
బాలీవుడ్ (Bollywood)లో ఒకర్ని చూసి ఇంకొకరు గొర్రెల్లా ఫాలో అవుతారు. కథ, పాత్రల చిత్రీకరణపై దృష్టి పెట్టకుండా కండలు తిరిగిన దేహంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటున్నాడు బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా (Randeep Hooda). దక్షిణాదిలో మాత్రం ఎక్కువగా ఎమోషన్స్‌కు కట్టుబడి ఉంటారని చెప్తున్నాడు. తాజాగా రణ్‌దీప్ హుడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'రీరిలీజ్.. సోషల్‌మీడియాలో ఇప్పుడిదే ట్రెండ్. ఒకటీరెండు రీరిలీజ్ సినిమాలు బాగా ఆడగానే మిగతా అందరూ అదే ఫాలో అవుతున్నారు. కానీ, ప్రతీది ఎందుకు వర్కవుట్ అవుతుంది.
గొర్రెల్లా ఫాలో అవుతారు
ఒకటి సక్సెస్ అయితే చాలు.. గొర్రెల్లా గుడ్డిగా దాన్నే ఫాలో అయిపోతారు. అందరూ అదే చేయాలనుకుంటారు. స్త్రీ సినిమా సక్సెస్ అవగానే హారర్ కామెడీ చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఇలాంటి పలు కారణాల వల్లే హిందీ చిత్రపరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సినిమాలు నిర్మిస్తున్నారు కానీ సినిమాలను ధృడంగా ఎలా తెరకెక్కించాలన్నది మర్చిపోతున్నారు. ప్రయోగాలకు సైతం దూరంగా ఉంటున్నారు.
పుష్ప సినిమా తీసుకోండి
దక్షిణాదిలో మనలాగే సినిమాలు రూపొందిస్తున్నారు. కాకపోతే వాటిలో ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పాత్రను తీర్చిదిద్దేవిధానంలో ఎక్కువ శ్రద్ధ కనిపిస్తుంది. విలువలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఉదాహరణకు పుష్ప తీసుకోండి. అందులో హీరోకు సిక్స్ ప్యాక్ బాడీ ఉండదు. గడ్డం, ఒకవైపు విరిగిన భుజం ఉంటుంది. మనదగ్గర ఎంతసేపూ కండలు తిరిగిన దేహం కోసమే ప్రయత్నిస్తారు తప్ప పాత్రల్ని తీర్చిదిద్దేందుకు ఆసక్తి చూపించరు. దీనివల్ల జనాలు ఓటీటీలపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు' అని చెప్పుకొచ్చాడు.
సినిమా
రణ్‌దీప్ హుడా ప్రస్తుతం 'జాట్'(Jaat Movie) అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో రణతుంగ అనే విలన్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీలో సన్నీడియోల్, రెజీనా, ఆయేషా ఖాన్, సయామీ ఖేర్, జరీనా వాహబ్, వినీత్ కుమార్, అజయ్ ఘోష్, జగపతిబాబు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.