
హెచ్‌సీయూ భూముల పరిరక్షణకు కృషి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి తెలిపారు. హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి వెళుతున్న ఎమ్మెల్సీని, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరిలను రామచంద్రాపురంలోని వారి నివాసంలో మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం హెచ్‌సీయూ భూములను అమ్మడం సరికాదన్నారు. ఆ భూములలో ఎంతో వన సంపదతోపాటు అనేక జీవరాశులు జీవిస్తున్నాయని వివరించారు. ఆ భూములను విక్రయించే బదులు మరింత పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ యూనివర్సిటీ పూర్వవిద్యార్థులైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబులు ముఖ్యమంత్రితో మాట్లాడి భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్‌సీయూ భూముల పరిక్షణకు ఉద్యమిస్తున్న విద్యార్థులకు అండగా నిలిచి పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.