
వాలీబాల్ పోటీల విజేత హైదరాబాద్
రెబ్బెన(ఆసిఫాబాద్): గోలేటి టౌన్‌షిప్‌లోని భీమన్న స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 36వ వేణుగోపాల్ మెమోరియల్ ఇన్విటేషనల్ వాలీబాల్ పోటీలు శనివారంతో ముగిశాయి. హైదరాబాద్ జట్టు విజేతగా బెల్లంపల్లి జట్టు రన్నరప్‌గా నిలిచాయి. నాకౌట్ కం లీగ్ పద్ధతిలో నిర్వహించిన సెమీ ఫైనల్, ఫైనల్ పోటీల్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. హైదరాబాద్ జట్టు అద్భుత ఆటతీరును ప్రదర్శించి విజయ కేతనం ఎగురవేసింది.
సింగరేణిలో క్రీడలకు పెద్దపీట
సింగరేణి యాజమాన్యం క్రీడలకు పెద్దపీట వేస్తోందని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. శనివారం భీమన్న స్టేడియంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో పని చేసిన ఓ ఉద్యోగి పేరుతో 36 సంవత్సరాలుగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడాకారుల్లో క్రమశిక్షణ, క్రీడాస్పూర్తి ఎంతో అవసరమన్నారు. పోటీల్లో గెలుపు ఓటములు సర్వ సాధారణమని, ఓటమిని కారణాలను విశ్లేషించుకుంటూ గెలుపు దిశగా క్రీడాకారులు పయనించాలన్నారు. అనంతరం విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.30 వేల నగదు, రన్నరప్‌గా నిలిచిన బెల్లంపల్లి జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 20 వేల నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహారా, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్ పర్సనల్ అధికారులు శ్రీనివాస్, ప్రశాంత్, ఆర్జీ–2 ఏరియా స్పోర్ట్స్ సూపర్‌వైజర్ నరేందర్‌రెడ్డి, బెల్లంపల్లి రీజియన్ స్పోర్ట్స్ సూపర్‌వైజర్ అశోక్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కిరణ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.