
ఆకస్మిక తనిఖీలతో హడల్
మెదక్‌జోన్: ఆకస్మిక తనిఖీలతో కలెక్టర్ హడలెత్తిస్తున్నారు. రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి విధులకు ఎగనామం పెట్టే ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ముగ్గురిని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. తాజాగా శనివారం జిల్లా కేంద్రంలోని గోల్కొండ వీధి బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి తాళం వేసి ఉండటంతో సిబ్బంది పనితీరుపై స్థానికంగా ఆరా తీశారు. విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని తెలుసుకొని మెడికల్ ఆఫీసర్, స్టాఫ్‌నర్స్, సపోర్టింగ్ స్టాఫ్‌ను విధుల నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా గతేడాది మార్చిలో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌రాజ్ క్షేత్రస్థాయి పర్యటనలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాలలు, కళా శాలలు, కేజీబీవీలు, గురుకులాలు, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులతో పాటు మారుమూల గ్రామా ల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్ దవాఖానలను వరుసగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఆయా శాఖల సిబ్బంది, అధికారులు సక్రమంగా విధులకు హాజరవుతుండగా, కొంత మందిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఫలితంగా కలెక్టర్ ఆగ్రహానికి గురవుతున్నారు. ఉద్యో గులు పనిచేసే చోట ఉండాలని, ఎవరెవరు ఎక్కడ అద్దెకు ఉంటున్నారో పూర్తి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ జంట నగరాల నుంచి నిత్యం వచ్చిపోయే అధికారులు సైతం స్థానికంగా నివాసం ఉంటున్నారు. అంతే కాకుండా ప్రతి అధికారి క్షేత్రస్థాయి పర్యటన తప్పకుండా చేయాలని కూడా సూచించారు.
విధులకు ఎగనామం పెట్టే వారిపై
కలెక్టర్ రాహుల్‌రాజ్ వేటు
తాజాగా ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్