరిణామం చెందాయి. ఒక ఉత్పత్తి దాని తయారీ ప్రక్రియలో అనేకసార్లు అమెరికా సరిహద్దులను దాటవచ్చు. అందుకే కంపె నీలు ట్రంప్‌ రెండవ పదవీ కాలం ముగిసేదాకా వేచి ఉండాలని నిర్ణయించుకునే అవకాశం కూడా ఉంది.8. ట్రంప్‌ ఈ సుంకాల విధింపు వ్యూహాన్ని ద్విగిణీకృతం చేసినట్లయితే, అది దేశాలను అమెరికా నుండి మరింత దూరం చేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికన్‌ డాలర్‌ కేంద్రంగా ఉద్భవించిన ప్రపంచ క్రమాన్ని అది చెదరగొడుతుంది.ఇప్పుడు దానికి మరొక వివరణాత్మక వ్యాసం అవసరం. కానీ ఒకే వాక్యంలో చెప్పాలంటే, గ్రాహమ్‌ గ్రీన్‌ 1978లో ప్రచురించిన ‘ది హ్యూమన్‌ ఫ్యాక్టర్‌’ నవలలో ఇలా రాశాడు: ‘మనకు చైనీయులు అవసరమయ్యే రోజు రావచ్చు’.వ్యాసకర్త ఆర్థిక అంశాల వ్యాఖ్యత, రచయిత ‘ (‘ద మింట్‌’ సౌజన్యంతో)

Sakshi Editorial On verdict given by Supreme Court bench5
నిజాయితీపరులకు న్యాయమెలా?

షడ్రసోపేత విందు సాగుతుండగా హఠాత్తుగా ఎవరోవచ్చి పంక్తి నుంచి అమర్యాదగా మెడపట్టి గెంటేస్తే? కాళ్లకింది నేల ఒక్కసారిగా బద్దలై మింగేస్తే? పశ్చిమబెంగాల్‌లో పదేళ్లుగా కొలువులు చేస్తున్న వేలాది ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది స్థితి అలాంటిదే. 2016లో స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ద్వారా ఎంపికైన మొత్తం 25,752 మంది టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నియామకాలు చెల్లబోవని, వారిని తక్షణం తొలగించాలని గత వారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో వారంతా రోడ్డున పడ్డారు. కేన్సర్‌ బారినపడిన ఒకే ఒక్క ఉపాధ్యాయురాలిని మాత్రం ధర్మాసనం మినహాయించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదలుకొని అందరూ ఉద్యోగాలు కోల్పోయినవారిపై సానుభూతి ప్రకటిస్తున్నారు. మమత అయితే తీర్పును తప్పుబట్టారు. ఉద్యోగాలు కోల్పోయినవారు ఎప్పటిలాగే విధి నిర్వహణ చేయొచ్చని, వేరే ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్దుతామని బింకంగా ప్రకటించారు. వారికోసం జైలుకు పోవటానికీ సిద్ధమేనన్నారు. రేపటి సమాజం తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందంటారు. సగటు విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దటం, వారి సృజనాత్మకతను వెలికితీసి మెరికల్లా మార్చటం, పటుతర శక్తిగా మల చటం ఉపాధ్యాయులు చేసే పని. ఇంతటి మహత్కార్యాన్ని నిర్వర్తించాల్సినవారు కాస్తా ముడుపులు సమర్పించుకుని దొడ్డిదారిన వచ్చిచేరారంటే అంతకన్నా దారుణం మరొకటుండదు. ఈ రిక్రూట్‌ మెంట్‌పై ఆ రోజుల్లోనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అభ్యర్థుల ర్యాంకులు తలకిందులు చేశారని, అధిక మార్కులు వచ్చినవారికి అన్యాయం జరిగిందని, అసలు మెరిట్‌ లిస్టులోగానీ, వెయిటింగ్‌ లిస్ట్‌లోగానీ లేనివారు చివరిలో విజేతల జాబితాకెక్కారని, మెరుగైన మార్కులతో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూలో సైతం నెగ్గినవారికి ఉద్యోగాలు నిరాకరించారని ఆ ఆరోపణల సారాంశం. అయినా ప్రభుత్వం కిమ్మనలేదు. దీనిపై హైకోర్టు నియమించిన విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల కమిటీ 2021లో ఎన్నో అవకతవకలు బయటపెట్టింది. అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్‌ల మూల్యాంకనానికి నియమించిన సంస్థ దాన్ని మరో సంస్థకు అప్పగించటమూ వెల్లడైంది. సీబీఐ దర్యాప్తులో కీలక సాక్ష్యాధారాలున్న మూడు హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనమయ్యాయి. అయిదుగురు అరెస్టయ్యారు. అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు గల్లంతయినట్టు కనుక్కుంది. తమ అవకతవకలు కప్పి పుచ్చేందుకు నిబంధనల సాకుచూపి 2019లోనే వాటిని ధ్వంసం చేసినట్టు నిర్ధారణైంది. ఆ సంస్థ నివేదిక ఆధారంగా మొత్తం రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను రద్దుచేస్తూ, తిరిగి నోటిఫికేషన్‌ ఇచ్చి నియామకాలు చేయాలని ఆదేశిస్తూ నిరుడు ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై మొదట్లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ ఈ నెల 3న తీర్పునిచ్చింది. మొత్తం రిక్రూట్‌మెంట్‌ రద్దు చేయటం భావ్యంకాదని, ఇందులో నిజాయితీగా ఎంపికైనవారూ ఉన్నారని ప్రభుత్వం చేసిన వాదనతో సుప్రీం ఏకీభవించలేదు. ఓఎంఆర్‌ షీట్లు లేకుండా ఆ సంగతెలా నిర్ధారిస్తామంది.హఠాత్తుగా ఉద్యోగాల నుంచి గెంటేయటం బాధాకరమనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఎంపికైన వారంతా అవినీతిపరులు కాదు. వారి సంఖ్య 5,300 మించివుండదంటున్నారు. ఇలాంటి ఎంపికల్లో మొత్తం ప్రక్రియను భ్రష్టుపట్టించటం ఎంతటి అవినీతిపరులకైనా అసాధ్యం. కానీ సరైన మార్గంలో వచ్చినవారెవరో తెలిసేదెలా? ఇందుకు ప్రధానంగా నిందించాల్సింది ప్రభుత్వాన్నే. ఈ రిక్రూట్‌మెంట్‌ను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసిన సీపీఎం నేత, న్యాయవాది వికాస్‌రంజన్‌ భట్టాచార్యకు నోబెల్‌ బహుమతి ఇవ్వాలని మమత వ్యంగ్యంగా వ్యాఖ్యానించటం సరేగానీ... తన వంతు ఆమె చేసిందేమిటి? ఒకపక్క ఆరోపణలొస్తున్నప్పుడు ఓఎంఆర్‌ షీట్లు భద్రపరచటం వంటి కనీస చర్యనైనా ఎందుకు తీసుకోలేకపోయారు? ఉపద్రవం ముంచుకొస్తున్నదని తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు ఎలావున్నారు? ఓఎంఆర్‌ షీట్లుంటే అక్రమార్కుల నిర్ధారణ సులభమయ్యేది. నిజాయితీ పరులకు రక్షణ దొరికేది. అయినా తమ వద్ద కచ్చితంగా నిర్ధారించగల ఇతరేతర సాక్ష్యాలున్నాయని ఉన్నతాధికారులంటున్నారు.ఉద్యోగాలు కోల్పోయిన టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఆగ్రహం అర్థం చేసుకోదగిందే. వారు ఇప్పటికే తమకంటూ గూడు నిర్మించుకుని వుంటారు. నెలవారీ వాయిదాల్లో చెల్లించేలా రుణాలు తీసుకుంటారు. అనారోగ్యం వల్లనో, మరే ఇతర కారణంతోనో దొరికినచోట అప్పుచేస్తారు. ఈ రుణవలయం నుంచి బయటపడేదెలా? అందరూ దొంగలు కాదు. అయినా కొలువు పోయింది... జీవనాధారం మాయమైంది, కానీ అదొక్కటే సమస్య కాదు తమ శిష్యుల ముందు చులకనై పోయారు. అవినీతిపరులన్న ముద్రపడింది. దీన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యా ర్థులది మరో సమస్య. వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండగా గురువులు లేకపోవటం, కొన్నిచోట్ల సిబ్బంది కొరతతో యూనిట్‌ పరీక్షలు వాయిదా పడటం వారిని కలచి వేస్తోంది. అస్తవ్యస్త పాలనకు బెంగాల్‌ చిరునామాగా మారింది. నిరుడు ఆగస్టులో ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో ఒక మహిళా వైద్యు రాలిపై అత్యాచార ఉదంతంలో సైతం స్పందన అంతంతమాత్రం. చివరకు సుప్రీంకోర్టు జోక్యం తప్పలేదు. ఇప్పుడు ఎస్‌ఎస్‌సీ స్కాంలోనూ అదే నిర్వాకం. ప్రస్తుతం నిజంగా అర్హులైన ఉపాధ్యాయులను గుర్తించి వారికి న్యాయం చేసేందుకు ఏయే అవకాశాలున్నాయో చూడటం, తమ దగ్గరున్న సాక్ష్యాధారాలివ్వటం తప్ప మరే మార్గమూ లేదు. దానికి బదులు కోర్టుల్ని నిందించి, మరొకరిని తప్పు బట్టి ప్రయోజనం లేదని మమతా బెనర్జీ గ్రహించాలి.

