‘స్వింగ్‌’ ఓటరే కింగ్‌ మేకర్‌! | Sakshi Guest Column On BJP, Congress, Aam Aadmi Party | Sakshi
Sakshi News home page

‘స్వింగ్‌’ ఓటరే కింగ్‌ మేకర్‌!

Published Sun, Jan 19 2025 12:36 AM | Last Updated on Sun, Jan 19 2025 12:36 AM

Sakshi Guest Column On BJP, Congress, Aam Aadmi Party

విశ్లేషణ

హస్తిన ఓటర్లు వైవిధ్యమైన తీర్పు ఇస్తుండడంతో లోక్‌సభ, శాసనసభ ఎన్ని కల్లో పూర్తి భిన్నమైన ఫలితాలు వస్తు న్నాయి. ‘మినీ ఇండియా’గా పిలవబడే దేశ రాజధాని ఢిల్లీలో అన్ని వర్గాలు ఎంతో విజ్ఞతతో స్థానిక అంశాల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికను, జాతీయ అంశాల ఆధారంగా పార్లమెంట్‌ ఎన్నికలను శాసి స్తున్నారు. 

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), పార్లమెంట్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధిపత్యం కొనసాగిస్తున్న వేళ... ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండనుందో ‘పీపుల్స్‌ పల్స్‌’ అధ్యయనం చేయగా దాదాపు 30 శాతం మంది ఓటర్లు ఆయా ఎన్నికల్లో భిన్నంగా స్పందిస్తుండడంతో ఈ స్వింగ్‌ ఓటర్లే రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారనున్నారని తేలింది.

ఢిల్లీలో 2013 అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ మార్పులకు తెరలేపాయి. అప్పుడు మొదటిసారిగా బరిలోకి దిగిన ఆప్‌ ఊహించని విధంగా 30 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు సవాలు విసిరింది. అప్పటికే మూడు పర్యా యాలు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో 33 శాతం ఓట్లతో పెద్ద పార్టీగా నిలిచినా  అధికారం చేపట్టలేకపోయింది. వరుసగా మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ 25 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యింది. 

2013 అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీకి 4 స్థానాలు తక్కువగా పొంది 32 స్థానాలకు పరిమితమై అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో 46 శాతం ఓట్లతో మొత్తం 7 ఎంపీ స్థానాల్లో గెలిచింది. ఆప్‌ అసెంబ్లీ ఎన్నికల కంటే 3 శాతం అధికంగా 36 శాతం ఓట్లు పొందినా ఒక్క స్థానం కూడా సాధించ లేదు. కాంగ్రెస్‌ 15 శాతం ఓట్లే పొందింది. 

2015 అసెంబ్లీ ఎన్ని కలతో పోలిస్తే 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆప్‌ భారీగా 36 శాతం ఓట్లు కోల్పోగా, బీజేపీ 25 శాతం, కాంగ్రెస్‌ 13 శాతం ఓట్లు అధికంగా పొందాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తిరిగి 7 స్థానాల్లో గెలిచింది. 2020 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నుండి చెరో 18 శాతం ఓట్లు చీల్చిన ఆప్‌ 2019లో తాను కోల్పో యిన 36 శాతం ఓట్లను తిరిగి పొంది అధికారం చేపట్టింది. 

2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆప్‌  30 శాతం ఓట్లను నష్టపోగా, బీజేపీ 16 శాతం ఓట్లు ఎక్కువ సాధించి మళ్లీ మొత్తం 7 స్థానాలనూ గెల్చుకుంది. ఒక్క ఎంపీ సీటూ రాకపోయినా కాంగ్రెస్‌ 15 శాతం ఓట్లు అధికంగా పొందింది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో భిన్నంగా స్పంది స్తున్న దాదాపు 30 శాతం మంది ఢిల్లీ ఓటర్లే ఆప్‌కు కీలకంగా మారుతున్నారు. 

గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అగ్రవర్ణ ఓటర్ల గణాంకాలను అధ్యయనం చేస్తే... 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో 75 శాతం వీరి మద్దతు పొందిన బీజేపీ 2020 ఎన్నికల్లో 54 శాతానికి పరిమితం అయ్యింది.  కాంగ్రెస్‌కు 2019లో అగ్రవర్ణాల మద్దతు 12 శాతం లభించగా, 2020లో అది 3 శాతానికి పడిపోయింది. మరోవైపు ఆప్‌కు 2019లో 13 శాతమే మద్దతివ్వగా, 2020లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి 41 శాతం మద్దతిచ్చారు.

ఓబీసీ ఓటర్ల తీర్పును పరిశీలిస్తే... 2019లో బీజేపీకి 64 శాతం మంది మద్దతివ్వగా 2020 ఎన్నికలు వచ్చేసరికి అది 50 శాతానికి పడిపోయింది. 2019లో 18 శాతం మంది ఓబీసీలు కాంగ్రెస్‌కు మద్దతివ్వగా 2020లో 16 శాతమే మద్దతిచ్చారు. ఆప్‌కు 2019లో ఓబీసీల మద్దతు 18 శాతమే లభించగా, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 49 శాతం మద్దతు సంపాదించగలిగింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ 29 శాతం ఓబీసీ ఓట్లు కోల్పోయింది.

దళిత ఓటర్లు 2019 లోక్‌సభ ఎన్నికల్లో 44 శాతం బీజేపీకి మద్దతివ్వగా 2020 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి 25 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌ 2019లో 20 శాతం ఓట్లు పొందగా, 2020లో 6 శాతానికి పరిమితమైంది. 2019లో 22 శాతం దళితుల మద్దతు పొందిన ఆప్‌ 2020లో ఏకంగా 69 శాతం దళితుల మద్దతు పొందింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ 41 శాతం దళితుల ఓట్లను కోల్పోయింది.  

ముస్లిం ఓటర్ల గణాంకాలను పరిశీలిస్తే... 2019 లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింల మద్దతు బీజేపీకి 7 శాతం, ఉండగా, 2020 అసెంబ్లీ ఎన్నికల నాటికి అది 3 శాతానికి దిగజారింది. కాంగ్రెస్‌కు 2019 ఎన్నికల్లో 66 శాతం ముస్లింలు మద్దతివ్వగా, 2020 నాటికి అది 13 శాతానికి పరిమితమైంది. ఆప్‌కు 2019లో 28 శాతం ముస్లింలు మద్దతివ్వగా, 2020 నాటికి భారీగా 83 శాతం ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. 

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ 34 శాతం ముస్లింల మద్దతు కోల్పోగా, అవి 11 శాతం బీజేపీకి, 21 శాతం కాంగ్రెస్‌కు బదిలీ అయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఆప్, కాంగ్రెస్‌ ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తుండడంతో త్రిముఖ పోటీలో ప్రధానంగా ముస్లిం, దళిత ఓట్ల చీలికతో ఆప్‌కు నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 

2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆప్‌ 2024 లోక్‌సభ ఎన్నికల్లో  ఆర్థిక, సామాజిక వర్గాలవారీగా ఓట్లను పరిశీలిస్తే... పేదల్లో 37 శాతం ఓటర్ల మద్దతును ఆప్‌ కోల్పోగా, వారిలో 19 శాతం బీజేపీకి, 17 శాతం కాంగ్రెస్‌ వైపు మళ్లారు. మధ్యతరగతి కుటుంబాల ఓటర్ల లెక్కలను గమనిస్తే ఆప్‌ 21 శాతం మద్దతు కోల్పోగా, అందులో బీజేపీకి 11 శాతం, కాంగ్రెస్‌కు 12 శాతం లభించింది.

రాజధాని ఢిల్లీలో పరిపాలన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండడంతో ఓటర్లు కూడా పరిణతితో కూడిన తీర్పు ఇస్తు న్నారు. ‘పీపుల్స్‌ పల్స్‌’ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించిన ప్పుడు ఢిల్లీకి కేజ్రీవాల్, భారత్‌కు మోదీ నాయకత్వం కావాలని బలంగా కోరుకుంటున్నట్టు కనిపించింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సర్వేలో ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎవరికి మద్దతిస్తారని’ ఓటర్లను ప్రశ్నించగా ఆప్‌కు 49 శాతం, బీజేపీకి 33 శాతం మంది ఆమోదం తెలపడంతో ఈ రెండు పార్టీల మధ్య అప్పుడే 16 శాతం వ్యత్యాసం కనిపించింది.  

అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు ఇప్పటి వరకు అనుకూలంగా ఉంటున్న 30 శాతం స్వింగ్‌ ఓట్లను బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 5 శాతం చీలిస్తే ఆప్‌ 44 శాతానికి పరిమితమవడంతో పాటు బీజేపీ 44 శాతానికి పెరిగి ఎన్నికలు పోటాపోటీగా జరుగుతాయి. గతంలో వలే బీజేపీ, కాంగ్రెస్‌ల నుండి చెరో 15 శాతం ఓటింగ్‌ను తమకు అనుకూలంగా మల్చుకుంటే హస్తిన మరోసారి ఆప్‌ హస్తగతమవుతుంది. ఆప్‌కు అగ్నిపరీక్షగా మారిన కీలకమైన 30 శాతం స్వింగ్‌ ఓట్లను ఎప్పటిలాగే తమ వైపుకు తిప్పుకోగలిగి తేనే మరోసారి ఆ పార్టీ అందలమెక్కుతుంది.

జి. మురళీ కృష్ణ 
వ్యాసకర్త పీపుల్స్‌ పల్స్‌ రిసెర్చ్‌ సంస్థలో సీనియర్‌ రిసెర్చర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement