
కోలీవుడ్ జంట ఖుష్బూ - సుందర్ (Khushbu - Sundar) కూతురు అవంతిక సినిమాల్లోకి రానుందని ప్రచారం ఊపందుకుంది. ఆమె గ్లామరస్‌గా ముస్తాబైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ దొరికేసిందని జనాలు ఫీలయ్యారు. తనకు కూడా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ఆరాటంగా ఉందట.. కానీ ఇంట్లో వాళ్లు తనను లాంచ్ చేసేందుకు సిద్ధంగా లేరంటూ బుంగమూతి పెట్టింది అవంతిక.
అమ్మానాన్న రెడీగా లేరు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవంతిక సుందర్ (Avantika Sundar) మాట్లాడుతూ.. అమ్మానాన్న నన్ను వెండితెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా లేరు. ఆ మాటకొస్తే వారి చేతులమీదుగా లాంచ్ అవడం నాకూ అంతగా ఇష్టం లేదనుకోండి. కానీ ఎవరో ఒకరు నాకోసం వస్తారు? లేదా నేనే సొంతంగా సినిమాల్లోకి అడుగుపెడతాను అని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. ఎందుకంటే వారి సహాయసహకారాలు లేకుండా ఇవేవీ సాధ్యపడవు.

అమ్మను అడుగుతా..
నా పేరెంట్స్ వల్లే నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టగలను. వారు నన్ను లాంచ్ చేయడానికి సుముఖత చూపించడం లేదు. నా అంతట నేను ఎదగాలన్నది వారి ఆలోచన. కానీ అందుకు వారి సహాయం కావాలి. కనీసం చిత్రపరిశ్రమకు చెందినవారిని అయినా పరిచయం చేయమని అమ్మను అడుగుతున్నాను. అలా అయినా పరిచయాలు పెంచుకుని నేనేదైనా సాధించగలను. స్టార్ కిడ్‌గా నాపై ఎక్కువ అంచనాలు, ఒత్తిడి ఉంటాయని పేరెంట్స్ చెప్పారు. నేను వాటన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రిపరేషన్ కోసం లండన్‌లో డ్రామా స్కూల్‌కు కూడా వెళ్లొచ్చాను.
వాళ్లకంటే ఎక్కువ సక్సెస్?
అయితే నా మెదడులో ఒక ఆలోచన ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. నేనేం చేసినా నా పేరెంట్స్‌తో పోల్చకుండా ఉండలేరు. వాళ్ల కన్నా ఎక్కువ సక్సెస్ అవుతానని నేను చెప్పలేను కానీ నా శక్తి మేర ప్రయత్నిస్తాను. తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పనా.. నాకు ఫెయిల్యూర్స్ అంటే భయం. ఓటమిని తట్టుకోలేను. నా కుటుంబం, ఫ్రెండ్స్ మాత్రం.. ఫలితాన్ని పట్టించుకోకు.. దానికోసం నువ్వెంత కష్టపడ్డావు? అన్నదే ముఖ్యం అని నాకు ధైర్యం చెప్తూ ఉంటారు.
చాలాకాలంగా వెయిటింగ్
సినిమాల్లోకి రావాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. కానీ నా ఎత్తు సమస్యగా మారుతుందేమో అనిపిస్తోంది. నేను 5 అడుగుల 11 అంగుళాల పొడవున్నాను. ఒక నటి ఎలా ఉండాలో అలా లేనేమో అనిపిస్తుంది. ఒకప్పుడైతే లావుగా కూడా ఉన్నాను. అప్పుడు స్క్రీన్‌పై హీరోయిన్లను చూసి నేను కథానాయికగా పనికి రాను అనుకున్నాను. కరోనా సమయంలో ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టి ఇలా మారిపోయాను అని అవంతిక చెప్పుకొచ్చింది.
చదవండి: విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్‌పై 'బన్ని' నిర్మాత కామెంట్లు