
టిల్లు స్క్వేర్ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం జాక్. ఈ మూవీకి బొమ్మిరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన సినీ ఇండస్ట్రీలో ఎడిటర్ గురించి ఎవరూ మాట్లాడరని అన్నారు. టిల్లు స్క్వేర్, తండేల్, మ్యాడ్ స్క్వేర్ హిట్ అయ్యాయంటే ఎడిటర్ నవీన్ నూలి మాత్రమే కారణమన్నారు. కానీ సినిమాకు ఎడిటర్ అనేవారు చాలా ముఖ్యం.. ఆయన లేకపోతే దర్శకుడికి కాళ్లు, చేతులు ఆడవని సిద్ధు అన్నారు. మనం చాలా తక్కువగా ఎడిటర్ గురించి మట్లాడతాం.. కానీ వారే సినిమాకు చాలా ప్రధానమని ఆయన తెలిపారు. మా జాక్ సినిమాకు నవీన్ నూలినే ఎడిటర్.. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు.
అలాగే రానా ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాకపోవడంపై కూడా సిద్ధు స్పందించారు. రానా ప్రస్తుతం ముంబయిలో ఉన్నారని తెలిపారు. రానా నాయుడు సీజన్-2 డబ్బింగ్‌తో బిజీగా ఉన్నారని సిద్ధు వెల్లడించారు. సాయంత్రం ఐదున్నరకు రావాల్సిన విమానం మిస్ కావడంతోనే రానా రాలేకపోయారని సిద్ధు క్లారిటీ ఇచ్చారు.