క్లిక్‌ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ | - | Sakshi
Sakshi News home page

క్లిక్‌ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ

Published Mon, Dec 9 2024 2:03 AM | Last Updated on Mon, Dec 9 2024 10:42 AM

-

రోజుకో కొత్త తరహాలో సైబర్‌ నేరాలు

పీఎం కిసాన్‌ యోజన పేరుతో వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతున్న నకిలీ లింక్‌లు

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

చౌటుప్పల్‌ రూరల్‌: ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ రోజువారి కార్యకలాపాల్లో అమలు చేస్తుండగా.. సైబర్‌ నేరగాళ్లు అంతకుమించిన టెక్నాలజీని వినియోగిస్తూ అమాయక ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన సైబర్‌ నేరగాళ్లకు మంచి అవకాశంగా మారింది. విద్యావంతులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటిఎం యాప్‌ల ద్వారా డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్నారు. ఇదే సైబర్‌ నేరగాళ్లకు వరంగా మారింది.

ఏపీకే ఫైళ్లతో ప్రమాదం..
సైబర్‌ నేరగాళ్లు ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజీ లేదా ఆండ్రాయిడ్‌ ప్యాకేజీ కిట్‌(ఏపీకే) ఫైళ్లను వాట్సాప్‌ ద్వారా పంపుతున్నారు. వాటిని ఓపెన్‌ చేసి ఓకే అని క్లిక్‌ చేస్తే.. సంబంధిత వ్యక్తుల ఫోన్లు హ్యాక్‌ అవుతున్నాయి. ఫలితంగా మనకు సంబంధ లేకుండానే మన ఫోన్‌ నియంత్రణ సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్తోంది. తమ ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందని తెలియని వారు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్యారా సొమ్ము పంపితే వెంటనే హ్యాక్‌ చేసిన మొబైల్‌ నంబర్‌ ద్వారా పిన్‌ నంబర్‌ తెలుసుకుని నిమిషాల్లో ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలోని నగదు కాజేస్తున్నారు. హ్యాక్‌ చేసిన మొబైల్‌ డివైస్‌ డిస్‌ప్లే సైబర్‌ నేరగాళ్ల చేతిలో ఉంటుంది. దీని ప్రకారం ఆ ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్‌ నంబర్లకు ఫోన్‌ హ్యాకింగ్‌కు గురైన వ్యక్తి పంపినట్లు ఏపీకే ఫైళ్లను పంపుతున్నారు. 

నిజంగానే మనకు తెలిసిన వ్యక్తి నుంచే ఈ మెసేజ్‌ వచ్చిందని భావించి ఏపీకే ఫైళ్ల లింక్‌ ఓపెన్‌ చేస్తున్నారు. దీంతో బ్యాంకు ఖాతాలో సొమ్ము కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్‌ యోజన పథకం పేరిట లింక్‌ పంపుతున్నారు. ఈ లింక్‌ను ఓపెన్‌ చేసినా కూడా ఫోన్‌ హ్యాక్‌ అయ్యి మనకు సంబంధం లేకుండానే బ్యాంకు అకౌంట్‌ నుంచి డబ్బులను సైబర్‌ నేరగాళ్లు లాగేసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే అనవసర లింక్‌లను ఓపెన్‌ చేస్తే బ్యాంకు ఖాతాలోని సొమ్ము ఖాళీ అవ్వడం ఖాయం.

నకిలీ లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి
సైబర్‌ నేరగాళ్లు ప్రభుత్వ పథకాల పేరుతో లింక్‌లు పంపుతున్నారు. వాటిని ఓపెన్‌ చేస్తే సైబర్‌ నేరగాళ్ల మాయలో చిక్కినట్లే అవుతుంది. ఎవరైనా సైబర్‌ మోసానికి గురైనా, ఫోన్‌ హ్యాక్‌ అయ్యి తమ ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు పోతే వెంటనే సైబర్‌ క్రైం హెల్ప్‌ నంబర్‌ 1930కి డయల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
– మన్మథకుమార్‌, చౌటుప్పల్‌ సీఐ

 

క్లిక్‌ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ1
1/2

క్లిక్‌ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ

క్లిక్‌ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ2
2/2

క్లిక్‌ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement