
గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'ఎల్2: ఎంపురాన్' (L2: Empuran Movie) పలు వివాదాలకు కారణమైంది. కొన్ని సీన్లు మత విద్వేషాలని రెచ్చగొట్టేలా ఉన్నాయని అభ్యంతరాలు రావడంతో సెన్సార్ మళ్లీ కత్తెరకు పనిచెప్పింది. దీంతో చాలా సన్నివేశాల్ని తొలగించారు. అయితే ఆ గొడవ ఇంకా చల్లారనట్లు కనిపిస్తోంది.
ఈ సినిమాని రిలీజ్ చేసిన నిర్మాత గోకులం గోపాలన్ ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరిగాయి. రూ.1000 కోట్ల మేర అక్రమ సంపాదన గుర్తించినట్లు వార్తలొస్తున్నాయి. ఇది నిజమా కాదా అని అనుకునేలోపే చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)కి షాక్ తగిలింది. 2022 నుంచి సినిమాల ద్వారా ఆర్జించిన మొత్తం గురించి లెక్కలు చెప్పాలని ఐటీ అధికారులు నోటీసులు పంపించారు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్)
కడువ, జనగణమన, గోల్డ్ సినిమాలకు సంబంధించి రెమ్యునరేషన్ సమాచారం అందించాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన పృథ‍్వీరాజ్.. ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. కానీ కో ప్రొడ్యూసర్ గా రూ.40 కోట్ల మేర ఆర్జించనట్లు తెలుస్తోంది.
ఇదంతా కూడా చాలా సాధారణమైన నోటీసులు అని ఆదాయపు పన్ను శాఖ నోటీసుల్లో పేర్కొంది. గత నెల 29న పృథ‍్వీరాజ్ కి మెయిల్ రాగా.. ఏప్రిల్ 29లోగా దీనిపై వివరణ ఇవ్వాలని క్లారిటీ ఇచ్చారు. స్వతహాగా పృథ్వీరాజ్ మలయాళ నటుడు అయినప్పటికీ.. సలార్ (Salaar Movie) చిత్రంతో తెలుగు వాళ్లకు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం మహేశ్-రాజమౌళి మూవీలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్')