
కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు.ఈ మూవీలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. శనివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ నటి విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు.
జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..' నేను, అన్న నిల్చున్నప్పుడు ఇలాంటి వేదికలపై నాన్న వచ్చి మాట్లాడేవారు. ఈ రోజు విజయశాంతి మాట్లాడుతుంటే మా నాన్న లేరనే లోటు భర్తీ అయిపోయింది. చాలామంది హీరోలు అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఏ మహిళ కూడా విజయశాంతి లాగా గొప్పదనం సాధించలేదు. తెలుగు సినీ చరిత్రలోనే కాదు.. భారతదేశవ్యాప్తంగా హీరోలతో సమానంగా ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయశాంతి ఒక్కరే. కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు లాంటి ఎన్నో గొప్ప కథలు, పాత్రలు చేసిన మరో నటి ఇండియాలోనే లేదు. ఈ ఘనత కేవలం ఆమెకు మాత్రమే దక్కింది. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా కథ కర్తవ్యం మూవీలో వైజయంతికి ఓ కొడుకు పుడితే ఎలా ఉంటుందో అనే ఐడియాతోనే ఈ కథ పుట్టినట్టు ఉంది' అని విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు.