
‘‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రంలో కల్యాణ్ రామ్, విజయశాంతిగార్ల పాత్రలు పోటా పోటీగా ఉంటాయి. నటన పరంగానూ సమానంగా
ఉంటాయి. సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఫోన్ కూడా చూడరు. తర్వాత ఏం జరుగుతుందనే ఎగ్జయిట్‌మెంట్ ఉంటుంది. ఇలాంటి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉన్న సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఫైనల్ ఔట్‌పుట్ చూసుకున్నాక మా అంచనాలకు మించి ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చిందనిపించింది’’ అని నిర్మాతలు సునీల్ బలుసు, అశోక్‌వర్ధన్ ముప్పా చెప్పారు.
కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా సునీల్, అశోక్‌వర్ధన్ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ రామ్‌గారు ప్రయోగాత్మక సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఒక మాస్ కమర్షియల్ చిత్రం చేయాలని ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కథ సిద్ధం చేయించాం. ఆయన తల్లి పాత్రకి విజయశాంతిగారినే అనుకున్నాం.
ఆమెకు కూడా కథ నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారు. ఎక్కువ భావోద్వేగాలున్న ఈ సినిమాని ప్రదీప్ బాగా తెరకెక్కించారు. ఈ కథని నమ్మి బాగా ఖర్చు పెట్టాం. మేం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తుంది. మా సినిమా చూసిన ఎన్టీఆర్‌గారు ఎమోషనల్ అయ్యారు. అజనీష్ లోక్‌నాథ్ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చారు. ఏ నిర్మాత అయినా థియేటర్స్ వసూళ్లనే నమ్ముకుని సినిమా తీయాలి. అంతేకానీ, ఓటీటీ, శాటిలైట్ హక్కులు వంటి డిజిటల్ బిజినెస్‌పై ఆధా రపడకూడదు. మరో సినిమా నిర్మించ డానికి కథలు విన్నాం’’ అన్నారు.