
సెలబ్రిటీలను ట్రోల్ (Trolling) చేయడం ఈ మధ్య చాలామందికి ఆటవిడుపుగా మారింది. వారేం చేసినా, చేయకపోయినా.. ప్రతి చిన్నదానికి విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ బ్యాచ్ హీరోయిన్ త్రిష మీద పడ్డారట! ఈమె కథానాయికగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో ఆమె పాత్ర చూసి కొందరు యావరేజ్‌గా ఉందని పెదవి విరిచారు.
అర్థం కావట్లే..
అక్కడితో ఆగకుండా తనపై విద్వేషపూరిత కామెంట్లు చేశారు. అవన్నీ చూసి భరించలేకపోయింది త్రిష (Trisha Krishnan). ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ట్రోలర్స్‌కు గడ్డి పెట్టే ప్రయత్నం చేసింది. కొందరు మనుషులకు ఒళ్లంతా విషమే! మీకు నిద్రెలా పడుతుంది? ఇంత హాయిగా ఎలా బతుకుతున్నారో నాకర్థం కావడం లేదు. ఎంతసేపూ సోషల్ మీడియాకు వచ్చి అర్థంపర్థం లేని పనులు చేస్తూ అడ్డదిడ్డంగా పోస్టులు పెట్టమే మీ పనా? అవతలివారిని విమర్శిస్తేగానీ మీకు రోజు గడవదా? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయమేస్తోంది. మీ చుట్టూ ఉన్నవాళ్లు ఎలా బతుకుతున్నారో? ఏంటో? పిరికిపందల్లారా.. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా అసహనం వ్యక్తం చేసింది.
సినిమా..
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విషయానికి వస్తే.. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాలో అర్జున్ దాస్, ప్రసన్న, కార్తికేయ దేవ్, ప్రభు, ప్రియ ప్రకాశ్ వారియర్, సునీల్, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్‌స్లీ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. అజిత్‌తో ఇది త్రిషకు ఆరో సినిమా కావడం విశేషం. గతంలో వీరి కాంబినేషన్‌లో జి, కిరీడం, మంకత, ఎన్నై అరిందల్, విదాముయర్చి సినిమాలు వచ్చాయి.
చదవండి: గుండు గీయించుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?