భారత్‌ టార్గెట్‌గా చైనా నిఘా బెలూన్లు! | Chinese Spy Balloons Targeted India | Sakshi
Sakshi News home page

డ్రాగన్‌ దుష్ట పన్నాగం.. భారత్‌ టార్గెట్‌గా చైనా నిఘా బెలూన్లు!

Published Wed, Feb 8 2023 1:07 PM | Last Updated on Wed, Feb 8 2023 1:27 PM

Chinese Spy Balloons Targeted India - Sakshi

అగ్రరాజ్యాన్నే కాదు.. భారత్‌ను కూడా బెలూన్‌ ద్వారా కీలక సమాచారం.. 

వాషింగ్టన్‌: నిఘా బెలూన్లతో అగ్రరాజ్యాన్ని హడలెత్తించిన చైనా.. మరిన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుందనే సమాచారం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది. భారత్‌తో పాటు జపాన్‌, వియత్నాం, తైవాన్‌, ఫిలిప్పైన్స్‌.. ఇలా మరికొన్ని దేశాలపైనా సర్వేయిలెన్స్‌ బెలూన్‌లను ప్రయోగించిందని, ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని సేకరించే యత్నం చేసిందని కథనాలు వెలువడుతున్నాయి. 

ప్రముఖ వార్తా ప్రచురణ సంస్థ ది వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం ప్రకారం.. చైనా దక్షిణ తీరంలోని హైనాన్ ప్రావిన్స్‌ నుంచి నిఘా బెలూన్‌ల ప్రయత్నం కొనసాగిందని.. జపాన్, భారతదేశం, వియత్నాం, తైవాన్,  ఫిలిప్పీన్స్‌తో సహా పలు దేశాల సైనిక సమాచారాన్ని సేకరించే ప్రయత్నం జరిగిందని ఆ కథనం పేర్కొంది. ఇందుకు సంబంధించి పలువురు నిఘా అధికారులు, భద్రతా విభాగానికి చెందిన ప్రముఖుల నుంచి అభిప్రాయాలను సేకరించి.. ప్రచురించింది ఆ కథనం. ఈ పరిణామంపై భారత్‌ నుంచి స్పందన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనానికి కొనసాగింపుగా.. అమెరికా భద్రతా అధికారులు భారత్‌ సహా మిత్ర దేశాలను చైనా నిఘా బెలూన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు తాజాగా యుద్ధ విమానాల ద్వారా చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన విషయాన్ని..  అట్లాంటిక్‌ మహాసముద్రం నుంచి ఆ బెలూన్ల శకలాలను సేకరించిన విషయాన్ని సైతం మిత్ర దేశాలకు నివేదించింది అమెరికా. గత మూడురోజులుగా 40 మిత్ర దేశాలకు చెందిన భద్రతా ప్రతినిధులు, దౌత్యవేత్తలతో పెంటగాన్‌ అధికారులు ‘చైనా నిఘా బెలూన్ల వ్యవహారం’పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

సర్వేయలెన్స్‌ ఎయిర్‌షిప్స్‌గా భావిస్తున్న ఈ బెలూన్లు.. చైనా ఆర్మీ(పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ) ద్వారానే ప్రయోగించబడుతున్నాయని, ఐదు ఖండాల్లో వీటి ఉనికి గుర్తించినట్లు అమెరికా భద్రతా అధికారులు చెబుతున్నారు. ఇది ఇతర దేశాల సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించడేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చైనా మాత్రం అవి శాటిలైట్‌ సంబంధిత ఎయిర్‌షిప్స్‌ తప్ప.. నిఘాకు సంబంధించినవి కాదని వాదిస్తోంది. ఈ మేరకు బెలూన్‌ కూల్చివేతపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. అమెరికా మాత్రం ఈ ఘటనతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీయదనే ఆశాభావం వ్యక్తం చేశారు బైడెన్‌. అలాగే.. పేలిన శకలాలను ఎట్టి పరిస్థితుల్లో చైనాకు అప్పగించబోమని స్పష్టం చేశారు.

గత వారం రోజులుగా.. హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్‌, గువాం ప్రాంతాల్లో చైనా బెలూన్లు దర్శనమిచ్చాయి. ఇందులో మూడు ట్రంప్‌ హయాంలోనే గగనతలంలో విహరించేందుకు అనుమతులు లభించాయని.. అయితే అవి చైనా నిఘా బెలూన్లు అనే విషయం తాజాగానే వెల్లడైందని భద్రతా అధికారుల నివేదిక వివరిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement