
ఆడవారికి కురులే అందం. కాస్త జుట్టు రాలినా అస్సలు తట్టుకోలేరు. అందులోనూ సెలబ్రిటీలు హెయిర్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటారు. అయితే ఓ సీనియర్ హీరోయిన్ మాత్రం అందంగా కనిపించాలంటే జుట్టు తప్పనిసరా? అని తనకు తాను ప్రశ్నించుకుంది. అందం అంటే ఆత్మవిశ్వాసమే అంటూ గుండు గీయించుకుంది. ఇంతకీ తనెవరో కాదు స్టార్ హీరోయిన్, భానుప్రియ సోదరి శాంతిప్రియ (Shanthi priya). తాజాగా ఆమె గుండుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ధైర్యంగా..
'ఈ మధ్యే గుండు కొట్టించుకున్నాను. ఒక అమ్మాయిగా మనకు జీవితంలో చాలా పరిమితులు, షరతులు ఉంటాయి. ఇవన్నీ మనల్ని బోనులో బంధీలుగా చేస్తాయి. వాటి నుంచి స్వేచ్ఛ కోరుకున్నాను. నన్ను నేను విముక్తి చేసుకున్నాను. అందం అంటే ఇదే అనుకునే ప్రమాణాలను బ్రేక్ చేయాలనుకున్నాను. మనసు నిండా నమ్మకంతో ఎంతో ధైర్యంగా ముందడుగు వేశాను. అలాగే నా దివంగత భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అతడి బ్లేజర్‌ను ధరించాను' అని రాసుకొచ్చింది.
పర్సనల్ లైఫ్- సినిమా
ఈమె తెలుగులో కాబోయే అల్లుడు, నాకు పెళ్లాం కావాలి, మహర్షి (1987), సింహస్వప్నం, యమపాశం, రక్త కన్నీరు, అగ్ని, కలియుగ అభిమన్యుడు, జస్టిస్ రుద్రమదేవి సినిమాల్లో నటించారు. తమిళ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేశారు. 1994లో ఇక్కె పె ఇక్క సినిమాతో బ్రేక్ ఇచ్చిన శాంతిప్రియ.. మూడు దశాబ్దాల తర్వాత వెండితెరకు రీఎంట్రీ ఇచ్చారు. బ్యాడ్ గర్ల్ అనే తమిళ సినిమాతో మరోసారి సిల్వర్ స్క్రీన్ ప్రేక్షకుల్ని పలకరించారు. వ్యక్తిగత విషయానికి వస్తే.. శాంతిప్రియ నటుడు సిద్దార్థ్ రాయ్‌ను 1992లో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. 2004లో సిద్దార్థ్ రాయ్ గుండెపోటుతో మరణించాడు.
చదవండి: వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?: యాంకర్ రవి