బాలీవుడ్‌లో కనిపించని ఖాన్‌ త్రయం.. టాప్‌ లేపిన 'పుష్ప' రాజ్‌ | Highest Grossing Hindi Dubbed Tollywood Films In 2024, Kalki 2898 AD And Pushpa 2 The Rule In List | Sakshi
Sakshi News home page

ఈ బాలీవుడ్‌కి ఏమైంది..?

Published Fri, Dec 27 2024 12:19 AM | Last Updated on Fri, Dec 27 2024 3:11 PM

Highest Grossing Hindi Dubbed South Films: Tollywood

టాప్‌ ఫైవ్‌లో ‘పుష్ప: ది రూల్, కల్కి 2898 ఏడీ’  

కనిపించని ఖాన్‌ త్రయం 

మీడియమ్‌ స్టార్స్‌... హారర్‌ చిత్రాలదే హవా

ఈ బాలీవుడ్‌కి ఏమైంది... దాదాపు రెండు మూడేళ్లుగా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వసూళ్లు అంత ఆశాజనకంగా లేవు. అసలు ఈ ఏడాది ఖాన్‌ త్రయం (సల్మాన్, ఆమిర్, షారుక్‌) వెండితెరపై కనిపించనే లేదు. విడుదలైన చిత్రాల్లో  మీడియమ్‌ స్టార్స్‌ చిత్రాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. అయితే బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది మాత్రం హిందీలోకి అనువాదమైన తెలుగు చిత్రాలు ‘కల్కి 2898 ఏడీ, పుష్ప: ది రూల్‌’ కావడం విశేషం. ఇక ఈ ఏడాది బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ఎలా సాగిందో తెలుసుకుందాం.

హిందీ చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అంత అచ్చొచ్చినట్లుగా లేదు. బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసులు కురిపించే హిందీ సినిమాల సంఖ్య తక్కువైపోయింది. కాస్తో కూస్తో ఈ ఏడాది బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను కాపాడింది హారర్‌ చిత్రాలనే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది విడుదలైన హిందీ చిత్రాల్లో హారర్‌ ‘స్త్రీ 2’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, రాజ్‌ కుమార్‌ రావ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘స్త్రీ’ 2018లో విడుదలై, రూ. వంద కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించి, అప్పట్లోనే సంచలనాలు సృష్టించింది. ఓ ఉమెన్‌ సెంట్రిక్‌ హారర్‌ ఫిల్మ్‌ వందకోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించడం బాలీవుడ్‌లో అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది.

దీంతో ‘స్త్రీ 2’ వస్తుందనగానే ఈ సినిమాపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను వమ్ము చేయకుండా ‘స్త్రీ 2’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్‌ రావ్‌ లీడ్‌ రోల్స్‌లో అక్షయ్‌ కుమార్, వరుణ్‌ ధావన్‌ గెస్ట్‌ రోల్స్‌లో నటించిన ‘స్త్రీ 2’ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ. 850 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది. రూ.650 గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించి, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచి, రికార్డు సృష్టించింది.

హిందీ ఆడియన్స్‌ ‘స్త్రీ 2’ హారర్‌ హ్యాంగోవర్లో ఉన్నారేమో కానీ ఆ వెంటనే వచ్చిన మరో హారర్‌ హిందీ చిత్రం ‘భూల్‌ భూలయ్యా 3’ సినిమానూ విశేషంగా ఆదరించారు. కార్తీక్‌ ఆర్యన్, త్రిప్తీ దిమ్రీ హీరోయిన్లుగా నటించిన ఈ హారర్‌ మూవీకి అనీస్‌ బాజ్మీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్, విద్యాబాలన్‌ ఇతర రోల్స్‌ చేశారు. ఈ ఏడాది నవంబరు 1న విడుదలైన ఈ మూవీ దాదాపు రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే కోవలో అంటే... హారర్‌ నేపథ్యంలోనే వచ్చిన ‘సైతాన్‌’ చిత్రం హిందీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రాబట్టుకోగలిగింది.

వికాస్‌ బాల్‌ డైరెక్షన్‌లోని ఈ మూవీలో అజయ్‌ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్‌ రోల్స్‌లో నటించారు. ‘సైతాన్‌’ సినిమాలో విలన్‌గా మాధవన్, మరో లీడ్‌ రోల్‌లో నటించిన మరాఠీ నటి జాంకీలు ఈ సినిమాలో మేజర్‌ హైలైట్‌గా నిలిచారు. ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి, సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇక సినిమాలో కంటెంట్‌ ఉంటే అదీ చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని ఆడియన్స్‌ పట్టించుకోరని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. ఈ ఏడాది మరోసారి ప్రూవ్‌ అయింది. హిందీ ఆడియన్స్‌ను మెప్పించిన హారర్‌ మూవీ ‘ముంజ్య’.

యువ తారలు అభయ్‌ వర్మ, శర్వారీ హీరో హీరోయిన్లుగా, సత్యరాజ్, మోనాసింగ్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించిన ఈ హారర్‌ ఫిల్మ్‌కు ఆదిత్య సర్ఫోత్థార్‌ దర్శకత్వం వహించారు. అంచనాలు లేకుండా జూన్‌లో విడుదలైన ఈ మూవీ రూ. 120 కోట్ల  గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించి, బాలీవుడ్‌ ఆడియన్స్‌లో హారర్‌ జానర పట్ల ఉన్న మక్కువను మరోసారి నిరూపించింది. అలాగే 2018లో విడుదలైన హారర్‌ మూవీ ‘తుంబాడ్‌’ ఈ ఏడాది సెప్టెంబరులో రీ–రిలీజై హిట్‌ మూవీగా నిలిచింది. 

కథానాయికల జోరు 
హారర్‌ తర్వాత బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్స్‌గా నిలిచిన చిత్రాలు హీరోయిన్స్‌ మెయిన్‌ లీడ్‌ రోల్స్‌లో నటించినవి కావడం ఈ ఏడాది విశేషం. ముందుగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘లాపతా లేడీస్‌’ సినిమా  గురించి ప్రస్తావించుకోవాలి. కొంత గ్యాప్‌ తర్వాత కిరణ్‌ రావ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 1న థియేటర్స్‌లో రిలీజైంది. ఎలాంటి అంచనాలు లేని ఈ చిత్రానికి విడుదల తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో ఆడియన్స్‌ నుంచి సూపర్‌ డూపర్‌ రెస్పాన్స్‌ లభించింది. ప్రతిభ రంతా, నితాన్షి గోయెల్, స్పర్శ్‌ శ్రీవాత్సవ లీడ్‌ రోల్స్‌లో నటించిన ఈ మూవీలో రవికిషన్, ఛాయా కందమ్‌ కీలక పాత్రల్లో నటించారు.

ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలవడమే కాకుండా, విమర్శకుల ప్రసంసలను దక్కించుకుంది. అంతేకాదు... 2025 మార్చిలో జరగనున్న 97వ ఆస్కార్‌ అవార్డ్స్‌లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘లాపతా లేడీస్‌’ సినిమాను, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు అఫీషియల్‌ ఇండియన్‌ ఎంట్రీ మూవీగా పంపారు. ఇలా ‘లాపతా లేడీస్‌’ చిత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ 97వ ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌ జాబితాలో ఈ  సినిమాకు చోటు దక్కకపోవడం ఇండియన్‌ ఆడియన్స్‌కు కాస్త బాధ కలిగే అంశమనే చెప్పాలి. ఇదే నెలలో అంటే... ఫిబ్రవరి 23న విడుదలైన ΄÷లిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ఆర్టికల్‌ 370’. యామీ గౌతమ్, ప్రియమణి లీడ్‌ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ దక్కింది.

ఆదిత్యా సుహాస్‌ డైరెక్షన్‌లోని ఈ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌తో హిట్‌గా నిలిచింది. అలాగే టబు, కరీనా కపూర్, కృతీ సనన్‌ నటించిన ఉమెన్‌ మల్టీ స్టారర్‌ మూవీ ‘క్రూ’ కూడా ప్రేక్షకుల మెప్పు పొంది, ఈ ఏడాది సూపర్‌హిట్‌ మూవీస్‌లో చోటు దక్కించుకోగలిగింది. రాజేశ్‌ ఏ క్రిష్ణన్‌ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లింగ్‌ డ్రామా రూ.150 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది. ఇక ‘ఆల్‌ ఉయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాయలల్‌ కపాడియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది జరిగిన 77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్‌ ప్రీ అవార్డును సైతం గెలుచుకుంది.

అంతేనా... మరికొన్ని అంతర్జాతీయ అవార్డులను కూడా ఈ చిత్రం గెలుచుకుంది. కనికా కస్రూతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఛాయా కందమ్‌ మరో లీడ్‌ రోల్‌లో నటించారు. ఈ చిత్రం హిందీ భాషలో (మలయాళ, మరాఠీ భాషల్లో కూడా విడుదలైంది) సెప్టెంబరులో ఇండియాలో విడులైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్‌ చేసింది. 

హిట్‌ యాక్షన్‌ 
బాలీవుడ్‌లో బడా మల్టీస్టారర్‌ మూవీగా రూపొందిన చిత్రం ‘సింగమ్‌ ఎగైన్‌’. దర్శకుడు రోహిత్‌ శెట్టి ‘సింగమ్‌’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్, కరీనా కపూర్‌ హీరో హీరోయిన్లుగా నటించగా, అక్షయ్‌ కుమార్, రణ్‌వీర్‌ సింగ్, అర్జున్‌ కపూర్, టైగర్‌ ష్రాఫ్, దీపికా పదుకోన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు. ఇంతటి భారీ క్యాస్టింగ్‌తో, భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సింగమ్‌ ఎగైన్‌’ ఓ మోస్తరు హిట్‌ను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. బాలీవుడ్‌ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

అయితే ‘సింగమ్‌ ఎగైన్‌’ రిలీజైన రోజునే... అంటే... నవంబరు 1నే, ‘భూల్‌ భూలయ్యా 3’ చిత్రం కూడా థియేటర్స్‌లోకి వచ్చింది.  ‘సింగమ్‌ ఎగైన్‌’ సినిమా వసూళ్లపై కొంత ఎఫెక్ట్‌ పడటానికి ఈ సినిమా ఓ కారణం అని బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గీయులు చెప్పుకున్నారు. ఇక హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’ సినిమా కూడా సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలోని ఈ మూవీలో తొలి సారిగా హృతిక్‌ రోషన్, దీపికా పదుకోన్‌ కలిసి నటించారు. జనవరి 25న విడులైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇంకా షాహిద్‌ కపూర్‌ రోబో లవ్‌స్టోరీ ‘తేరీ బోతో మే ఐసా ఉల్జా జియా’, విక్కీ కౌశల్‌ కామెడీ డ్రామా ‘బ్యాడ్‌ న్యూజ్‌’ వంటి చిత్రాలకు ప్రేక్షకులు హిట్‌ స్టేటస్‌ ఇచ్చారు. – ముసిమి శివాంజనేయులు

టాప్‌ లేపిన పుష్ప రాజ్‌
ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపిన చిత్రం ‘పుష్ప: ది రూల్‌’. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో రూ పొందిన ‘పుష్ప: ది రూల్‌’ సినిమా హిందీ వెర్షన్‌ రూ.700 కోట్ల  గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించి, హిందీ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ ఏడాది బాలీవుడ్‌ స్ట్రయిట్‌ హిందీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘స్త్రీ 2’ కలెక్షన్స్‌ను సైతం అధిగమించి, ‘పుష్ప: ది రూల్‌’ సినిమా రికార్డు సృష్టించింది. ఇలా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా ‘పుష్ప ది రూల్‌’ నిలిచింది. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప: ది రూల్‌’ సినిమా ఇప్పటికే రూ.1700 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా, మేకర్స్‌ వెల్లడించారు.

‘పుష్ప: ది రూల్‌’ మూవీ ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్స్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ప్రభాస్‌ చేసిన మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాలీవుడ్‌ ఆడియన్స్‌తో హిట్‌ ఫిల్మ్‌ అనిపించుకుంది. ప్రభాస్‌ హీరోగా, అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించిన ఈ మూవీకి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. జూన్‌ 27న థియేటర్స్‌లోకి వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ మూవీ హిందీలో దాదాపు రూ.300 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది.

ఇలా ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ ఫైవ్‌లో చోటు దక్కించుకుంది. అలాగే ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలైన ఎన్టీఆర్‌ ‘దేవర’ చిత్రం కూడా హిందీ ఆడియన్స్‌ను మెప్పించింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు.

కనిపించని ఖాన్‌ త్రయం
‘సింగమ్‌ ఎగైన్, బేబీ జాన్‌’ చిత్రాల్లో సల్మాన్‌ ఖాన్‌ గెస్ట్‌గా కనిపించారు. కానీ ఆయన హీరోగా నటించిన సినిమా ఏదీ ఈ ఏడాది థియేటర్స్‌లోకి రాలేదు. అలాగే అమిర్‌ ఖాన్, షారుక్‌ ఖాన్‌ హీరోలుగా నటించిన చిత్రాలు కూడా థియేటర్స్‌లోకి రాలేదు. ఇంకా రణ్‌బీర్‌ కపూర్, రణ్‌వీర్‌ సింగ్‌ (సింగమ్‌ ఎగైన్‌ మూవీలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించలేదు)... ఇలా బాలీవుడ్‌ అగ్రశ్రేణి హీరోల సినిమాలు థియేటర్స్‌లోకి రాకపోవడం కూడా హిందీ బాక్సాఫీస్‌కి ఓ మైనస్‌ అని చెప్పాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement