
డాక్టర్ గారూ నేను గత ఏడెనిమిది ఏళ్లుగా డిప్రెషన్‌లో ఉన్నాను. ఎందుకో కారణం తెలియదు. దానివల్ల నా స్టడీస్ కూడా దెబ్బతిన్నాయి. అయినా మా అమ్మానాన్న కోసమైనా బతకాలనుకుని ఇంతవరకు ఉన్నాను. కానీ మళ్లీ ఒక సంవత్సరం నుంచి భయంకరమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. నా మైండ్‌లో రోజూ విచిత్రమైన ఆలోచనలు నిరంతరం వస్తూ నన్ను బాధపెడుతున్నాయి. ఈ చెట్లు ఎలా వచ్చాయి? భూమ్మీదకు మనుషులు ఎలా వచ్చారు? గాలిని చూడగలమా? ఆత్మలు ఉన్నాయా? నీళ్లు ఎందుకు తాగాలి, అన్నం ఎందుకు తినాలి... ఇలాంటి విచిత్రమైన ఆలోచనలు వచ్చి నరకయాతను అనుభవిస్తున్నాను. ఇవన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి, ఇలా రాకూడదని నేనెంత ప్రయత్నం చేసినా అవి ఆగడం లేదు. మాది చాలా బీదకుటుంబం. నన్ను ఎలాగైనా ఇందులోంచి బయట పడేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. - విక్రం, పులివెందుల
మీ మెయిల్ చదివాను. మీరు ఎన్నో అనవసరమైన ఆలోచనలతో సతమతం అవుతూ, వాటినుంచి బయట పడలేక మనోవేదనకు గురవుతున్నట్లు అర్థం అయింది. మీకున్న లక్షణాలను ఎగ్జిస్టెన్షియల్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. ఈ సమస్యతో బాధపడేవారిలో ఎక్కువగా ఫిలసాఫికల్ డౌట్స్ వస్తాయి. భూమి గుంఢ్రంగా ఎందుకు ఉంది, మనుషులు ఎలా పుట్టారు, సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయించాలి.. లాంటి తాత్వికమైన ప్రశ్నలు వస్తాయి. అయితే సాధారణంగా అందరిలో ఏదో ఒక సమయంలో ఇలాంటి సందేహాలు అప్పుడప్పుడు తలెత్తినా కొంతసేపు ఉండి తగ్గిపోతాయి. మీ విషయంలో మీకు ఇవి ఇష్టం లేకున్నా మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేలా వస్తున్నాయి. వాటికి సమాధానాలు వెతకలేక మీరు తీవ్రమైన మానసిక క్షోభకు, డిప్రెషన్‌కూ గురవుతున్నారు. దీనికి మంచి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి.
మంచి మందులతోపాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా మీ జబ్బు లక్షణాలను పూర్తిగా తగ్గించవచ్చు. మీరు మీ ఉత్తరంలో చికిత్స తీసుకుంటున్నారో లేదో తెలపలేదు. ఒకవేళ మీరు చికిత్సలో లేనట్లయితే మీకు దగ్గరలో కడప ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మానసిక వైద్యుణ్ణి సంప్రదిస్తే మందులు, కౌన్సెలింగ్‌తో తగ్గిస్తారు. క్రమం తప్పకుండా మందులు వాడి కౌన్సెలింగ్ తీసుకున్నట్లయితే మీ సమస్య వీలైనంత తొందరలో తగ్గి΄ోతుంది. ఒకవేళ మీరు ట్రీట్‌మెంట్ తీసుకున్నా, సమస్య తగ్గకుంటే మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వస్తే మీకు తగిన చికిత్స చేసి, మీ సమస్య నుంచి పూర్తిగా బయట పడేలా చేయగలం. మీ ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్న కారణంగా చికిత్స ఆపవద్దు. మీ పరిస్థితిని బట్టి మీకు అవసరమైన సహాయం చేసి, చికిత్స చేయగలం. వెంటనే మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లండి. అన్నీ మంచిగా జరుగుతాయి. ఆల్ ది బెస్ట్.
చదవండి: చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలు
కంటెంట్ క్వీన్స్ మ్యాజిక్ : ‘యూట్యూబ్ విలేజ్’ వైరల్ స్టోరీ
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com