Prithvi Shaw replace Ruturaj Gaikwad in CSK: Reports6
పృథ్వీ షాకు బంపరాఫర్‌.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్‌-2025 సీజన్ నుంచి వైదొలిగాడు. రుతురాజ్ స్ధానంలో సీఎస్‌కే కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నైకి ఇప్పుడు గైక్వాడ్ దూరం కావడం నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి.ఈ క్రమంలో గైక్వాడ్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో సీఎస్‌కే మెనెజ్‌మెంట్ పడింది. టీమిండియా ఓపెనర్, ముంబై స్టార్ ప్లేయర్ పృథ్వీ షాని తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో కొన్ని సీజ‌న్ల పాటు ఓ వెలుగు వెలిగిన పృథ్వీ షా.. తొలిసారి ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు దూరంగా ఉన్నాడు.ఐపీఎల్‌-2025 మెగా వేలంలో పృథ్వీ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూప‌లేదు. ప్రస్తుతం ఫామ్ లేమి, ఫిట్‌నెస్ సమస్యలతో సతమతవుతున్నందున షాను ఏ ఫ్రాంచైజీ కూడా సొంతం చేసునేందుకు ముందుకు రాలేదు. తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సైతం అత‌డిని తిరిగి సొంతం చేసుకునేందుకు క‌నీస ప్ర‌య‌త్నం చేయ‌లేదు. అయితే మ‌రోసారి పృథ్వీ షాకు రుతురాజ్ గాయం రూపంలో అవ‌కాశం ల‌భించే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 79 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన షా.. 147.47 స్ట్రైక్ రేట్‌తో 1,892 పరుగులు చేశాడు. అందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చ‌ద‌వండి: #Virat Kohli: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..

Successfully extradited NIA said on Tahawwur Rana7
Tahawwur Rana: తహవూర్‌ రాణా దారులన్నీ మూసుకుపోయాయి.. ఇక

ఢిల్లీ: ముంబై 26/11 ఉగ్రదాడి కేసు ప్రధాన నిందితుడు తహవూర్‌ హుస్సేన్‌ రాణాను (Tahawwur Rana) భారత్‌కు తరలించారు. అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఢిల్లీ విమానాశ్రయంలోనే రాణాను ఎన్‌ఏఐ(National Investigation Agency) అరెస్ట్‌ చేసింది. అనంతరం తీహార్‌ జైలుకు తరలించింది. తీహార్‌ జైల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్‌ఐఏ విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా తహవూర్‌ రాణా గురించి ఎన్‌ఐఏ అధికారిక ప్రకటన చేసింది.ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ తహవర్ రాణాను భారత్‌కు తీసుకురావడంలో ఎన్ఐఏ విజయవంతమైంది. ముంబై దాడులకు పడిన పాల్పడిన కుట్ర దారున్ని న్యాయస్థానాల ముందు నిలబెడుతున్నాం. అమెరికాలో రాణాకు అన్ని న్యాయపరమైన దారులు మూసుకు పోయాయి. 2023 మే 16న భారత్‌కు అప్పగించేందుకు అమెరికా స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. pic.twitter.com/nS7dA58W55— NIA India (@NIA_India) April 10, 2025 రాణా ఫైల్ చేసిన అన్ని పిటిషన్లు అమెరికా సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాలు కొట్టివేశాయి. అమెరికా భారత్‌లోని కీలక సంస్థల సమన్వయంతో రాణాను భారత్‌కు తీసుకు రాగలిగాం. ముంబై ఉగ్రదాడుల కుట్ర దారు రాణా. డేవిడ్ హెడ్లితో కలిసి ముంబై దాడులకు కుట్ర పన్నాడు. లష్కర్ ఈ తోయిబా, హుజీ ఉగ్ర సంస్థలు, పాకిస్తాన్ కుట్ర దారులు ఇందులో భాగస్వాములు. ముంబై ఉగ్రదాడులో 166 మంది చనిపోయారు 238 మంది గాయపడ్డారు’అంటూ అధికారిక నోట్‌ను విడుదల చేసింది.

Hyderabad And Telangana Rains Update8
హైదరాబాద్‌లో భారీ వర్షం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో భారీ గాలులు మొదలయ్యాయి. పలు చోట్ల వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, చందానగర్‌, మియాపూర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌ ఎస్‌ఆర్‌ నగర్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్, ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడు గంటల పాటు హైదరాబాద్ నగరంలో గాలి దుమారంతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.తెలంగాణలో పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ భద్రాద్రి ములగు భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది.హైదరాబాద్‌లో హైడ్రా డిజాస్టర్ టీం అప్రమత్తమైంది. మొదలైన భారీ గాలులు వీస్తుండటంతో చెట్ల కొమ్మలు విరిగిపడే ప్రమాదాలు అధికంగా ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ ప్రజలను అధికారులు సూచించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి సర్దార్ నగర్, రావిరాల,తుక్కుగూడ, శ్రీనగర్, ఇమామ్ గూడా, హర్షగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాష్టంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గాలిలో తేమ శాతం పెరిగి గాలి దుమారంతో వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్‌లో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. వికారాబాద్, సంగారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈ రెండు జిల్లాలకు వచ్చే మూడు గంటల పాటు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, నిజామాబాద్ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో వచ్చే మూడు గంటల పాటు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది.

Virat Kohli beats Rohit Sharma on his way to create IPL history9
#Virat Kohli: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..

టీమిండియా స్టార్ ప్లేయర్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో 1,000 ఫోర్లు బౌండరీలు బాదిన తొలి ప్లేయర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లి ఈ రేర్ ఫీట్‌ను సాధించాడు.కోహ్లి ఇప్పటివరకు ఐపీఎల్‌లో 249 మ్యాచ్‌లు ఆడి 1001 బౌండరీలు బాదాడు. అందులో 721 ఫోర్లు, 280 సిక్స‌ర్లు ఉన్నాయి. కోహ్లి తర్వాతి స్ధానంలో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్‌(920) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి ఫర్వాలేదన్పించాడు. 14 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22 పరుగులు చేశాడు.అదే విధంగా ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు కోహ్లి కేవలం మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు 249 ఇన్నింగ్స్‌ల్లో 280 సిక్సర్ల బాదాడు. మరో మూడు సిక్సర్లు కొడితే భారత కెప్టెన్ రోహిత్ శర్మను కోహ్లి అధిగమిస్తాడు. రోహిత్‌ ఐపీఎల్‌లో 256 ఇన్నింగ్స్‌ల్లో 282 సిక్సర్లు బాదాడు.ఐపీఎల్‌లో అత్యధిక బౌండరీలు బాదిన టాప్‌-5 ఆటగాళ్లు..1001* – విరాట్ కోహ్లీ920 – శిఖర్ ధావన్899 – డేవిడ్ వార్నర్885 – రోహిత్ శర్మ761 – క్రిస్ గేల్ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్‌-5 ఆటగాళ్లు..క్రిస్‌ గేల్‌- 357రోహిత్‌ శర్మ- 282విరాట్‌ కోహ్లి- 278ఎంఎస్‌ ధోని- 259ఏబీ డివిలియర్స్‌- 251చ‌ద‌వండి: సంచ‌ల‌నం.. 64 ఏళ్ల వ‌య‌స్సులో అంత‌ర్జాతీయ అరంగేట్రం

Ajith Kumar Good Bad Ugly Movie Review In Telugu10
అజిత్ కుమార్‌ యాక్షన్‌ థ్రిల్లర్.. 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' ఎలా ఉందంటే?

టైటిల్: గుడ్ బ్యాడ్‌ అగ్లీనటీనటులు: అజిత్‌ కుమార్, త్రిష, సునీల్, అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, సిమ్రాన్‌ తదితరులుదర్శకత్వం: అధిక్ రవిచంద్రన్నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యేర్నేని, వై రవిశంకర్ఎడిటర్: విజయ్‌ వేల్‌కుట్టిసినిమాటోగ్రఫీ: అభినందన్‌ రామానుజంసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్విడుదల తేదీ: ఏప్రిల్ 10, 2025విదాముయార్చి తర్వాత కోలీవుడ్ స్టార్ అజిత్‌ కుమార్ నటించిన చిత్రం 'గుడ్ బ్యాడ్‌ ‍‍‍అగ్లీ'. విదాముయార్చి ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో తాజా యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్‌ హీరోగా పేరున్న అజిత్‌.. ఈ సినిమాతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులతో గుడ్‌ అనిపించాడా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.గుడ్‌ బ్యాడ్ అగ్లీ కథేంటంటే..ముంబయిలో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌ ఏకే(అజిత్‌ కుమార్) అలియాస్‌ రెడ్ డ్రాగన్‌. అతనంటే విదేశాల్లో ఉండే గ్యాంగస్టర్లకు సైతం హడల్‌. అలా వరల్డ్‌ ఫేమస్ గ్యాంగ్‌స్టర్‌ అయిన ఏకే.. తన భార్య రమ్య(త్రిష) కోసం తన వృత్తిని వదిలేసేందుకు సిద్ధమవుతాడు. భార్యకు, తన కుమారుడు విహాన్‌కి (కార్తీక్‌ దేవ్‌) ఇచ్చిన మాట కోసం.. జైలుకు వెళ్తాడు. అలా జైలుకెళ్లిన ఏకే దాదాపు 17 ఏళ్ల తర్వాత విడుదలై.. 18వ పుట్టినరోజు నాడు తన కుమారుడిని చూసేందుకు వ‍చ్చిన ఏకేకు ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి? తండ్రి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విహాన్‌.. ఒక అమ్మాయి ప్రేమ కారణంగా.. అనూహ్యంగా ఓ కేసులో జైలుకు వెళ్తాడు. అసలు కుమారుడిని చూసేందుకు వస్తున్న ‍అజిత్‌ను టార్గెట్ చేసింది ఎవరు? తండ్రి వల్లే తన కుమారుడు జైలుకు వెళ్లాడని భావిస్తున్న రమ్య(త్రిష) ఆ తర్వాత ఏం చేసింది? అజిత్‌కు.. విహాన్‌ కేసుతో ఏమైనా సంబంధం ఉందా? లేదంటే త్రిష వల్లే విహాన్‌ కేసులో చిక్కుకున్నాడా? చివరికీ ఈ కేసు నుంచి తన కుమారుడిని అజిత్ బయట పడేశాడా? కుమారుడిని విడిపించుకునేందుకు త్రిష ఏం చేసింది? విహాన్ ప్రేమించిన అమ్మాయి ఎవరు? అనే విషయాలు తెలియాలంటే గుడ్ బ్యాడ్ ‍అగ్లీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..గుడ్ బ్యాడ్ అగ్లీ..టైటిల్ వినగానే అందరికీ కాస్తా కొత్తగానే అనిపిస్తూ ఉండొచ్చు. ఇది చూసి సగటు ప్రేక్షకునికి అంతా ఫుల్ యాక్షన్‌, వయోలెన్స్‌ ఉంటుందేమో అనిపించి ఉంటుంది. ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో మొదలైన ఈ కథ.. స్పెయిన్‌లో ముగించేలా ప్లాన్‌ చేశాడు డైరెక్టర్‌. యాక్షన్‌ హీరోగా పేరున్న అజిత్‌ను ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగానే డైరెక్టర్‌ చూపించాడు. ఫస్ట్ హాఫ్‌లో అజిత్ జైలు జీవితం, భార్య త్రిషతో ఉన్న అనుబంధం చుట్టూ తిరుగుతుంది. జైలులో అజిత్‌ ఫైట్ సీక్వెన్స్ అభిమానులకు మాత్రం హై ఫీస్ట్‌లా అనిపిస్తుంది. యాక్షన్‌ సినిమా అంటే అంతా రక్తపాతంలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు.. కానీ అధిక్ మాత్రం ఫైట్స్‌ను తనదైన డిఫరెంట్‌ స్టైల్లో చూపించారు. టాలీవుడ్‌ నటుడు సునీల్‌ స్టైల్‌ మాత్రం తెలుగు అభిమానులకు కొత్తగా అనిపిస్తుంది.జైలు నుంచి రిలీజ్‌కు ఇంకా మూడు నెలలు ఉండగా.. ముందుగానే ‍అజిత్‌ బయటికి రావడం..ఆ తర్వాత జరిగే పరిణామాలు సగటు ప్రేక్షకునికి రోటీన్‌గానే అనిపిస్తాయి. కానీ ఏకే బయటికి వచ్చాకే అసలు కథ మొదలవుతుంది. అలా ఇంటర్వెల్‌కు ముందు ఓ బిగ్‌ ఫైట్‌ సీన్‌తో బ్యాంగ్‌ పడేశాడు. ఇక్కడే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందన్న టైమ్‌లోనే ఇంటర్వెల్‌కు ముందు ప్రధాన ప్రతినాయకుడు అర్జున్‌ దాస్‌(జానీ)కి సంబంధించిన ట్విస్ట్‌ రివీల్ కావడంతో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ మిస్సవుతుంది. ట్విస్ట్‌లు కాస్తా రివీల్ చేయడంతో సెకండాఫ్‌ ఆడియన్స్‌ ఉహకందేలా చేశాడు దర్శకుడు. అయితే ఫైట్ సీక్వెన్స్‌లో జీవీ ప్రకాశ్ బీజీఎం మాత్రం అదిరిపోయింది. అలాగే సాంగ్స్‌ కూడా ఫర్వాలేదనిపిస్తాయి.ఇక ద్వితీయార్థం వచ్చేసరికి ముంబయితో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్యాంగస్టర్లకు సైతం చెమటలు పట్టించే రెడ్‌ డ్రాగన్‌గా ఏకే ఎలా మారాడు? అతని ప్రస్థానం ఎలా మొదలైంది? అనే అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఏకే అలియాస్ రెడ్‌ డ్రాగన్‌ టీమ్‌ చేసే ఫైట్స్‌ ఆకట్టుకునేలా ఉన్నా.. కొత్తదనం లేకపోవడంతో సగటు ప్రేక్షకుడికి కాస్తా బోరింగ్‌గానే అనిపిస్తాయి. కానీ యాక్షన్‌ చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రం విజువల్ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. కుమారుడి(విహాన్) కోసం ఏకే చేసే పోరాట సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే సెకండాఫ్‌లో సిమ్రాన్‌(సుల్తానా) ఎంట్రీతో ఫుల్ యాక్షన్‌ మోడ్‌లో సాగుతున్న కథలో కామెడీ పండించాడు. సాంగ్స్‌లో ఎక్కువగా తమిళం స్లాంగ్‌ రావడంతో తెలుగు ఆడియన్స్‌కు అంతా ఆసక్తిగా అనిపించదు. ‍క్లైమాక్స్ సీన్‌ వచ్చేసరికి.. అర్జున్‌ దాస్‌తో ఫైట్స్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయింది. క్లైమాక్స్ యాక్షన్‌ సీన్స్‌లోనూ కామెడీ పండించడం అధిక్ రవిచంద్రన్‌కే సాధ్యమైంది. చివర్లో కేజీఎఫ్, యానిమల్‌ మూవీ స్టైల్లో క్లైమాక్స్ ఉండడంతో కొత్తగా అనిపించదు. చివరికీ మనం బ్యాడ్ నుంచి గుడ్‌గా మారినా.. మనల్ని మళ్లీ బ్యాడ్‌ వైపే తీసుకెళ్తే ఎలా ఉంటుందనేది గుడ్‌ బ్యాడ్‌ ‍అగ్లీతో సందేశమిచ్చాడు డైరెక్టర్‌. యాక్షన్‌ చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రం ఫుల్ మీల్స్.. అలా కాకుండా ఏదైనా కొత్తదనం ఉంటుందన్న ఆశతో వెళ్తే మాత్రం బ్రేక్ ఫాస్ట్ చేసిన ఫీలింగ్‌తో బయటికొస్తారు.ఎవరెలా చేశారంటే..యాక్షన్‌ హీరోగా పేరున్న అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఏకే స్టైల్లో మరోసారి అదరగొట్టారు. త్రిష తన పాత్రలో జీవించేసింది. సీనియర్‌ హీరోయిన్‌గా తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. టాలీవుడ్ నటుడు సునీల్, కోలీవుడ్ కమెడియన్ కింగ్‌స్లే, సిమ్రాన్, ప్రకాశ్ దేవ్, ప్రభు, ప్రసన్న, టినూ ఆనంద్, జాకీ ష్రాఫ్‌ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రతి నాయకుడిగా అర్జున్ దాస్‌ డిఫరెంట్ స్టైల్లో ఆకట్టుకున్నారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. అభినందన్‌ రామానుజం సినిమాటోగ్రఫీ బాగుంది. జీవీ ప్రకాశ్‌ బీజీఎం ఈ సినిమాకు అదనపు బలం. అలాగే నేపథ్య సంగీతం కూడా ఫర్వాలేదు. ఎడిటర్ విజయ్‌ వేల్‌కుట్టి కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement