రాబడిపై పన్ను సున్నా... | Deductions in New Tax Regime under Union Budget 2025 | Sakshi
Sakshi News home page

రాబడిపై పన్ను సున్నా...

Published Mon, Mar 31 2025 4:22 AM | Last Updated on Mon, Mar 31 2025 4:22 AM

Deductions in New Tax Regime under Union Budget 2025

అందుబాటులో పలు రకాల ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లు 

అధిక ఆదాయ వర్గాలకు ఎంతో ఆకర్షణీయం 

ప్రభుత్వరంగ సంస్థల జారీ 

అత్యుత్తమ రేటింగ్‌లు 

డిఫాల్ట్‌ దాదాపుగా ఉండదు 

పెట్టుబడుల్లో వైవిధ్యానికీ మెరుగైన ఎంపికే 

ఏడాదికోసారి రాబడి చెల్లింపులు

కొత్త బడ్జెట్‌లో ఆదాయపన్ను మినహాయింపు రాయితీలను గణనీయంగా పెంచడంతో మధ్యతరగతికి పెద్ద ఊరట లభించింది. వేతన జీవులకు స్టాండర్డ్‌ డిడక్షన్‌తో కలుపుకుని రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల ఆదాయం ఉన్నా కానీ కొత్త విధానంలో రూపాయి పన్ను లేకుండా చేశారు ఆర్థిక మంత్రి. ఇప్పటికీ అధిక ఆదాయ పరిధిలో ఉండి, పన్ను ఆదా పెట్టుబడుల కోసం అన్వేషించే వారికి మెరుగైన మార్గం ఒకటి ఉంది. పన్ను ఆదా చేసే ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడమే. వీటి నుంచి వచ్చే రాబడిపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఇందులో ఉండే ప్రయోజనాలు, ఎలా ఇన్వెస్ట్‌ చేయాలి? తదితర వివరాలతో కూడిన కథనమే ఇది... 
 

బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీలు), చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులపై వచ్చే రాబడికి ఎలాంటి పన్ను ఆదా ప్రయోజనం లేదు. దీంతో రూ.12 లక్షలకు పైన ఆదాయం ఉన్న వారికి పన్ను ప్రయోజనం పరంగా ఇలాంటివి మెరుగైన సాధనాలు కాబోవు. ఎందుకంటే వీటిపై వచ్చే రాబడి పన్ను చెల్లింపుదారు వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దాంతో చెల్లించాల్సిన పన్ను భారం పెరిగిపోతుంది. ఫలితంగా నికర ఆదాయం రూ.12.75 లక్షలకు మించిపోవచ్చు. దీనివల్ల పన్ను ఆదా రాయితీని కోల్పోవాల్సి వస్తుంది. 

కనుక అధిక ఆదాయం పరిధిలో ఉన్న వారికి అందుబాటులో ఉన్న మెరుగైన సాధనం ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లే. ఎందుకంటే ఈ బాండ్లపై వచ్చే రాబడి ఇన్వెస్టర్‌ వార్షిక ఆదాయానికి కలవదు. దీంతో ఈ మేరకు ప్రయోజనం పొందొచ్చు. ముఖ్యంగా రూ.12 లక్షల స్థాయిలో ఆదాయం కలిగిన వృద్ధులు (సీనియర్‌ సిటిజన్లు/60 ఏళ్లు నిండిన వారు) తమ రిటైర్మెంట్‌ నిధిలో కొంత మొత్తాన్ని ఈ ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం మెరుగైన నిర్ణయమే అవుతుంది. తద్వారా వారి పన్ను వర్తించే ఆదాయం రూ.12 లక్షలకు మించకుండా చూసుకోవచ్చు.  

పలు సంస్థల నుంచి బాండ్లు.. 
గతంలో పలు ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో క్యాష్‌ విభాగంలో ట్రేడ్‌ అవుతున్నాయి. వీటిల్లో కొన్నింటిలో మెరుగైన లిక్విడిటీ (కొనుగోళ్లు, అమ్మకాల పరిమాణం)ని గమనించొచ్చు. ఇంకా 11 ఏళ్ల కాల వ్యవధితో బాండ్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం వీటిల్లో పన్ను రహిత రాబడి రేట్లు 5.5–5.9 శాతం మధ్య ఉన్నాయి. 

