ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదు.. పెదవి విప్పండి: ఖుష్బూ | Actress Khushbu Sundar Comments On Hema Committee Report, Breaks Silence On Father's Abuse | Sakshi
Sakshi News home page

Khushbu Sundar: నా కన్నతండ్రి వేధించాడు.. ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సింది!

Published Wed, Aug 28 2024 4:47 PM | Last Updated on Wed, Aug 28 2024 6:25 PM

Actress Khushbu Sundar Comments On Hema Committee Report

రంగుల వెండితెర వెనక దాగి ఉన్న రాక్షస చర్యలు ఎన్నో అంటూ హేమ కమిటీ మలయాళ ఇండస్ట్రీలో ఆర్టిస్టుల అవస్థలను బయటపెట్టింది. పేరున్న పెద్దలు, పెత్తనం వహించిన తారల చేతిలో ఆర్టిస్టుల బతుకులు చితికిపోతున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు సైతం తమకు జరిగిన అన్యాయాలను నిర్భయంగా గొంతు విప్పి చెప్తున్నారు. తప్పు చేసినవారు దర్జాగా తిరుగుతుంటే బాధిత మహిళ మాత్రం ఎందుకు నరకయాతన అనుభవించాలంటోంది నటి ఖుష్బూ సుందర్‌.

ఆడవారికే ఎక్కువ వేధింపులు
ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఖుష్బూ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది. ఆడవారిని దూషించడం, వేధించడం, ఛాన్సులు కావాలంటే కాంప్రమైజ్‌ అయిపోమని కోరడం.. ఇలాంటివి ప్రతి ఇండస్ట్రీలోనూ ఉన్నాయి. పురుషులకన్నా మహిళలకే ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. వారే ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఈ వేధింపులను అరికట్టాల్సిన బాధ్యత హేమకమిటీపై ఎంతైనా ఉంది. 

భయపడకండి
అమ్మాయిలూ.. మీరు అనుభవిస్తున్న బాధ గురించి మాట్లాడండి, అప్పుడే దానిపై చర్యలు తీసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీనివల్ల పరువు పోతుందనో, నిందలు వేస్తారనో ఆలోచించకండి. నిజంగా వేధింపులకు గురైతే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉంది? అంటారేమో! అప్పటి తన పరిస్థితి ఎలా ఉందో మనం ఊహించలేం కదా.. నా కన్నతండ్రి నన్ను లైంగికంగా వేధించాడని గతేడాది బయటపెట్టాను. 

ఆడదానికే పుడతారు
ఈ విషయం చెప్పడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని చాలామంది అడిగారు. నిజమే! ముందు చెప్పాల్సిందే. కాకపోతే అది నా కెరీర్‌ కోసం కాంప్రమైజ్‌ అయిన వ్యవహారం కాదు. నేను కింద పడినప్పుడు నన్ను పట్టుకోవాల్సిన చేతులు... నేను జారిపోతున్నపుడు నిలబెట్టాల్సిన చేతులే నన్ను ఇబ్బంది పెట్టాయి. రక్షించాల్సిన వ్యక్తి చేతుల్లోనే వేదనకు గురయ్యాను. మగవాళ్లందరికీ ఒకటే చెప్తున్నా.. బాధితులవైపు నిలబడండి, వారికి మద్దతివ్వండి. ప్రతి పురుషుడు ఒక ఆడదానికే పుడతాడు. అమ్మ, అక్క, చెల్లి, టీచర్‌, ఆంటీ, ఫ్రెండ్స్‌.. ఇలా ఎంతోమంది ఆడవారి వల్లే మీరిప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు.

ప్రారంభంలోనే ఆశలు ఛిద్రం
మాతో నిలబడండి. మమ్మల్ని రక్షించండి. మీకు జన్మనిచ్చినవారిని, ప్రేమను పంచినవారిని గౌరవించండి. మహిళలపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తి పోరాడండి. మనం కలిసి పనిచేస్తేనే బలంగా ముందడుగు వేయగలం. కుటుంబం అండ లేని ఆడవాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎన్నో ఆశలతో పల్లెటూరు నుంచి వస్తే ఆదిలోనే వారి కలలు ఛిద్రమైపోయినవారూ ఉన్నారు.

తలవంచాల్సిన అవసరం లేదు
ఇకనైనా ఆడవారిని దోచుకోవడం ఆగిపోవాలి. ఒక్కసారి నో అన్నాక ఎవరికీ తలవంచాల్సిన అవసరమే లేదు. మిమ్మల్ని తాకట్టుపెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న ఎంతోమంది స్త్రీలకు.. ఒక తల్లిగా, మహిళగా నేను అండగా నిలబడతాను' అని రాసుకొచ్చింది. కాగా ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి తనపై వేధింపులకు పాల్పడ్డాడంటూ ఖుష్బూ గతేడాది షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టింది.

 

చదవండి: సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement