
అభిప్రాయం
ఎంతో చారిత్రక నేపథ్యంతో పాటు బోధన, పరిశోధనల్లో దేశంలోనే పేరెన్నికగన్నది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ). ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఆ యూనివర్సిటీలో అలజడికి కారణమవ్వడం చర్చనీయాంశమయ్యింది. ‘ఆరు సూత్రాల పథకం’లో భాగంగా 2,300 ఎకరాల విస్తీర్ణంలో 1974లో ఈ విశ్వవిద్యాలయం ప్రారంభమయ్యింది.
ఈ కేంద్ర విశ్వవిద్యాలయం రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల విద్యార్థులకు వైవిధ్యమైన, ఉన్నతమైన విద్యా జీవితాన్ని అందిస్తున్నది. 2015లో ఉత్తమ కేంద్ర విశ్వవిద్యాలయంగా భారత రాష్ట్రపతి ‘విజిటర్స్’ అవార్డును సహితం పొందింది. 2020లో ‘ఇండియా టుడే’ ప్రకటించిన ర్యాంకింగ్‌లో దేశంలోని మొత్తం ఉత్తమ ప్రభుత్వ వర్సిటీలలో రెండో స్థానంలో నిలిచింది.
అకడమిక్ సంబంధిత అంశాల్లోనే కాకుండా సామాజిక మార్పు దిశగా దేశంలో జరుగుతున్న ప్రతి ప్రయత్నంతోనూ అనుబంధాన్ని కొనసాగిస్తూ, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వామిగా ఉంటూ, విశ్వవిద్యాలయానికి ఉండవలిసిన మానవీయ చలనశీల స్వాభా వికతను కూడా హెచ్‌సీయూ కాపాడుకుంటూనే ఉన్నది.
విద్యార్థులలో ప్రజల కోసం అమరులైన వీరస్వామి లాంటి వాళ్ళు, వివక్ష సమాజంపై సిరా దండోరా మోగించిన నాగప్పగారి సుందర్ రాజు లాంటి కీర్తిశేషులైన అధ్యాపకులు, అలాగే సమాజంతో మేధాపరమైన సంబంధాన్ని నిత్యం ఉనికి లోనే ఉంచుకొని వృత్తి జీవితాన్ని మరింత చైత న్యవంతంగా కొనసాగించిన రత్నం, హర గోపాల్ వంటి ఎందరో మేధావులకు చిరునామా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం.
జాతీయ, అంతర్జాతీయ అంశాలపై లోతైన అధ్యయనాలు, అర్థవంతమైన చర్చలు, ఆరోగ్యవంతమైన భావజాల సంఘర్షణలకు హెచ్‌సీయూ కేంద్రం. 2016లో జరిగిన రోహిత్ వేముల బాధాకర ఉదంతం, సెంట్రల్ వర్సిటీలలో కొన సాగుతున్న అవలక్షణాలను సహితం దేశ వ్యాప్తంగా చర్చకు పెట్టి పెద్ద పోరాటానికి దారితీసింది.
ఆ సందర్భంలోనే హెచ్‌సీయూ గేట్ ముందు రాహుల్ గాంధీ కూడా ధర్నాలో కూర్చొని విద్యావ్యవస్థలో వివక్షకు వ్యతిరేకంగా, పాలకుల వైఖరిని ఎండగడుతూ ప్రసంగించారు. రెండు సార్లు భిన్న సందర్భాల్లో హెచ్‌సీయూకు వచ్చిన రాహుల్ గాంధీకి ఈ వర్సిటీతో స్నేహ పూర్వక సంబంధమే కాదు... దానిపై సంపూ ర్ణమైన అవగాహనే ఉండి ఉంటుంది.
అలాంటి వర్సిటీలో సొంత పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అనా లోచితంగా, ఉగాది పండుగనాడు ప్రదర్శించిన పోలీస్ జులుం దేశవ్యాప్తంగా చర్చగా మారిన తర్వాత కూడా రాహుల్ కనీసం స్పందించక పోవడం బాధాకరం. విద్యార్థుల ఉద్యమానికి కుట్రకోణం ఆపాదించేందుకు అరెస్ట్ చేసిన ఇద్దరు విద్యార్థులను అసలు వారు వర్సిటీ విద్యా ర్థులే కాదని పోలీస్ అధికారితో ప్రకటింపజేసి... రిమాండ్ రిపోర్టులో మాత్రం వర్సిటీ విద్యార్థు లుగా పేర్కొని ప్రభుత్వం అభాసుపాలైంది.
వివాదానికి కారణంగా చెబుతున్న 400 ఎక రాలు సర్కార్‌వేనని హెచ్‌సీయూ అంగీకరించిందని అబద్ధాలు వల్లించింది రాష్ట్ర సర్కార్. తీరా అసలు రెవెన్యూ సిబ్బంది సర్వేనే నిర్వహించ లేదనీ, హద్దులే నిర్ణయించలేదనీ వర్సిటీ రిజిస్ట్రార్ అధికారికంగా ప్రకటించడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధం బట్టబయలైపోయింది.
అసలు 2004 ఎన్నికలకు ముందు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం చివరిరోజుల్లో అనుమానాస్పదంగా బిల్లీరావు అనే అతనికి చెందిన ‘ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు అప్పనంగా 400 ఎకరాల విలువైన ఈ భూమిని కేటాయించడమే అతి పెద్ద రాజ కీయ వివాదమైంది. క్రీడల అభివృద్ధి పేరిట జరిగిన భూ పందేరాన్ని 2006లో వైఎస్సార్ ప్రభుత్వం పరిశీలించి, పనులే ప్రారంభించని కారణంగా రద్దు చేసింది.
ఆనాటి చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల వైఎస్సార్ సర్కార్ రద్దు చేసినా, సుప్రీం కోర్ట్ దాకా తర్వాతి ప్రభుత్వాలు న్యాయపరమైన భూపోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అనాడు సర్కార్ దిగి పోయే ముందు అన్యాయమైన విధానంలో స్వాధీనం చేసుకొని, పందేరం చేసిన విలువైన వర్సిటీ భూములను తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ స్వాధీనం చేసుకొని, వేలం వేసేందుకు ఉవ్విళ్లూరుతుండటమే విద్యార్థిలోకానికి ఆవేదన కలిగిస్తున్నది. ఎడాపెడా వాగ్దానం చేసిన పథ కాల అమలుకు కావలసిన నిధుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూముల వేలానికి దిగజారడం అన్యాయం.
ఇప్పటికైనా హెచ్‌సీయూ విజ్ఞప్తిని సానుకూలంగా అర్థం చేసుకొని, భూములను దానికే అప్పగించాలి. చేసిన తప్పులకు దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే తగిన రాజకీయ మూల్యాన్ని కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోవలసి వస్తుంది.
డా‘‘ ఆంజనేయ గౌడ్
వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ‘ 98853 52242