
ఆధునిక కాలంలో మనిషి అంతరిక్షాన్ని అందుకోగలిగాడు; చంద్రమండలం మీద అడుగు మోప గలిగాడు; సహజ మేధకు పోటీగా కృత్రిమ మేధను సృష్టించాడు; విశ్వామిత్ర సృష్టిని తలపించేలా మనుషులకు దీటైన మరమనుషులను సృష్టించాడు. ఇంతటి మహత్తర ఘనతలను చూసినప్పుడల్లా ‘మానవుడే మహనీయుడు/ శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు... జీవకోటి సర్వములో శ్రేష్ఠతముడు మానవుడే!’ అనుకుంటూ గర్వంతో ఉప్పొంగిపోతాం.
రేపో మాపో అంగారక గ్రహం మీద ఆవాసాలను ఏర్పాటు చేసే దిశగా మనుషులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుసుకున్నప్పుడు ఉత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతాం. మనిషి సాధించిన ఘన విజయాలను ఏకరువు పెట్టాలంటే, ఎన్ని గ్రంథాలైనా చాలవు.
చరిత్రలో ఇన్ని ఘన విజయాలు సాధించిన మనిషికి అనాది పరాజయాలు కూడా ఉన్నాయి. ఆధునికత సంతరించుకుని, అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్న మనిషి–అమరత్వాన్ని సాధించే దిశగా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అయితే, ఆకలి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని నేటికీ కనుక్కోలేకపోవడం మాత్రం ముమ్మాటికీ మనిషి వైఫల్యమే! యుద్ధాలలో ఉపయోగించ డానికి అధునాతన ఆయుధాలను ఎప్పటికప్పుడు తయారు చేయగలుగుతున్న మనిషి – అసలు యుద్ధాల అవసరమే లేని శాంతియుత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవడం కూడా వైఫల్యమే!
ప్రపంచంలో మనిషికి క్షుద్బాధను మించిన దుర్భర బాధ మరొకటేదీ లేదు. పురాణ సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు ఆకలి ప్రస్తావన మనకు విరివిగా కనిపిస్తుంది. తాను ఆకలితో అలమటిస్తున్నా, అతిథికి అన్నం పెట్టి పుణ్యలోకాలకు వెళ్లిన రంతిదేవుడి కథ తెలిసినదే! ఆకలికి తాళలేక కుక్కమాంసం తిన్న విశ్వామిత్రుడి కథ పురాణ విదితమే! ఆకలి బాధ మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది.
అందుకు విశ్వామిత్రుడి కథే ఉదాహరణ. పురాణాల్లో అక్షయపాత్రలు పుణ్యాత్ముల ఆకలి తీర్చిన గాథలు ఉన్నాయే గాని, సామాన్యుల ఆకలి తీర్చిన ఉదంతాలు లేవు. ఆకలితో అలమ టిస్తున్నా, త్యాగం చేయడం గొప్ప సుగుణమని చెప్పే పురాణాలు – ఆకలికి శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చెప్పలేదు.
ఆధునిక సాహిత్యంలో ఆకలి ప్రస్తావనకు కరవు లేదు. స్వాతంత్య్రోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అని ఎలుగెత్తిన గరిమెళ్ల – ఆ పాటలోనే ‘పన్నెండు దేశాలు పండుతున్నాగాని/ పట్టెడన్నమె లోపమండీ/ ఉప్పు పట్టుకుంటే దోషమండీ/ నోట మట్టి కొట్టుకుపోతామండీ/ అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండీ’ అంటారు. స్వాతంత్య్రం రాక ముందు మన దేశంలోని ఆకలి బాధలు అలా ఉండేవి.
ప్రపంచమంతా ఆర్థికమాంద్యంతో అతలా కుతలమైన హంగ్రీ థర్టీస్ కాలంలో కలాలతో కవాతు చేసిన కవులందరూ ఆకలి కేకలు వినిపించిన వారే! ‘ఆకలి ఆకలి తెరిచిన/ రౌరవ నరకపు వాకిలి/ హృదయపు మెత్తని చోటుల గీరే జంతువు ఆకలి/... ఈ ఆకలి హోరు ముందు/ పిడుగైనా వినిపించదు/ ఆకలి కమ్మిన కళ్లకు/ ప్రపంచమే కనిపించదు’ అన్న బైరాగి ‘ఆకలి’ కవిత పాఠకులను విచలితులను చేస్తుంది. ‘అన్నపూర్ణ గర్భగుడిని/ ఆకలి గంటలు మ్రోగెను/ ఆరని ఆకలి కీలలు/ భైరవ నాట్యము చేసెను/ ఘోర పరాజ యమా ఇది?/ మానవ మారణ హోమం/ తల్లీ! ఆకలి... ఆకలి!’ అంటూ సోమసుందర్ ఆకలి కేకలు వినిపించారు.
‘నేను ఆకలితో ఉన్నాను/ నువ్వు చంద్రుడి వద్దకు వెళ్లావు... నేను తిండిలేక నీరసిస్తున్నాను/ నాకు వాగ్దానాలు మేపుతున్నావు’ అంటూ ఆధునిక శాస్త్ర సాంకేతిక పురోగతి ఒకవైపు, ఆకలి బాధలు మరోవైపుగా ఉన్న ఈ లోకంలో పాలకుల తీరును శ్రీశ్రీ ఎత్తిపొడుస్తారు. ఇప్పటికీ లోకం తీరు పెద్దగా మారలేదు. మానవుడు పంపిన ఉపగ్రహాలు అంగారకుడి వద్దకు వెళ్లినా, ఆకలి బాధలు సమసి పోలేదు; ఆకలి చావులు ఆగిపోలేదు.
మనిషి ఘన విజయాల చరిత్రలో ఆకలి, అశాంతి– రెండూ మాయని మరకలు. ఈ రెండు మరకలూ పూర్తిగా చెరిగిపోయేంత వరకు మనిషి ఎన్ని విజయాలు సాధించినా, అవేవీ మానవాళికి ఊరటనూ ఇవ్వలేవు; మానవాళిని ఏమాత్రం ఉద్ధరించనూ లేవు. ఆకలికి, అశాంతికి మూలం మను షుల్లోని అసమానతలే! ప్రపంచంలో అసమానతలు తొలగిపోనంత వరకు ఆకలిని రూపుమాపడం, శాంతిని నెలకొల్పడం అసాధ్యం.
నిజానికి సంకల్పం ఉంటే, సాధ్యం కానిదంటూ ఏదీ లేదు గాని, అసమానతలను రూపుమాపే సంకల్పమే ఏ దేశంలోనూ పాలకులకు లేదు. అందువల్లనే ఆకలి, అశాంతి మనుషులను తరతరాలుగా పట్టి పీడిస్తున్నాయి. అకాల మరణాలకు కారణమవుతున్నాయి.
ఆకలి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు పాతికవేల నిండు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. అంటే, ఏడాదికి సగటున ఏకంగా తొంభై లక్షల మంది ఆకలికి బలైపోతున్నారు. ఆకలితో మరణిస్తున్న వాళ్లలో పసిపిల్లలు కూడా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న శిశుమరణాల్లో దాదాపు యాభై శాతం ఆకలి చావులే! నాణేనికి ఇదొకవైపు అయితే, మరోవైపు వంద కోట్లమందికి ఆకలి తీర్చడానికి తగినంత ఆహారం ప్రతిరోజూ వృథా అవుతోంది.
ఈ పరిస్థితిని గమనించే ‘అన్నపు రాసులు ఒకచోట/ ఆకలి మంటలు ఒకచోట’ అని కాళోజీ వాపోయారు.ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఐదో స్థానంలో ఉన్న మన దేశం– ఆకలి సూచిలో నూట ఐదో స్థానంలో ఉండటం ఒక కఠోర వాస్తవం. అమృతోత్సవ భారతంలో ఆకలి సమస్య ఒక మానని గాయం!