
విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జూన్ మొదటి వారంలోగా నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బధవారం కలెక్టరేట్‌లో డీఈవో ఎస్.యాదయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మే 20లోగా దుస్తులు సిద్ధం చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల ఎంబీ రికార్డులు సమర్పించాలని తెలిపారు. అనంతరం స్వయం సహాయ సంఘాల సభ్యులకు హైదరాబాద్‌లో అందించిన శిక్షణ ధ్రువపత్రాలు అందజేశారు.
అర్హులందరికీ రాజీవ్ యువవికాసం ఫలాలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం హాజీపూర్ ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాసం హెల్ప్‌డెస్క్‌ను సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకుని రాయితీ పొందాలని తెలిపారు. ముల్కల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల, జూనియర్ కళాశాల, కర్ణమామిడిలోని కేజీబీవీ సందర్శించి వంటశాల, తరగతి గదులు పరిశీలించారు. తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే, అధికారులు పాల్గొన్నారు.