రికార్డులు తిరగరాసిన పుష్ప.. చిన్న చిత్రాలకు పెద్ద విజయం | Big success for small films: Best of Telugu Cinema in 2024 | Sakshi
Sakshi News home page

రికార్డులు తిరగరాసిన పుష్ప.. చిన్న చిత్రాలకు పెద్ద విజయం

Published Mon, Dec 30 2024 3:21 AM | Last Updated on Mon, Dec 30 2024 6:53 AM

Big success for small films: Best of Telugu Cinema in 2024

తెలుగు సినిమా తగ్గేదే లే అన్నట్లుగానే 2024 సాగింది. విజయాల శాతం తక్కువే అయినప్పటికీ... కొన్ని చిత్రాలు సాధించిన వసూళ్లు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. రూ. 1700 కోట్లతో ‘పుష్ప: ది రూల్‌’ బాక్సాఫీస్‌ని రూల్‌ చేసింది. రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో ‘కల్కి2898 ఏడీ’ సత్తా చాటింది. యువ హీరోలు తేజ సజ్జా ‘హను–మాన్‌’, కిరణ్‌ అబ్బరం ‘క’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇంకా నూతన తారలతో వచ్చిన సినిమాలూ ఆకట్టుకున్నాయి. ఇక 2024 రౌండప్‌లోకి వెళదాం...

ఈ ఏడాది తెలుగు తెరపై అనువాద చిత్రాలకు మంచి ఆదరణ దక్కింది. తమిళ చిత్రాలు రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌: ది హంటర్‌’, విజయ్‌ సేతుపతి ‘మహారాజా’, శివ కార్తికేయన్‌ ‘అమరన్‌’ కార్తీ–అరవింద్‌ స్వామిల ‘సత్యం–సుందరం’, విక్రమ్‌ ‘తంగలాన్‌’, ధనుష్‌ ‘రాయన్‌’, విజయ్‌ ‘ది గోట్‌: ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’, తమన్నా–సుందర్‌ .సి  ‘బాకు’ (అరణ్మణై 4) చిత్రాలకు తెలుగులో ఆదరణ దక్కింది. ఈ ఏడాది తెలుగులో మలయాళ చిత్రాల హవా కూడా కనిపించింది. ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’, మమ్ముట్టి ‘భ్రమయుగం’, నస్లెన్‌  ‘ప్రేమలు’, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ‘ఆడు జీవితం’, టొవినో థామస్‌ ‘ఏఆర్‌ఎమ్‌’ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. కన్నడ చిత్రాలు ఉపేంద్ర ‘యూఐ’, కిచ్చా సుదీప్‌ ‘మ్యాక్స్‌’లకు అలరించాయి.

తెలుగు సినిమా అసలు సిసలైన పండగ సంక్రాంతితో ఆరంభం అవుతుంది. ఈ పండగకి వచ్చే పెద్దా చిన్నా సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోతాయి. అలా 2024లో సంక్రాంతికి వచ్చిన సినిమాలతో థియేటర్లు పండగ చేసుకున్నాయి. సినీ లవర్స్‌ కూడా ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. ఈ ఏడాది సంక్రాంతి పండక్కి మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జా ‘హను–మాన్‌’, వెంకటేశ్‌ ‘సైంధవ్‌’, నాగార్జున ‘నా సామిరంగ’ వరుసగా విడుదల అయ్యాయి.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ బ్లాక్‌ బస్టర్‌గా  నిలిచింది. ఇదే రోజున ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘హను–మాన్‌’ భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతికి వచ్చిన సీనియర్‌ హీరోలతో పాటు యువ హీరో తేజ విజయం అందుకోవడం విశేషం. ఇక వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో విడుదలైన ‘సైంధవ్‌’ ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. సంక్రాంతి పండగలో చివరిగా వచ్చిన నాగార్జున మాస్‌ కమర్షియల్‌ ‘నా సామి రంగ’ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ దర్శకుడిగా పరిచయం అయ్యారు.

ఇంకా జనవరి నెలలో విడుదలైన ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్‌ హీరోగా నటించిన తొలి సినిమా ‘సర్కారు నౌకరి’, హన్సిక ‘105 మినిట్స్‌’ నిరాశపరిచాయి. జనవరిలో దాదాపు ఇరవై సినిమాలు వచ్చినా ఆకట్టుకున్నవి తక్కువే. ఇక ఫిబ్రవరిలో ఇరవై సినిమాలకు పైగా వచ్చాయి. కులవివక్ష నేపథ్యంలో సుహాస్‌ హీరోగా నూతన దర్శకుడు దుష్యంత్‌ కటికనేని తెరకెక్కించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’కి కొద్దిపాటి ప్రేక్షకాదరణ దక్కింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందిన ‘యాత్ర 2’ ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో జీవా నటించారు.

మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా మహి  వి. రాఘవ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ రూపొందింది. సీక్వెల్‌ కూడా మహి దర్శకత్వంలోనే రూపొందింది. ఈ నెలలో రవితేజ ‘ఈగిల్‌’ సినిమా ఓ మోస్తరు హిట్‌ అందుకుంది. ఈ మాస్‌ ఫిల్మ్‌కి కార్తీక్‌ ఘట్టమనేని దర్శకుడు. ఇంకా సందీప్‌ కిషన్‌ హారర్‌ ఫిల్మ్‌ ‘ఊరి పేరు భైరవకోన’ ఫర్వాలేదనిపించుకుంది. ఈ చిత్రానికి వీఐ దర్శకుడు. అలాగే ప్రియమణి ‘భామాకలాపం 2’ ఫర్వాలేదనిపించుకుంది. ఇక మార్చిలో ముప్పైకి పైగా సినిమాలు వస్తే, అలరించినవి మాత్రం ఐదారు సినిమాలే. శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ చేసిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’కి ఆశించిన ఫలితం దక్కలేదు.

శివ కందుకూరి మిస్టరీ థ్రిల్లర్‌ డ్రామా ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’, అఘోరాగా విశ్వక్‌ సేన్‌ నటించిన ‘గామి, అనన్య నాగళ్ల హారర్‌ మూవీ ‘తంత్ర’, హిస్టారికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘రజాకార్‌’ చిత్రాలు ఆడియన్స్‌ను అలరించే ప్రయత్నం చేశాయి. అయితే సిద్ధు జొన్నలగడ్డ–అనుపమా పరమేశ్వరన్‌ల ‘డీజే టిల్లు స్క్వేర్‌’, శ్రీ విష్ణు హీరోగా చేసిన ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వంలో ‘డీజే టిల్లు స్క్వేర్‌’ రూపొందగా, ‘ఓం భీమ్‌ బుష్‌’కి హర్ష కొనుగొంటి దర్శకుడు. ఇదే నెల ఆరంభంలో వచ్చిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘వ్యూహం’ చర్చనీయాంశమైంది.

ఏప్రిల్‌లో థియేటర్స్‌లోకి వచ్చిన చిత్రాలు ఇరవైలోపే. పరశురామ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ ఓ మోస్తరుగా అలరించింది. ఇదే నెలలో నూతన దర్శకుడు శివ తుర్లపాటి దర్శకత్వంలో వచ్చిన అంజలి ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ నవ్వించింది. ఇక మే నెలలో వచ్చిన ఇరవై చిత్రాల్లో కార్తికేయ ‘భజే వాయు వేగం’, ఆనంద్‌ దేవరకొండ ‘గం గం గణేశా’, మోహన్‌ భగత్‌ ‘ఆరంభం’ ఆడియన్స్‌ దృష్టిని తమ వైపు తిప్పుకోగలిగాయి.

‘భజే వాయు వేగం’తో దర్శకుడిగా ప్రశాంత్‌ రెడ్డి పరిచయం కాగా, ‘ఆరంభం’తో అజయ్‌ నాగ్‌ డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. సత్యదేవ్‌ ‘కృష్ణమ్మ’తో వీవీ గోపాలకృష్ణ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ‘అల్లరి’ నరేశ్‌ ‘ఆ... ఒక్కటి అడక్కు..!’, విశ్వక్‌ సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమాలకు ఊహించిన ఫలితాలు రాలేదు. జూన్‌లో దాదాపు పాతిక సినిమాలు రాగా, అందరి దృష్టి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా పైనే నిలిచింది. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది. ఇదే నెలలో వచ్చిన సుధీర్‌బాబు ‘హరోంహర’, శర్వానంద్‌ ‘మనమే’ వంటివి అంచనాలను అందుకోలేకపోయాయి. 

అజయ్‌ ఘోష్‌ ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ మెప్పించింది. జూలైలో మీడియమ్‌ చిత్రాలు ఓ పది విడుదలయ్యాయి. వీటిలో నవదీప్‌ ‘లవ్‌మౌళి’, ప్రియదర్శి–నభా నటేశ్‌ల ‘డార్లింగ్‌‘, రక్షిత్‌ శెట్టి ‘ఆపరేషన్‌ రావణ్‌‘, రాజ్‌ తరుణ్‌ ‘పురుషోత్తముడు’ వంటి సినిమాలు ఉన్నాయి. కానీ ఏ చిత్రం కూడా హిట్‌ కాలేకపోయింది. ఆగస్టు నెలలో దాదాపు ముప్పై సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. ఆగస్టు నెలాఖర్లో వచ్చిన నాని ‘సరిపోదా శనివారం’ సూపర్‌ హిట్‌గా నిలవగా, అల్లు శిరీష్‌ ‘బడ్డీ’, రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రాలు నిరాశపరిచాయి. అయితే చిన్న చిత్రాలుగా రిలీజైన దర్శకుడు అంజి మణిపుత్ర– హీరో నార్నే నితిన్‌ ‘ఆయ్‌’, యదు వంశీ దర్శకుడిగా పరిచయమై, నూతన నటీనటులు చేసిన ‘కమిటీ కుర్రోళ్ళు’ హిట్‌గా నిలిచాయి. 

లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో రావు రమేశ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘మారుతినగర్‌ సుబ్రమణ్యం’ చిత్రం మెప్పించింది. ఎన్టీఆర్‌ ‘దేవర’ మేనియాతో సెప్టెంబరులో పెద్దగా సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘దేవర పార్టు 1’ ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా యూనిట్‌ పేర్కొంది. ఇదే నెలలో వచ్చిన నివేదా థామస్‌ ‘35: చిన్న కథ కాదు’, శ్రీ సింహా–హాస్యనటుడు సత్య–ఫరియా అబ్దుల్లా చేసిన ‘మత్తు వదలరా 2’ చిత్రాలు అలరించాయి.

ఈ ఏడాదికి అక్టోబరు కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. ముందుగా శ్రీవిష్ణు ‘స్వాగ్‌’ సినిమా రిలీజైంది. శ్రీవిష్ణు నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక దసరాకి వచ్చిన సుధీర్‌బాబు ‘మా నాన్న సూపర్‌ హీరో’, గోపీచంద్‌ ‘విశ్వం’, సుహాస్‌ ‘జనక అయితే గనక’ చిత్రాలకు ఓ మోస్తరు ప్రేక్షకాదరణ దక్కింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా వచ్చిన ‘విశ్వం’ దసరా హిట్‌ సినిమాల్లో ముందు నిలిచింది. దసరా తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన రూరల్‌ డ్రామా ‘పొట్టేల్‌’ ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్‌ చేయగలిగింది. అక్టోబరులో దీపావళి సందర్భంగా విడుదలైన దుల్కర్‌ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్‌‘, కిరణ్‌ అబ్బవరం ‘క’ చిత్రాలు మంచి వసూళ్లు సాధించాయి.

వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘లక్కీ భాస్కర్‌’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే దర్శక ద్వయం సుజిత్‌–సందీప్‌ పరిచయం అయిన ‘క’ సూపర్‌ హిట్‌ అయింది. నవంబరులో భారీ సినిమాలేవీ రిలీజ్‌ కాలేదు. విడుదలైన వాటిలో కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడితో విశ్వక్‌ సేన్‌ హీరోగా చేసిన ‘మెకానిక్‌ రాఖీ’, సత్యదేవ్‌–ధనంజయల ‘జీబ్రా’, కొత్త దర్శకుడు విక్రమ్‌ రెడ్డి తీసిన ‘రోటీ కపడా రొమాన్స్‌’ చిత్రాలు అలరించాయి. వరుణ్‌ తేజ్‌ ‘మట్కా’, నిఖిల్‌ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నిరుత్సాహపరచాయి. ఇక డిసెంబరు తొలి వారంలోనే హీరో అల్లు అర్జున్‌–దర్శకుడు సుకుమార్‌ల ‘పుష్ప: ది రూల్‌’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1700 కోట్లకు పైగా కలెక్షన్స్‌ వచ్చినట్లుగా యూనిట్‌ ప్రకటించింది. హిందీలో ‘పుష్ప 2’కు రూ. 700 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ రావడం విశేషం. ఈ విధంగా ఇప్పటికే ‘పుష్ప 2’ పలు రికార్డులను తిరగ రాసింది. ఈ సినిమా ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శితమవుతోంది. నెలాఖరులో అల్లరి నరేశ్‌ ‘బచ్చల మల్లి’, ‘వెన్నెల’ కిశోర్‌–అనన్య నాగళ్ల నటించిన ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’, ధర్మ ‘డ్రింకర్‌ సాయి’ వంటి చిత్రాలు వచ్చాయి. 

విజయాల శాతం తక్కువ, అపజయాల శాతం ఎక్కువ అన్నట్లుగా 2024 సాగింది. స్ట్రయిట్, డబ్బింగ్‌ చిత్రాలతో కలిపి దాదాపు 250 చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. అయితే పెద్దా... చిన్నా... అనువాద చిత్రాలు సాధించిన విజయాలు పది శాతం లోపే. 2025లో సక్సెస్‌ రేట్‌ పెరగాలని కోరుకుందాం.

మిస్సింగ్‌: ఈ ఏడాది వెండితెరను మిస్‌ అయిన సీనియర్‌ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, యువ హీరోల్లో నాగచైతన్య, రానా (సోలో హీరోగా..), అఖిల్, నితిన్, మంచు విష్ణు, నందమూరి కల్యాణ్‌రామ్, నాగశౌర్య, అడివి శేష్, సాయి దుర్గా తేజ్, నవీన్‌ పొలిశెట్టి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వైష్ణవ్‌ తేజ్‌ తదితరులు ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement