
తయారీ, ఎగుమతుల హబ్‌గా భారత్ ఎదగొచ్చు
ఎంఏఐటీ అంచనాలు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌లతో భారత ఎగుమతులకు సవాళ్లు ఉన్నప్పటికీ, పోటీ దేశాలపై మరింత అధిక స్థాయిలో సుంకాలు విధించడం వల్ల, మన వ్యాపారాన్ని పెంచుకునేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ హార్డ్‌వేర్ సంస్థల సమాఖ్య ఎంఏఐటీ తెలిపింది. భారత్‌తో పోలిస్తే చైనా, వియత్నాంలపై భారీగా సుంకాలు విధించడమనేది మన ఎగుమతులకు సానుకూలాంశమని వివరించింది.
‘భౌగోళిక, రాజకీయ రిస్కులను అధిగమించేందుకు గ్లోబల్ కంపెనీలు తమ తయారీ కార్యకలాపాలను భారత్‌కు మళ్లించే అవకాశం ఉంది. దీంతో మన ఎగుమతులు మరింత పెరగవచ్చు. పోటీ దేశాలతో వ్యాపారం భారీ వ్యయాలతో కూడుకున్నది కావడంతో అంతర్జాతీయంగా కొనుగోలుదారులు భారత ఎగుమతులవైపు మొగ్గు చూపవచ్చు.
గ్లోబల్ బ్రాండ్లు తమ తయారీ కేంద్రాలను ఇతర దేశాలకు మళ్లించడంపై దృష్టి పెడతాయి కనుక సరఫరా వ్యవస్థకు సంబంధించి భారత్‌కు మరిన్ని అవకాశాలు లభించవచ్చు‘ అని ఎంఏఐటీ పేర్కొంది. భారత్‌పై 27 శాతం సుంకాలు ప్రకటించిన అమెరికా, మనకు పోటీ దేశాలైన చైనాపై 54 శాతం, వియత్నాంపై 46 శాతం, థాయ్‌లాండ్‌పై 36 శాతం విధించింది. దీనితో ఎల్రక్టానిక్స్, టెలికాం పరికరాలు, ఐటీ హార్డ్‌వేర్ విషయంలో ఆయా దేశాలు మనతో పోటీపడే పరిస్థితి తగ్గుతుందని, మన ఎగుమతులకు డిమాండ్ మెరుగుపడవచ్చని ఎంఏఐటీ తెలిపింది. అమెరికాకు భారత్ సుమారు 7 బిలియన్ డాలర్ల స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేస్తోంది. టారిఫ్‌ల వల్ల వీటిపై ప్రభావం పడనుంది.
స్థిరమైన పాలసీలు కావాలి..
పోటీ దేశాలపై టారిఫ్‌లను మనకు అనుకూలంగా మల్చుకోవాలంటే వ్యాపారాల నిర్వహణ సులభతరం చేయడానికి మరింత ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుందని ఎంఏఐటీ తెలిపింది. అలాగే పాలసీలపరంగా స్థిరత్వం ఉండేలా చూడాలని, లాజిస్టిక్స్.. ఇన్‌ఫ్రాపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఇవన్నీ చేయగలిగితే రాబోయే రోజుల్లో ప్రపంచానికి తయారీ, ఎగుమతుల హబ్‌గా భారత్ ఎదగవచ్చని వివరించింది.
2021–22 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది. మొత్తం భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు 18 శాతం, దిగుమతుల్లో 6.22 శాతం, ద్వైపాక్షిక వాణిజ్యంలో 10.73 శాతంగా ఉంది. అమెరికాతో మనకు వాణిజ్య మిగులు 2019–20లో 17.26 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2023–24లో ఇది 35.32 బిలియన్ డాలర్లకు చేరింది. ఎలక్ట్రానిక్స్ విషయానికొస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 10 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 3.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.