
కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న పెద్ది సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. ఈ షెడ్యూల్‌లో శివరాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అమెరికాలో క్యాన్సర్ చికిత్స చేయించుకుని కోలుకున్న తర్వాత షూటింగ్‌కు హాజరయ్యారు.
అయితే తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలోనూ పలు సినిమాల్లో నటిస్తున్నారాయన. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి నటిస్తోన్న 45 మూవీలో శివరాజ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్ శివుడిగా, ఉపేంద్ర యముడిగా, రాజ్ బి శెట్టి మార్కండేయగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సమావేశంలో ఉపేంద్రతో పాటు శివరాజ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పెద్ది సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
(ఇది చదవండి: 'మనిషి చనిపోయాక చూపించే ప్రేమ.. ప్రాణాలతో ఉన్నప్పుడే చూపించండి')
శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. 'రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం 2 రోజులు షూట్ చేశా. ఆ రెండు రోజులు చాలా సరదాగా అనిపించింది. తొలిసారి తెలుగులో మాట్లాడా. డైరెక్టర్ చాలా గుడ్ పర్సన్. నా షాట్‌ను ఆయన అభినందించారు. రామ్ చరణ్ బిహేవియర్ వెరీ గుడ్. ఈ సినిమాలో తొలిసారిగా తెలుగులో డైలాగ్ చెప్పాను. పెద్దిలో నా రోల్ చాలా స్పెషల్. బుచ్చిబాబు స్క్రిప్ట్ చాలా నచ్చింది. నాకు కీమో థెరపీ కంప్లీట్ చేసిన 4 రోజులకే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాను.. టీమ్ అందరూ ఇచ్చిన సపోర్ట్ తోనే షూట్ చేయగలిగాను' అని అన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో బెంగళూరు కప్ కొట్టాలని కోరుకుంటున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఈ సాలా కప్ నమ్దే అని శివరాజ్ కుమార్ తన మద్దతు ప్రకటించారు. ఆర్సీబీకి కూడా ఒక్కసారి కప్ కొట్టే ఛాన్స్ ఇవ్వండని కోరారు.