పెట్టుబడికి రక్షణ, అదే సమయంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇవి మెరుగైన ఆప్షన్‌ అని విశ్లేషకులు చెబుతున్నారు. 2012 నుంచి 2016 మధ్య కాలంలో 14 ప్రభుత్వరంగ ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌హెచ్‌ఏఐ, ఐఆర్‌ఎఫ్‌సీ, పీఎఫ్‌సీ తదితర) సెక్యూర్డ్‌ (రక్షణతో కూడిన) ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లను జారీ చేశాయి. వీటి కాల వ్యవధి 10, 15, 20 ఏళ్ల చొప్పున ఉంది. ఈ బాండ్లలో పెట్టుబడులపై రాబడి చెల్లింపులు ఏడాదికోసారి చేస్తారు. వీటికి అధిక భద్రతను సూచించే ‘ఏఏఏ’ రేటింగ్‌ను క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు ఇచ్చాయి.  

గతంలో జారీ చేసిన అన్ని ట్యాక్స్‌ ఫ్రీ బాండ్ల సిరీస్‌లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్ట్‌ అయి ఉన్నాయి. ఇప్పటి వరకు 193 ఇష్యూలు రాగా, అందులో 57 బాండ్ల మెచ్యూరిటీ (కాలవ్యవధి) ముగిసిపోయింది. మిగిలిన ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. వీటి మెచ్యూరిటీ సగటున 11 ఏళ్ల వరకు ఉంది. ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ఈ బాండ్లలో రిస్క్‌ చాలా చాలా తక్కువ. ఒక విధంగా ఉండదనే చెప్పుకోవాలి. దీనికితోడు పన్ను ప్రయోజనం కూడా ఉండడం అదనపు ఆకర్షణ.  

తక్కువ ఆదాయం ఉన్న వారికి..? 
ఆదాయపన్ను పరిధిలో లేకుండా.. ఆదాయం తక్కువగా ఉన్న వారు ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ‘ఏఏఏ’ రేటెడ్‌ కార్పొరేట్‌ బాండ్లలో రిస్క్‌ కొంత తక్కువగా ఉంటుంది. వీటిల్లో ఈల్డ్స్‌ 7.4 శాతం మేర ఉన్నాయి. అలాగే, వృద్ధులకు బ్యాంక్‌ ఎఫ్‌డీలపై 8 శాతం వరకు వడ్డీ రేటు ప్రస్తుతం లభిస్తోంది. కానీ, కార్పొరేట్‌ బాండ్లు, బ్యాంక్‌ ఎఫ్‌డీలపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. 

మెచ్యూరిటీతో సంబంధం లేకుండా ఆయా పెట్టుబడులపై ఏటా వచ్చే రాబడిని ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఆదాయపన్ను శ్లాబు రేటులో ఉన్న వారికి పన్ను చెల్లింపులు పోగా మిగులు నికర రాబడి 4.6–5.1 శాతం మించదు. అయితే, తక్కువ ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారు, పన్ను వర్తించేంత ఆదాయం లేని వారికి.. కార్పొరేట్‌ బాండ్లు, బ్యాంక్‌ ఎఫ్‌డీలు తదితర సాధనాలను పరిశీలించొచ్చు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే వడ్డీ రాబడి కలిసిన తర్వాత కూడా వారి ఆదాయం పన్ను పరిధిలోకి రాదు.  

ఎంపిక ఎలా..? 
ఈ బాండ్ల ఎంపిక అంత కష్టమైన విషయం కాదు. ముఖ్యంగా చూడాల్సింది లిక్విడిటీయే. అంటే ఆయా బాండ్లు రోజువారీగా ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్‌ అవ్వడంతోపాటు, తగినంత ట్రేడింగ్‌ వ్యాల్యూమ్‌ కూడా ఉండాలి. దీనివల్ల కొనుగోలు, విక్రయం సులభంగా మారుతుంది. ఆ తర్వాత చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం బాండ్‌ ఈల్డ్స్‌ టు మెచ్యూరిటీ (వైటీఎం). అంటే ఆయా బాండ్‌పై మిగిలి ఉన్న కాలానికి ఎంత రాబడి వస్తుందో ఇది తెలియజేస్తుంది. అధిక లిక్విడిటీ ఉన్న బాండ్‌ను మెరుగైన ధరపై కొనుగోలు చేసుకోవచ్చు. 

అదే లిక్విడిటీ తగినంత లేని చోట (అమ్మకాలకు ఎక్కువ మంది లేనప్పుడు) బాండ్‌ కొనుగోలు వ్యయం పెరిగిపోతుంది. దీనివల్ల ఈల్డ్‌ తగ్గిపోతుంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ డేటా ప్రకారం ప్రస్తుతం స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడ్‌ అవుతున్న వాటిల్లో 20 బాండ్లలో మెరుగైన లిక్విడిటీ ఉంటోంది. ఉదాహరణకు ‘ఆర్‌ఈసీ బాండ్‌ ‘871ఆర్‌ఈసీ28’ను 2014లో 8.71 శాతం వార్షిక రేటుపై జారీ చేయగా.. గత నెలరోజులుగా రోజువారీ ట్రేడింగ్‌ వ్యాల్యూమ్‌ ఇందులో 1,534గా ఉంటోంది. ఈ బాండ్‌లో ఇటీవలి వైటీఎం 5.9 శాతంగా ఉంది.  

ఇది అనుకూల తరుణం.. 
ఆర్‌బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం తగ్గించింది. రానున్న రోజుల్లో మరో 50 బేసిస్‌ పాయింట్ల వరకు (0.50 శాతం) రేట్లు తగ్గుతాయని విశ్లేషకుల అంచనాగా ఉంది. ఇప్పటికీ దీర్ఘకాల డెట్‌ సాధనాలపై రాబడులు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనుక డెట్‌ సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ప్రస్తుతం అనుకూల సమయం. 

పన్ను లేకపోవడం, పెట్టుబడులపై గరిష్ట పరిమితి లేకపోవడంతో ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లు అధిక ఆదాయ వర్గాలకు మెరుగైన సాధనం అవుతుంది. పైగా ట్యాక్స్‌ ఫ్రీ బాండ్ల జారీ నిలిచిపోయింది. అంటే కొత్తగా బాండ్ల ఇష్యూలు రావడం లేదు. కనుక వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలంటే సెకండరీ మార్కెట్లో ట్రేడ్‌ అవుతున్న వాటి నుంచే ఎంపిక చేసుకోవాలి. ఇన్వెస్టర్లు ఇక్కడి నుంచి ఎంత కాలానికి పెట్టుబడులు పెట్టుకోవాలని అనుకుంటున్నారో.. అంత కాలంలో మెచ్యూరిటీ తీరిపోయే ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది.  

రిటర్నులు ఆకర్షణీయం 
సెకండరీ మార్కెట్లో ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారు మార్కెట్‌ రేటు కంటే ప్రధానంగా ఈల్డ్స్‌ టు మెచ్యూరిటీ (వైటీఎం)పైనే దృష్టి సారించాలి. ఇన్వెస్టర్‌ ఒక బాండ్‌ను కొనుగోలు చేసిన దగ్గర్నుంచి, అది మెచ్యూరిటీ అయ్యే వరకు ఏటా వచ్చే రాబడిని వైటీఎం సూచిస్తుంది. 15 ట్యాక్స్‌ ఫ్రీ బాండ్ల సిరీసీస్‌లలో ప్రస్తుతం వైటీఎం 5.5 శాతం నుంచి 5.9 శాతం మధ్య ఉంది.  

ఇవి గమనించాలి.. 
→ 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉన్న వారికి 6 శాతం పన్ను రహిత రాబడి నిజంగా ఎంతో మెరుగైనది. పన్ను ప్రయోజనం కూడా కలుపుకుంటే 8.5 శాతం రాబడి వచి్చనట్టు. 
→ 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి సైతం 7.5 శాతం రాబడి వచి్చనట్టు అవుతుంది. 
→ 10 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి దక్కే ప్రయోజనం తక్కువే.  
→ కార్పొరేట్‌ బాండ్లతో పోల్చితే ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లు అధిక రేటింగ్‌ కలిగినవి. ఈ బాండ్లను జారీ చేసేవి ప్రభుత్వరంగ సంస్థలే కనుక డిఫాల్ట్‌ దాదాపుగా ఉండదు.  
→ ఇన్వెస్టర్‌ తనకు వీలైనంత ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్ట పరిమితి ఉండదు.  
→ స్వల్పకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు వీటిని ఎంపిక చేసుకోవడం సరికాదు. 
→ వీటిల్లో ఒక్కోసారి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కనుక కాల వ్యవధి ముగిసేంత వరకు కొనసాగే వెసులుబాటు ఉన్న వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. 
→ కేవలం పన్ను ప్రయోజనం కోసమే వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదు. రిస్క్‌ తీసుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇంతకంటే ఎక్కువ రాబడినే (పన్ను పోను) ఇస్తాయి. పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడుల వైవిధ్యం కోసం డెట్‌ విభాగం కింద ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవచ్చు.  
→ అధిక లిక్విడిటీ, మెరుగైన వైటీఎం ఉన్న వాటికే పరిమితం కావాలి.

  
–సాక్షి, బిజినెస్‌డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement